Assam Floods: వరద ముంపులో అసోం.. లక్ష మందికిపైగా నిరాశ్రయులు.. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోం అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 20 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. అందులో పది జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంది. దాదాపు 1.2 లక్షల మంది వరద ప్రభావానికి గురై నిరాశ్రయులయ్యారు.
Assam Floods: ఒక పక్క దేశంలో అనేక చోట్ల ఇంకా వర్షాలు ప్రారంభమవ్వకుండా, ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతుంటే అసోం మాత్రం వరదల్లో చిక్కుకుంది. ఇప్పటికే పది జిల్లాల్లో వరద ప్రభావం ఉండగా.. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు మరింత కలవరపెడుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోం అతలాకుతలమవుతోంది.
1.2 లక్షల మంది నిరాశ్రయులు
ఇప్పటికే 20 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. అందులో పది జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంది. దాదాపు 1.2 లక్షల మంది వరద ప్రభావానికి గురై నిరాశ్రయులయ్యారు. బక్సా, బార్పేట, దర్రాంగ్, ధెమాజి, ధుబ్రి, లఖీంపూర్, నల్బరి, సోనిత్ పూర్, కొక్రాఝర్, ఉదల్‌గురి జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. మోకాలిపైగా లోతు వరద గ్రామాల్ని ముంచెత్తింది. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర, కేంద్ర విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ, పారామిలిటరీ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, సివిల్ ఆఫీసర్స్, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం సహాయక శిబిరం ఏర్పాటు చేసి, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు.
భారీ పంట నష్టం
వర్షాలు, వరద ప్రభావంతో అనేక జిల్లాల్లో పంటలు భారీగా నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. మూడు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. చాలా చోట్ల ఇండ్లు, రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. నగరాలు కూడా కొన్నిచోట్ల నీట మునిగాయి. ఇప్పటికే ఇంతటి నష్టంతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరో రెండు, మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించడం మరింత కలవరపెడుతోంది. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే స్థానిక బేకి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. వర్షాలు ఇంకా కురిస్తే వరద ప్రభావం భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు మరిన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అసోంలో ప్రతి సంవత్సరం వరదలు సాధారణంగానే వస్తుంటాయి. గతేడాది కూడా అసోంను వరదలు ముంచెత్తాయి.