El Nino: ఎల్‌నినో ప్రభావంతో మరింత పెరగనున్న ఎండలు.. ప్రపంచ దేశాలు సిద్ధం కావాలంటున్న ఐరాస
పసిఫిక్ సముద్ర వాతావరణంలోని ఎల్‌నినో ప్రభావంతో సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది. కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఎల్‌నినో వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి.
El Nino; ఇప్పటికే తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందిపడుతున్న ప్రపంచానికి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది ఐరాస వాతావరణ సంస్థ. రాబోయే కొన్ని నెలల్లో ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన వాతావరణ మార్పులు ఉంటాయని హెచ్చరించింది. భూతాపం పెరుగుతుందని, అధిక ఉష్ణోగ్రతలు అనేక దేశాల్ని అతలాకుతలం చేస్తాయని హెచ్చరించింది. దీనికి అన్ని దేశాలు సిద్ధం కావాలని సూచించింది. పసిఫిక్ సముద్ర వాతావరణంలోని ఎల్‌నినో ప్రభావంతో సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది.
కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఎల్‌నినో వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. పాత రికార్డులు కూడా బద్ధలయ్యే అవకాశం ఉంది. టెంపరేచర్స్ పెరగడం, ఎండ ప్రభావం వంటివి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే అన్ని దేశాలు ఈ పరిస్థితులను అడ్డుకునేందుకు సిద్ధంగా తగిన చర్యలు చేపట్టాలని ప్రపంచ వాతావరణ శాఖ సెక్రెటరీ జనరల్ పాట్టెరి టాలస్ చెప్పారు. దీనివల్ల భూమిపై మానవులతోపాటు ఇతర జీవుల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. మరికొన్ని నెలలపాటు ఈ రకమైన వాతావరణ పరిస్థితులే ఉంటాయని, ప్రజల్ని ఈ విషయంలో అప్రమత్తం చేసి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణాన్ని చల్లగా చేసే ఎల్‌నినోకు సమానమైన లానినా దశ కొనసాగినప్పటికీ గత మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టాలస్ వివరించారు.
మానవ చర్యలూ కారణమే
ఎల్‌నినోతోపాటు మానవ చర్యలు కూడా భూతాపం, ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణం. ఇంధనాల వినియోగం వల్ల 2016లో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది.. 2016 నాటి రికార్డు బ్రేకయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల సముద్ర సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫలితంగా దక్షిణ అమెరికా, అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, సెంట్రల్ ఆసియాలో భారీస్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు ఇండోనేసియా, ఆస్ట్రేలియా, సెంట్రల్ అమెరికా, దక్షిణాసియాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు తాండవిస్తుంది. పసిఫిక్ సముద్రంలో భారీ సైక్లోన్లు రావొచ్చు. ఈ సముద్ర పరిధిలోని కోరల్ రీఫ్స్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మన దేశంలో రుతు పవనాల ప్రభావం తగ్గేందుకు ఎల్‌నినోనే కారణమవుతుంది. దీనివల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఫలితంగా వరితోపాటు ఇతర పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
వాతావరణ మార్పులకే కాదు.. ఆర్థిక పరమైన అంశాల్లోనూ ఎల్‌నినో ప్రభావం ఉంటుంది. దీనివల్ల అమెరికాలాంటి దేశాల ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల తగ్గుతుంది. అక్కడి ఆహారోత్పత్తుల నుంచి దుస్తుల ధరల వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం 1982-83లో ప్రపంచవ్యాప్తంగా 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టానికి ఎల్‌నినో కారణమైతే.. 1997-98లో 5.7 ట్రిలియన్ డాలర్ల నష్టానికి కారణమైంది. ఇది ఏటికేడు మరింత పెరుగుతుంది. సగటు ఉష్ణోగ్రతలు కూడా సాధారణంకంటే 1.5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వరదలు, తుఫానులు, దావానలం, ఆహార కొరత వంటి వాటికి కూడా కారణమవుతోంది. పారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని తగ్గించేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నించకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ప్రపంచ వాతావరణ శాఖ తెలిపింది.