Feb 23rd Digitalization Day: నేడు 21వ శతాబ్ధపు డిజిటల్ యుగానికి ప్రత్యేకమైన రోజు

నేటి సమాజంలో ఎటు చూసినా డిజిటలైజేషన్ పాత్రే కనిపిస్తుంది. ఉదయం లేచి న్యూస్ చూసేందుకు ఈ పేపర్ ఓపెన్ చేసే మొదలు.. రాత్రి పడుకొని ఏవైనా వెబ్ స్టోరీలు చదువుకునే వరకూ అన్నీ డిజిటల్లోనే జరిగిపోతున్నాయి. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి దగ్గర నుంచి పాఠశాలలో విద్యను అభ్యసించే పసి పిల్లవాడి వరకూ అందరూ డిజిటల్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే ఈ డిజిటల్ పేరు మీద ఒక రోజును జరుపుకుంటున్నారు. దీనిని ఎందుకు జరుపుకుంటారు..? ఎలా జరుపుకుంటారు..? ఇలా జరుపుకోవడానికి గల కారణాలు..? దీని ప్రాముఖ్యం..? ప్రయోజనాలేమిటో చూసేద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2023 | 04:39 PMLast Updated on: Feb 23, 2023 | 4:54 PM

Feb 23rd Digitalization Day Special Story

డిజిటల్ లెర్నింగ్ డేని (Digital Learning Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి గురువారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది ఫిబ్రవరి 23న జరుగుతుంది. డిజిటల్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా విద్యార్థులను అందులో నిమఘ్నం చేసి విద్యకు కావల్సిన సరైన వనరులను అందుబాటులో ఉంచేందుకు అవసరం అవుతుంది. అలాగే తరగతిలో పాఠాలు బోధించే అధ్యాపకులను శక్తివంతం చేయడానికి అలయన్స్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ (Alliance for Excellent Education) వారి నేతృత్వంలో ప్రతిఏటా కొనసాగుతున్న కార్యక్రమం ఇది. ప్రత్యేకించి, విద్యార్థుల అభ్యాస అనుభవాలను బలోపేతం చేయడానికి సాంకేతికతను వినూత్న మార్గాల్లో ఉపయోగించే ముందుచూపు గల విద్యావేత్తల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంది. అధ్యాపకులు లేదా కాబోయే ఉపాధ్యాయుల కోసం నైపుణ్యం ఇచ్చేందుకు ఒక డిగ్రీని రూపకల్పన చేసేందుకు చూస్తున్నారు. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులే కాకుండా డిజిటల్ లెర్నింగ్ యుగంతో ముడిపడి ఉన్న వ్యక్తుల కోసం ఒక అంతర్జాతీయ వేడుకను ఏర్పాటుచేశారు. అందుకే దీనిని ‘డిజిటల్ లెర్నింగ్ డే’ అని పిలుస్తారు. ఇది విద్యలో సాంకేతికతను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది. విద్య యొక్క పరిధిని విస్తృతం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యాపరమైన అభ్యాస వనరులను అవకాశాలతో అనుసంధానం చేసి దాని సామర్థ్యాన్ని మరింత అభివృద్ది చేయాలనే లక్ష్యంతో దీనిని జరుపుకుంటారు.

డిజిటల్ లెర్నింగ్ డే చరిత్ర 
ఇది మొదటిసారి 2012లో అలయన్స్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ గుర్తించింది. ఇది వాషింగ్టన్, D.C.లో ఉంది. ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థ. విద్యార్థులకు విద్యలోని నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి డిజిటల్ లెర్నింగ్ డే ఫిబ్రవరి 1, 2012న నిర్వహించబడింది. ఇది డిజిటల్ లెర్నింగ్ యొక్క ప్రయోజనాలను ప్రదర్శించడానికి యునైటెడ్ స్టేట్స్‌లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఒక వేదిక. అలాగే డిజిటలైజేషన్ ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన జాతీయ ప్రచారంగా చెప్పవచ్చు. అందుకే అప్పటి నుండి డిజిటల్ లెర్నింగ్ డే ఒక గ్లోబల్ ఉద్యమంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, పాఠశాలలు, సంస్థలు డిజిటల్ లెర్నింగ్‌లో వినూత్న అభ్యాసాలను ప్రదర్శించడానికి, పంచుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటారు. 2013లో, అలయన్స్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో నేషనల్ రేటింగ్ ప్రాజెక్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్, వెరిజోన్ ఫౌండేషన్ ఈవెంట్ ఈ మూడింటి యొక్క పరిధిని, ప్రభావాన్ని విస్తరించడానికి చాలా ఉపయోగపడింది.

డిజిటల్ లెర్నింగ్ డే ప్రాముఖ్యత:
డిజిటల్ లెర్నింగ్ డే అనేది ఒక ముఖ్యమైన రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రస్తుత 21″ శతాబ్దంలో ప్రస్తుత డిజిటల్ యుగంలో బోధన మరియు అభ్యాసాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించాల్సిన ఆవశ్యకతను గురించి బలంగా చెబుతుంది. ఈ రోజుల్లో, విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందడానికి సాంకేతికతతో పాటూ సరైన వనరులు కూడా అవసరం.

digitalization

digitalization

డిజిటల్ లర్నింగ్ డేని జరుపుకోవడానికి ప్రధాన కారణాలు:
ఇన్నోవేషన్‌ను శ్రీకారం చుట్టడం – సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించి వినూత్న బోధనా పద్ధతులకు ఆజ్యం పోస్తుంది. ఇది ఉపాధ్యాయులకు వారి విజయాలను, తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులకు తెలిపేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. దీనిని చదవడం ద్వారా ఇతర ఉపాధ్యాయులను కూడా ఇలాంటి రకమైన ఆలోచనలకు వ్యూహాలను అనుసరించేలా ప్రేరేపించగలదు.

అవగాహన పెంచడం – ఇలాంటి ప్రత్యేకమైన రోజులను ఏర్పాటు చేయడం వల్ల డిజిటల్ లో చదివేవారిని గుర్తించడం ద్వారా వారు చదివే విషయాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. ఈ రకమైన ఈవెంట్‌తో, విద్యార్థుల కెరీర్‌ను రూపొందించడంలో చురుగ్గా వ్యవహరిస్తారు. తమకంటే ఎక్కువ జ్ఞానాన్ని ఎలా సమపార్జన చేస్తున్నారనే ఆసక్తి తోటివారిలో కలుగుతుంది. తద్వారా వారి విద్యా విజయాన్ని ప్రోత్సహించడంలో డిజిటల్ సాధనాలతో పాటూ సాంకేతికత ప్రదానమైన భూమిక పోషిస్తుందని చెప్పాలి.

సహకారాన్ని ప్రోత్సహించడం – టెక్నాలజీలోని సందేహాలను నివృత్తి చేయడానికి కొందరు రూపకర్తలను, ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తుంది. ఇలా చేయడం ద్వారా సమాచారాన్ని అందించేవారిని ప్రోత్సహించేందుకు కొందరు వాటాదారులు ముందుకు వస్తారు. ఇలా ఒకరికొకరు విషయాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా విద్యార్థలకు అభ్యాసంలో సరికొత్త అవకాశాలు, సందేహాలకు పరిష్కారాలు లభిస్తాయి. సమాచారం అందరికీ అందుబాటులో వచ్చేందుకు దోహదపడుతుంది.

విస్తరిస్తున్న యాక్సెస్- ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనరులు, అవకాశాలతో విద్యార్థులను మమేకం చేయడానికి సాంకేతికత యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. ఇలా చేయడం ద్వారా విద్యకు ప్రాధాన్యతను పెంచడంలో సహాయపడగలం. విద్యార్థులు ఎక్కడ నివసిస్తున్నారు.. వారికి ఎలాంటి విషయాలపై ఆసక్తి.. వారికి కావల్సిన సమాచారం ఏమిటి.. ఇలా వారి నేపథ్యం ఏమైనా ఉండనీ డిజిటల్ సాధనాల సహాయంతో ఈ విద్యార్థులకు అధిక నాణ్యత గల అభ్యాస కార్యక్రమాలకు అవకాశాలను విస్తరించడంలో కీలకపాత్ర వహించవచ్చు.

డిజిటల్ లెర్నింగ్ ప్రయోజనాలు:
సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. సరైన నాణ్యమైన సమాచారం కోసం ఎక్కడెక్కడికో వెళ్లనవసరం లేదు. వ్యయాప్రయాసలకు గురికావల్సి ఉండదు. రవాణా ఖర్చులు మిగిలిపోతాయి. ఇంట్లోనే ఉండి చూసుకోవచ్చు.

డిజిటైజ్ చేయబడిన కంటెంట్ అందుబాటులో ఉండటంవల్ల అందంగా కనిపిస్తుంది. సాధారణ మెటీరియల్, టెక్స్ట్ బుక్స్ అయితే తెల్లని పేజీలో నల్లని అక్షరాలతో ఉంటుంది. దీనివల్ల చదివేందుకు ఆసక్తి ఉండదు. ఈ డిజిటల్ చేయబడిన కంటెంట్ లో అయితే చూసేందుకు వీలుగా, చదివేందుకు ఆసక్తిగా ఉంటుంది.

సమయ పరిమితి లేదు. ఈ సమయంలోపు మాత్రమే చదవాలి అనే ఆలోచన, ఆందోళన ఉండదు. ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు.

మీ స్వంత వేగంతో నేర్చుకోవచ్చు. మనం ఎంత నెమ్మదిగా చదివినప్పటికీ అక్షరాలు మాయమైపోవు. నెమ్మదిగా స్క్రీన్ పై స్క్రోల్ చేస్తూ ఎంత సేపు చదవగలమో అంతవరకూ మాత్రమే చదివే వెసులుబాటు ఉంటుంది. మిగిలింది కాసేపు ఆగి చదువుకోవచ్చు.

ఆన్‌లైన్ లెర్నింగ్ ఎటు చూసినా పెరుగుతోంది. ఒకప్పుడు పేపర్లో చదివేవాళ్లం. కానీ ఇప్పుడు మొబైల్స్, ల్యాప్ టాప్ మీద, మానిటర్ స్క్రీన్ ల పైన చదువుకునే రోజులు వచ్చేశాయి. దీంతో పేపర్ క్యారీ చేసి ఒక ఇరిటేషన్ ఫీలింగ్ కు చెక్ పెట్టవచ్చు. అలాగే భద్రపరుచుకుంటే పేపర్ కొన్ని రోజులకు పాడైపోతుందనే భయం ఉండదు. అందుకే దీనికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.

స్థలాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. మనం ఒక ప్రదేశంలో ఉండి ఒక విషయం గురించి చదివి విషయాన్ని తెలుసుకుంటే మరో ప్రదేశంలోకి వెళ్లి మరో విషయాన్ని చదువుకోవచ్చు. ఫలానా ప్రాంతం వారికే ఈ విషయం చదవే అవకాశం ఉంది. వేరే వారికి ఈ అవకాశం లేదు అనే నిబంధన ఏమీ లేదు.

 

 

T.V.SRIKAR