Dowry Rule: కట్నం తీసుకుంటే డిగ్రీ రద్దు.. హైకోర్టు తీర్పు అమలయ్యేనా!?
ప్రజెంట్ రెండు తెలుగు స్టేట్స్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడో ఒక దగ్గర రోజూ పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. పెళ్లి అనగానే అంతా ఫస్ట్ అడిగే క్వశ్చన్ కట్నం ఎంత అని. పెళ్లికొడుక్కి ఆడపిల్ల తరపు వాళ్లు ఎంతో కొంత వరకట్నం ముట్టజెప్తుండటం అలవాటు పడిన సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. కొందరు పెళ్లికొడుకులు మాత్రం కట్నం గట్టిగానే డిమాండ్ చేస్తుంటారు.
ఇక వరుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడంటే చాలు.. అమ్మాయి తరుఫు వాళ్లు భూములు జాగలు అమ్ముకోవాల్సిందే. అంతేనా.. పెళ్లిళ్లు అయిన తర్వాత కూడా అదనపు వరకట్నం కోసం వేధిస్తే.. వాటిని తట్టుకోలేక వివాహితలు చనిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమాజం ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఈ వరకట్నం విషయంలో మాత్రం ఇంకా పాత సంప్రదాయాలే అమలవుతుండటం బాధాకరం. అయితే.. ఇచ్చుకోగలిన వారి పరిస్థితి అలా ఉంచితే.. పేదవాళ్ల పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఇందుకోసమే కట్నం విషయంలో కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
దీనికోసం కేరళను మోడల్‌గా తీసుకోబోతోంది. “నేను వరకట్నం తీసుకోను.. ఇవ్వను.. ప్రోత్సహించను” ఇది కేరళలో యూనివర్సిటీల్లో చేరేముందు ప్రతీ విద్యార్థీ ఇవ్వాల్సిన హామీ. దీనిప్రకారం అగ్రీమెంట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ మాత్రమే కాదు. వాళ్ల పేరెంట్స్ సంతకాలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాతే స్టూడెంట్స్‌కు సీట్ అలాట్ చేస్తార్. భవిష్యత్తులో వారు వరకట్నం అడిగినా, తీసుకున్నా పోలీసులతో పాటు యూనివర్సిటీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై వర్సిటీ వాస్తవాలు తెలుసుకుని, ఆరోపణలు నిజమని తేలితే ఆ వ్యక్తి డిగ్రీని శాశ్వతంగా రద్దు చేస్తుంది. కేరళ యూనివర్సిటీలకు చాన్సలర్‌గా ఉన్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రెండేళ్ల క్రితం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
కేరళలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. వరకట్న వేధింపుల కేసులు దేశంలో ప్రతి ఏటా పెరుగుతున్నాయని ‘వుమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ వయోలెన్స్ కేసులు పెరుగుతుండగా.. ఈ జాబితాలో 50.4 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 75 శాతంతో అసోం మొదటి స్థానంలో, 48.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. డొమెస్టిక్ వయోలెన్స్‌లో అత్యధిక కేసులు వరకట్న వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం… ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.
ముఖ్యంగా వరకట్నం, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. దీంతో వరకట్నానికి వ్యతిరేకంగా కేరళ అనుసరిస్తున్న విధానంపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ సెంటర్ సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్న శ్రీనివాస్ మాధవ్ అధ్యయనం చేశారు. అక్కడ రెండేళ్ల క్రితం ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వరకట్నంపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన గుర్తించారు. ఇలాంటి విధానం తెలంగాణలోని యూనివర్సిటీలు కాలేజీల్లో అమలు చేస్తే బాగుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన పంపారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించింది. కేరళ ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించి, విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలో ఉన్నత విద్యామండలి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల నుంచి టాక్.