Financial Crisis: అప్పు కోసం ఆయుధాలు అమ్ముకుంటున్న పాక్..

టైటిల్‌తోనే అర్థమైపోతుంది పాక్ పరిస్థితి.. ఆర్థిక ఇక్కట్లలో ఉన్న పాకిస్తాన్ ఉక్రెయిన్‌కు యుద్ధట్యాంకులు సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. అందుకు బదులుగా అప్పు ప్లీజ్ అంటూ అగ్రరాజ్యాల ముందు చేతులు చాస్తోంది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2023 | 04:45 PMLast Updated on: Mar 21, 2023 | 4:45 PM

Financial Crisis In Pakisthan

‘అప్పు’డే తెల్లారిందా అన్నట్లుంది మన దాయాది పాకిస్తాన్ పరిస్థితి. వడ్డీలేని రుణం కోసం వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకుంటోంది. కానీ పనికావడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన యుద్ధట్యాంకులను అమ్ముకుంటోంది. దానికి సాయం అనే పేరు పెడుతోంది. ఉక్రెయిన్‌కు 44 టీ-80యుడీ(ఎంబీటీ) యుద్ధ ట్యాంకులు పంపేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. దీనికి బదులుగా పాక్ పశ్చిమ దేశాల నుంచి ఆర్థికసాయం కోరింది.

ప్రస్తుతానికి పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. మిత్రదేశాలే సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ సంక్షోభ సమయంలో వడ్డీలేని రుణం ఇవ్వడానికి ఏ దేశం కూడా అంగీకరించడం లేదు. దీంతో పశ్చిమదేశాల ముందు చేయిచాచింది. అయితే నేరుగా రుణం ఇవ్వడానికి అంగీకరించని ఆ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం అంశాన్ని తెరపైకి తెచ్చాయి. దీంతో 44 ఎంబీటీ యుద్ధట్యాంకులు పంపేందుకు పాక్ అంగీకరించింది. పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం 2,467ఎంబీటీలు ఉన్నాయి. ఇవి సోవియట్ హయాం నాటి టీ-80యుద్ధ ట్యాంకులకు అప్‌గ్రేడెడ్ వర్షన్. గతంలో యుక్రెయిన్ నుంచే వీటిని పాక్ కొనుగోలు చేసింది. 30ఏళ్లలో యుక్రెయిన్‌ నుంచి 160కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను పాక్ కొనుగోలు చేసింది. ఇప్పుడు కొన్ని ఆయుధాలను సాయం పేరుతో అమ్ముకోవాల్సిన దుస్థితి పొరుగుదేశానికి వచ్చింది. కరాచీ పోర్టు నుంచి జర్మనీ మీదుగా ఈ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరనున్నాయి.

అమెరికా లాంటి అగ్రదేశాలు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేస్తూ వచ్చాయి. రకరకాల ఆయుధాలు పంపాయి. ఇటీవల పోలెండ్‌ యుద్ధవిమానాలు కూడా పంపడానికి అంగీకరించింది. అయితే ఇవన్నీ రష్యా మీద కోపంతోనో, యుక్రెయిన్‌ మీద ప్రేమతోనే లేకపోతే అమెరికా అంటే భయపడో సాయానికి ముందుకొచ్చాయి. కానీ పాక్ మాత్రం అలా కాదు.. కేవలం అప్పు కోసం ఈ పాడుపనికి దిగాల్సి వస్తోంది. నిజానికి దాని దగ్గర అవసరానికి మించిన ట్యాంకులు లేవు. చాలా ట్యాంకులు రిపేర్లకు నోచుకోక నెట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పాక్ తప్పక ఈ చర్యకు దిగినట్లే భావించాలి. డబ్బులేక సైనికులకే సరిగ్గా తిండిపెట్టలేని పరిస్థితుల్లో ఉంది పాక్.. సైనిక బడ్జెట్‌కు అడ్డంగా కోతపెట్టింది.

యుక్రెయిన్ యుద్ధ ప్రారంభంలో పాకిస్తాన్ రష్యాకు మద్దతుగా నిలిచింది. అప్పట్లో అమెరికా సహా చాలా దేశాలు తప్పుపట్టినా మా తీరు అదే అన్నట్లు వ్యవహరించింది. చైనా చెప్పినట్లే ఆడింది. కానీ ఇప్పుడు అప్పుల తిప్పలు చుట్టుముట్టేసరికి యుక్రెయిన్‌కు సాయం అంటూ ముందుకొచ్చింది. అంతేలే కూటి కోసం కోటి తిప్పలు.. అప్పుకోసం అడ్డమైన పాట్లు..