లీటర్ తేలు వి*షం ఎన్ని కోట్లో తెలుసా?
ఇంట్లో తమకు నచ్చే జంతువులను పెంచుకోవడం చాలా మందికి అలవాటు. నార్మల్‌గా అంతా ఇంట్లో కుక్కలను పెంచుతుంటారు. కొందరు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులతో పాటు ఆవులు, గేదెలు లాంటి పశువులను కూడా పెంచుకుంటారు.

ఇంట్లో తమకు నచ్చే జంతువులను పెంచుకోవడం చాలా మందికి అలవాటు. నార్మల్‌గా అంతా ఇంట్లో కుక్కలను పెంచుతుంటారు. కొందరు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులతో పాటు ఆవులు, గేదెలు లాంటి పశువులను కూడా పెంచుకుంటారు. కొన్ని దేశాల్లో సింహాలు, పులులు లాంటి మృగాలను సైతం పెంచుకుంటారు. కానీ విష ప్రాణులను ఎవరైనా పెంచుకుంటారా ? సాధారణంగా అయితే పెంచుకోరు. పాములను ఆడిస్తూ జీవనం సాగించే వర్గాలు కూడా వాటిలో విషపు కోరలను పీకేసిన తర్వాతే పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది విషపూరితమైన తేళ్లను పెంచుకుంటున్నారు. తేళ్లకు వాటి తోకలో విషం ఉంటుంది. ఆ విషం ఎంత డేంజరెస్ అనేది అందరికీ తెలుసు. కానీ ఆ డేంజర్ వెనకే అదిరిపోయే బిజినెస్ ఉంది. అందుకే ఇప్పుడు చాలా మందికి తేలు పెట్‌గా మారిపోతోంది. తేలు తోకలో ఉండే విషమే అద్భుతమైన ఔషధంగా మారింది.
కేన్సర్ సహా నరాలకు సంబంధించిన అనేక రుగ్మతలను నయం చేసే చికిత్సలో ఉపయోగపడుతోంది. అందుకే.. ఒక లీటర్ తేలు విషం మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తోంది. అంటే మన కరెర్సీలో అటూ ఇటూగా దాదాపు 8 కోట్లు. దీంతో తేళ్ల పెంపకంపై చాలా మంది దృష్టి పెట్టారు. విషం అంటే ప్రాణాలు తీస్తుంది. లేదంటే ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కానీ తేలు విషంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అందులో ఉన్న ఔషధ గుణాలతో కొన్ని రకాల వ్యాధులు, రుగ్మతలకు చికిత్స అందించవచ్చని తేల్చారు. ముఖ్యంగా కేన్సర్, న్యూరోలాజికల్ డిజార్డర్స్, కార్డియో డిసీజెస్‌ను నయం చేయడంలో దివ్యౌషధంగా వినియోగించవచ్చని అనేక పరిశోధనలు తేల్చాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఈ విషాన్ని ఔషధంగా మార్చి వినియోగిస్తున్నారు. తేలు విషంలో ఉండే పెప్టైడ్ కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయని పరిశోధనల్లో నిరూపితమైంది. గ్లియోమాస్, ల్యుకేమియా, బ్రెయిన్ ట్యూమర్లు, రొమ్ము క్యాన్సర్ సహా అనేక రకాల కేన్సర్‌కు చికిత్స అందించడంలో తేలు విషంలోని పెప్టైడ్ సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. న్యూరోబ్లాస్టోమా, మెలనోమా వంటి అరుదైన నాడీ సంబంధ రుగ్మతలతో పాటు ఇతర నరాల వ్యాధులకు చికిత్సలో తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే రక్తనాళాలు – హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలోనూ తేలు విషం విశేషంగా పనిచేస్తోందని గుర్తించారు. కేవలం చికిత్సలోనే కాదు, వ్యాధినిరోధకంగానూ దీన్ని ఉపయోగించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, అనాల్జిక్ ఔషధాల తయారీలోనూ తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు. పురుగు మందుల నివారణ, టీకాల తయారీలో సైతం తేలు విషం విశేషంగా ఉపయోగపడుతోంది. వీటన్నింటితో పాటు విషానికి విషమే విరుగుడు అన్నట్టుగా.. తేలు కాటు లేదా ఇతర విష పురుగుల కాటుకు గురైనప్పుడు ఆ విష ప్రభావాన్ని నిర్వీర్యం చేసే యాంటీ-వీనమ్ డ్రగ్స్ తయారీకి కావాల్సింది కూడా తేలు విషమే. అలాగే సౌందర్య సాధనంగానూ తేలు విషాన్ని వినియోగిస్తున్నారు. ఇంతటి ఔషధ గుణాలున్న తేలు విషానికి ఇప్పుడు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రాణాంతక రోగాలకు చికిత్సను అందిస్తూ మృత్యువు నుంచి కాపాడుతున్న ఈ తేలు విషం కోసం కొన్ని దేశాల్లో తేళ్ల పెంపకం సాగిస్తున్నారు. 2016 నుంచి ఈ పెంపకం ఊపందుకుంది. కొన్ని రకాల తేళ్ల నుంచి సేకరించే విషం.. ఒక గ్యాలన్‌కు 39 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 325 కోట్లు పలుకుతోంది. అంటే తేళ్ల పెంపకం ఎంత లాభదాయకమో అర్థం చేసుకోవచ్చు.