Women in jobs: సమాజం మారడంలేదు.. అదంతా ట్రాష్! ఫ్రూఫ్ ఇదిగో..! ఉద్యోగాల్లో మహిళల శాతంపై షాకింగ్ రిపోర్ట్!
2005లో 32శాతంగా ఉన్న మహిళా ఉద్యోగ రేటు ఇప్పుడు 19శాతానికి పడిపోయింది. అంటే మళ్లీ మనం వెనక్కి వెళ్తున్నట్టు లెక్క..! అటు పురుషుల్లో 70 శాతం మంది ఉద్యోగలు చేస్తున్నారు. అంటే జెండర్ గ్యాప్ దాదాపు 50శాతం ఉంది.
Women in jobs: ఆడవాళ్లు దూసుకెళ్తున్నారని.. ఉద్యోగ రంగంలో పురుషులకు సమానంగా నిలుస్తున్నారని.. ఆ మధ్య చాలా మంది విమెన్స్ డే రోజు డబ్బా కొట్టినట్టు గుర్తు..! అయితే అదంతా అబద్ధమని.. ఉద్యోగ రంగంలో మహిళలు ఈనాటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వేల సంవత్సరాల పాటు విద్యకు నోచుకోని అమ్మాయిలకు సావిత్రిబాయి ఫూలే, ఆమె భర్త జ్యోతిరావ్ ఫూలే కృషి కారణంగా 1848లో తొలిసారి స్కూల్ గడప తొక్కే అవకాశం దక్కింది. అంటే సరిగ్గా 175 ఏళ్ల క్రితం అమ్మాయిలు పాఠశాలకు వెళ్లారు. అంతకుముందు గురుకులాలు ఉన్నా అవి కొంతమందికి మాత్రమే. ఆడవాళ్లకు ప్రవేశం లేని కాలం అది. తొలి బాలికల పాఠశాల ఏర్పడిన 99ఏళ్లకి 1947లో మనకు బ్రిటిష్ నుంచి స్వాతంత్రం లభించింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులు కూడా మారుతూ వచ్చాయి. 70, 80దశకాల్లో ఇండియాను పట్టి పీడించిన నిరుద్యోగ సమస్య 1991 సంస్కరణల తర్వాత చాలా వరకు తగ్గింది. స్త్రీ చదువుకుంటూనే ఎక్కువ అనే దుస్థితి పోయింది. మహిళలు ఉద్యోగాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005 నాటికి దేశంలో 35శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే అక్కడ నుంచి సైకిల్ రివర్స్ అయ్యింది. తాజాగా అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
2005లో 32శాతంగా ఉన్న మహిళా ఉద్యోగ రేటు ఇప్పుడు 19శాతానికి పడిపోయింది. అంటే మళ్లీ మనం వెనక్కి వెళ్తున్నట్టు లెక్క..! అటు పురుషుల్లో 70 శాతం మంది ఉద్యోగలు చేస్తున్నారు. అంటే జెండర్ గ్యాప్ దాదాపు 50శాతం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం మన దేశం 146 దేశాల్లో 135స్థానంలో నిలిచింది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పొరుగు దేశాల కంటే మనం ఈ విషయంలో వెనుకబడి ఉన్నాం. అవి మనకంటే చాలా చిన్నదేశాలు. మన తర్వాతే స్వాతంత్రం సాంపాదించుకున్న దేశాలు. ఇక ఇదంతా వేతనంతో కూడిన ఉద్యోగాల రేటు.
మన దేశంలో మహిళా ఉపాధి రేటు తక్కువగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. మహిళలు తరచుగా పురుషుల కంటే తక్కువ గంటలు పనిచేస్తారన్న భావన ప్రైవేట్ కంపెనీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకవేళ పురుషుల కంటే ఎక్కువగా లేదా సమానంగా మహిళలు పనిచేసినా ఇచ్చే జీతంలో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంతో విసుగు చెంది ఉద్యోగాలు మానేసే స్త్రీలు కూడా ఉన్నారు. ఇక సంప్రదాయంగా మహిళలపై సమాజంలో గూడు కట్టుకున్న వివక్ష చెరిగిపోకుండా అలానే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ‘ఆమె’పై చిన్నచూపు అలానే ఉంది. అబ్బాయిలే ఉద్యోగాలు చేయాలని.. అమ్మాయిలు ఇంటి వద్దే ఉండాలన్న ధోరణి ఈనాటికీ ఉంది. నిజానికి భార్యభర్తలు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయాలను సమాజమే నిర్ణయించి పడేసింది. అందుకే పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు మాత్రం చేయని ఆడవాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంటుంది. నిజానికి ఆకాశంలో సగం ఆమెదేనంటారు. కానీ అన్నీ చోట్లా పురుషులే ఉంటారు. అవన్నీ పైపై మాటలు మాత్రమే. ఇటు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి రానుంది. ప్రస్తుత గ్రోత్ రేటు ప్రకారం.. ప్రపంచ కార్మిక శక్తి పూర్తి లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి 132 సంవత్సరాలు పడుతుందని అంతర్జాతీయ కార్మిక సంస్థనే చెప్పడం.. ప్రపంచ దేశాల్లో గూడుకుట్టుకుపోయిన లింగ వివక్షను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.