Essential Goods: నెల రోజులుగా మండుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుల ఇక్కట్లు..!
అందరూ టమాటా ధరల గురించే మాట్లాడుతున్నారు కానీ.. ఇతర కూరగాయలు, పప్పులు, బియ్యం ధరలు కూడా భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.

Essential Goods: దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందరూ టమాటా ధరల గురించే మాట్లాడుతున్నారు కానీ.. ఇతర కూరగాయలు, పప్పులు, బియ్యం ధరలు కూడా భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని రకాల నిత్యావసరాలు కనీసం 10 శాతంపైగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
కేజీ టమాటా ధర రూ.140కిపైగానే ఉంది. పచ్చిమిర్చి ధర కూడా అమాంతం పెరిగి, రూ.100కు చేరింది. కేజీ చింతపండు ధర రూ.300దాకా పలుకుతోంది. కందిపప్పు కేజీ రూ.160 వరకు, పెసర పప్పు రూ.150, చాయ మినప్పప్పు రూ.140, ఎండుమిర్చి రూ.280-రూ.320 వరకు, రెండో రకం కారం కేజీ ధర రూ.260, వేరుశెనగలు రూ.140, మినప గుళ్లు రూ.130 వరకు ఉంటున్నాయి. వీటితోపాటు చక్కెర, బెల్లం, బియ్యం, నూనె, గోధుమ పిండి ధరలు కూడా ఇరవై శాతం వరకు పెరిగాయి. గతంలో రూ.40-రూ.50 మధ్య ధర పలికే కూరగాయలు ఇప్పుడు రూ.60కిపైగానే ధర పలుకుతున్నాయి. రోజువారీ ఆహారమైన బియ్యం ధరలు పెరగడం కూడా సామాన్యుడిని ఇబ్బంది పెడుతోంది. 25 కేజీల బస్తాపై రూ.100కు పైగా ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇంతగా పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించడం లేదు. ధరల పెరుగుదలపై కనీసం ప్రభుత్వాలు సమీక్ష కూడా నిర్వహించడం లేదు. ధరల్ని అదుపుచేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి సరిపడా నిత్యావసరాలు కొనలేక సతమతమవుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి బడ్జెట్ సర్దుకోవడం కష‌్టంగా మారింది.
వర్షాల కారణంగా కొన్ని పంటలు చేతికందడం ఆలస్యమైతే, మరికొన్ని పంటలు గతంలో అకాలవర్షాల వల్ల దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో సరైన స్థాయిలో ఆహార పంటలు అందుబాటులో లేవు. ముఖ్యంగా గత సీజన్‌లో అకాల వర్షాల వల్ల వరి పంట దెబ్బతింది. దీంతో మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడింది. ఫలితంగా బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బాస్మతియేతర బియ్యాన్ని ఎగుమతి చేయడం నిషేధించింది. వర్షాలు తగ్గుముఖం పట్టి, కొత్త పంట చేతికొచ్చేంత వరకు నిత్యావసరాల పెరుగుదల తప్పదు. అప్పటివరకు సామాన్యులు ఈ భారాన్ని మోయాల్సిందే.