Fact check: శవ రాజకీయాలు! ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ అడ్డగోలు పోస్టులు!
అసలు తమ వాళ్లు బతికి ఉన్నారో లేదోనన్న టెన్షన్‌తో ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన బాధిత కుటుంబాలు విలవిలలాడుతుంటే మరోవైపు అప్పటివరకు మతం పిచ్చిలో ములుగుతున్న ఓ మతం వీరులు నిద్రలేచారు.
Fact check: ఫేక్ బతుకులు మారవు..! సమయం, సందర్భం ఉన్నా లేకున్నా.. అవతలి వాళ్లపై విషం చిమ్మడం ఈ మధ్య కాలంలో సర్వసాధరణమైపోయింది. ఒడిశా రైళ్ల ప్రమాద ఘటనలోనూ అదే జరిగింది. ఫేక్ న్యూస్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది.
గుర్తుపట్టలేని విధంగా శవాలు.. తమ పిల్లలెవరో.. భార్య ఎక్కడుందో.. భర్త ఆనవాళ్లు ఏవో.. తల్లిదండ్రులు ఇప్పటికైనా ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో.. అసలు తమ వాళ్లు బతికి ఉన్నారో లేదోనన్న టెన్షన్‌తో ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన బాధిత కుటుంబాలు విలవిలలాడుతుంటే మరోవైపు అప్పటివరకు మతం పిచ్చిలో ములుగుతున్న ఓ మతం వీరులు నిద్రలేచారు. దొరికిందే ఛాన్స్ అని మరో మతంపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. ఘటనకు ‘ఆ మతమే’ కారణమంటూ అడ్గగోలు పోస్టులు పెట్టారు. అసలు శవ రాజకీయాలు చేయడం పార్టీ కార్యకర్తలకు కూడా పాకడం చూస్తుంటే దేశం ఎక్కడ నుంచి ఎక్కడకు పోతుందోనన్న భయం కలుగుతుంది..!
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం.. వేరే మతాలపై బురద జల్లడం.. దాదాపు అన్ని వర్గాల పార్టీ కార్యకర్తలకు ఇటివలి కాలంలో బాగా అలవాటైపోయిన విషయం. సోషల్‌మీడియాలో ఐటీ వింగ్‌లు ఎలాగో ఉన్నాయి. నోటికి వచ్చింది.. చేతికి అందిన అక్షరాలతో అడ్గగోలుగా ఏది రాసినా పట్టించుకోకుండా షేర్లు, రీట్వీట్లు చేసే అంధభక్తులు ఎలాగో ఉన్నారు. వాటిని వాట్సప్‌లో కనీసం క్రాస్ చెక్ కూడా చేసుకోకుండా ఫార్వార్డులు చేసే చదువుకున్న మేధావులు కూడా ఉండనే ఉన్నారు. ఇంక ఇంతకంటే మంచి స్పేస్ ఏముంటుంది. ఒడిశా రైళ్లు ప్రమాద ఘటన జరిగిన పక్కనే ఓ మసీదు ఉందని.. ఈ ప్రమాదానికి ‘వాళ్లే దేవుడే’ కారణమంటూ పిచ్చి పోస్టులు మొదటగా దర్శనమిచ్చాయి. అయితే అది మసీదు కాదు అని.. ఇస్కాన్ టెంపుల్ అని అక్కడి స్థానికులు ఇచ్చిన సమాచారంతో పాటు.. ఫ్యాక్ట్ చెక్‌లోనూ తేలింది.
అయినా ‘వీరులకి’ బుద్ధి రాలేదు. ఘటన జరిగింది శుక్రవారం అని.. అంటే అది ‘వాళ్ల దేవుడి’ రోజు అని వాదించడం మొదలుపెట్టారు. ఇదేం పిచ్చో అర్థంకాలేదు. ఇప్పుడు ఘటన ఆదివారమో.. సోమవారమో జరిగితే మిగిలిన దేవుళ్లని బాధ్యులను చేస్తారా..? అసలు వారానికి.. దేవుడికి సంబంధమేంటి..? ఏమో ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఘటనకు ఎవరు బాధ్యులో సీబీఐ తేల్చుతానంటోంది. ఈలోపు ఈ విష ప్రచారాలు దేనికి..? ఇక వారాలను చూపిస్తూ వేరే మతంపై దాడి చేయడంతోనే అంతా ముగిసిపోలేదు.. వాళ్లకి మరో అస్త్రం దొరికింది.. అదే స్టేషన్ మాస్టర్..!
ఒడిశా ప్రమాదానికి రైల్వే అధికారి మహమ్మద్ షరీఫ్ కారణమన్న ఓ వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అతను పరారీలో ఉన్నాడంటూ ట్వీట్లు, రీట్వీట్లు పోటెత్తాయి. ఇదంతా పాక్ కుట్ర అని.. మనదేశంలో పరాయి దేశం కోసం పనిచేసేవాళ్లు ఇంకా ఉన్నారని ..వాళ్లందరిని తరిమేయాలని కామెంట్లు కనిపించాయి. పబ్లిసిటీ స్టంట్లు కోసం ఒకే ట్రైన్‌ని ప్రతీచోటా జెండా ఊపి, ఫోటోలకు ఫోజులిస్తున్న ‘అగ్రనేత’లు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆయన భక్తులు చేయాల్సింది అంతా చేశారు. ఫేక్ న్యూస్‌తో జనాల మైండ్‌ని డైవర్ట్ చేయాలని చూశారు. అయితే నిజం నిప్పులాంటిది. అది ఎప్పటికైనా బయటపడుతుంది. అసలు మహమ్మద్ షరీఫ్ అనే రైల్వే అధికారి లేనే లేడు అని, ఇదంతా తప్పుడు ప్రచారం అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. అయితే ఈ సమస్య ఇక్కడితో ముగుస్తుందనుకుంటే ఉప్పు లేని పప్పులో కాలేసినట్టే..! ఎందుకుంటే రేపు ఇంకో ఫేక్ న్యూస్ బయటకు వస్తుంది.. ఆ తర్వాత మరొకటి.. దీనికి అంతే ఉండదు..!