France Racism: ఏ దేశ చరిత్ర చూసినా.. నరనరాల్లో జాత్యహంకారమే..!
అమెరికాలోనే పుట్టి ఉండొచ్చు.. లేదా ఫ్రాన్స్‌లో తొలి అడుగులు పడి ఉండొచ్చు. అయినా సరే.. మూలాలు ఎక్కడా అన్న ప్రశ్న శ్వేతజాతీయుల మనస్సులో గూడుకట్టుకుని ఉంటుంది. రంగు, రూపు, మాట తీరు ఆధారంగా గుర్తుపట్టేస్తారు. అప్పటి నుంచే వాళ్లు చూసే చూపుల్లో తేడా ఉంటుంది.
France Racism: రెండు సందర్భాలు.. నలుగురు వ్యక్తులు. అందులో ఇద్దరు పోలీసులు.. మరో ఇద్దరు ఆ పోలీసుల జాత్యహంకారానికి బలైపోయిన బాధితులు. ఒకడు తెల్లోడి బూటు కాలుకింద నలిగిపోయి ప్రాణాలు విడిస్తే.. మరొకడు.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో దిగిన తూటాకు నేలకొరిగాడు. అమెరికా శ్వేతజాతీయుల్లో నరనరాల్లో జీర్ణించుకున్న జాతివివక్ష జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని పొట్టనపెట్టుకుంటే.. ట్రాఫిక్ ఉల్లంఘన పేరుతో తెల్లతోలుకప్పుకున్న ఫ్రాన్సు పోలీసు ఇంకొకరి రక్తం కళ్లచూశాడు. అమెరికా నుంచి ఫ్రాన్స్ వరకు ఈ రెండు ఘటనలు ప్రపంచానికి చెబుతున్నది ఒక్కటే. జాత్యహంకారం ఇంకా బతికే ఉందని. అది ఏదో ఒకరూపంలో ఎక్కడో ఒక చోట.. సాటి మనిషి ప్రాణాలను అలవోకగా తోడేస్తుందని.
వాళ్ల మైండ్ సెట్ ఎప్పుడూ అంతేనా ?
అమెరికాలోనే పుట్టి ఉండొచ్చు.. లేదా ఫ్రాన్స్‌లో తొలి అడుగులు పడి ఉండొచ్చు. అయినా సరే.. మూలాలు ఎక్కడా అన్న ప్రశ్న శ్వేతజాతీయుల మనస్సులో గూడుకట్టుకుని ఉంటుంది. రంగు, రూపు, మాట తీరు ఆధారంగా గుర్తుపట్టేస్తారు. అప్పటి నుంచే వాళ్లు చూసే చూపుల్లో తేడా ఉంటుంది. పుట్టుక ద్వారా అమెరికన్ పౌరసత్వమో.. లేక ఫ్రాన్స్ పౌరసత్వమో వచ్చి ఉండొచ్చు గాక. కానీ తరాలు వెనక్కి వెళ్లే కొద్దీ మూలాలు ఎక్కడున్నాయన్నదే వాళ్ల ప్రశ్న. పేరుకు ప్రజాస్వామ్య దేశాలుగా, మానవ హక్కులకు అధిక ప్రాధాన్యతనిచ్చే సమూహాలుగా కనిపించినా శ్వేత జాతీయుల బేసిక్ మైండ్ సెట్‌లో మాత్రం ఈ తేడా కచ్చితంగా ఉంటుంది. 2020లో అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ చేసిన నేరమైనా లేదా నిన్నగాక మొన్న పారిస్ వీధుల్లో 17 ఏళ్ల అల్జీరియా కుర్రాడు నహేల్ చేసిన నేరమైనా.. ఈ రెండూ ప్రాణాలు తీసేంత పెద్దవి కావు. కానీ తమ దేశానికి వలసవచ్చిన ఇతర జాతుల వ్యక్తులను శతృవులుగా చూసే వైట్స్ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీళ్లలో పోలీసులే ఎక్కువ మంది ఉంటారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలు జాత్యహంకారంతో రగిలిపోతూ ఇలా రక్తం కళ్ల చూస్తూ ఉంటారు.
యూరోపియన్ సమాజంలో ఫ్రాన్స్‌కు భిన్నమైన అస్థిత్వం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌కు వలసలు పోటెత్తాయి. వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లతో ఫ్రాన్స్ సమాజం నిండిపోయింది. ఫ్రాన్స్ జనాభాలో నాన్ యూరోపియన్, నాన్ వైట్ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎవరి మూలాలు వెతికినా ఇతర దేశాల్లో, వేరే జాతుల్లో తేలుతాయి. ప్రాంతం ఏదైనా జాతుల మధ్య ఘర్షణలు సహజం. కాలంతో పాటు ఫ్రెంచ్ సమాజం ఇలాంటి జాతి వైరాలను కూడా చూసింది. అందుకే ఫ్రెంచ్ రాజ్యాంగం యునివర్శలిజం అనే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతుంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల తరహాలో కాకుండా ఇక్కడ రాజ్యాంగం భిన్నంగా ఉంటుంది. జాతుల సమూహంగా మారిన ఫ్రాన్స్‌లో అందర్నీ సమానంగా చూసే ఉద్దేశంతో కలర్ బ్లైండ్ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్రభుత్వం దేశ పౌరులందర్నీ సమానంగా చూస్తుంది. అయితే ఈ కలర్ బ్లైండ్ విధానం మరో రకంగా ఫ్రాన్స్‌లో జాత్యహంకారానికి కారణమైంది.
ఎన్నో జాతులు ఉన్నా.. వాళ్ల సమాచారం ఎక్కడ ?
చట్టం ముందు అందరూ సమానమే అన్న భావన మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి బాగుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా అది అమలవుతుందా లేదా అన్నది దాన్ని అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. యూనివర్సల్ పబ్లిక్ వాల్యూస్‌ను పాటించాలని ఆదేశించిన ఫ్రెంచ్ రాజ్యాంగంలో మరో వివాదాస్పద చట్టం కూడా ఉంది. దాని ప్రకారం వ్యక్తుల మూలాలను, మతాలను, వాళ్ల జాతులను, వాళ్ల భావజాలాలను సేకరించడం, వాటిని ప్రాసెస్ చేయడం నిషిద్ధం. ఇందులోనే అసలు సమస్య మొత్తం ఉంది. అందరూ సమానమన్న పేరుతో అందర్నీ ఒకే గాటిన కట్టడం ద్వారా కొన్ని జాతులు ఎదుర్కొంటున్న వివక్షకు రూపం లేకుండా పోయింది. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఫ్రెంచ్ సమాజంలో జాతివివక్ష తీవ్రంగా ఉంటుంది. కానీ బయటకు కనిపించదంతే.
ఈ వలసవాదులు చేసుకున్న పాపం ఏంటి ?
ఆఫ్రికా, ఆసియా, కరేబియన్ దేశాల నుంచి వందలయేళ్ల క్రితమే ఫ్రాన్స్‌కు వలస వచ్చిన జాతులు ఇప్పటికీ జాతివిక్షను ఎదుర్కొంటూనే ఉన్నాయి. తమ రంగు, రూపు, భాష ఆధారంగా జీవితంలో ప్రతి సందర్భంలోనూ దారుణంగా వివక్షకు గురవుతున్నామని దశాబ్దాలుగా ప్రజలు మొత్తుకుంటున్నా వాళ్ల గోడు వినేవాళ్లే ఉండరు. ఎందుకంటే.. వాళ్లు ఎదుర్కొంటున్న వివక్షకు ఆధారాలు చూపే డాటా ఎక్కడా దొరకదు. చట్ట ప్రకారం ప్రభుత్వం కూడా ఎవరి డేటాను సేకరించదు కాబట్టి తరతరాలుగా వివక్షకు ఆధారాలు లేకుండా పోయాయి. ఫ్రెంచ్ మానవ హక్కుల కమిషన్ 2022లో ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం సంవత్సరానికి దాదాపు పది లక్షల మంది వివిధ రూపాల్లో జాతి వివక్షతోపాటు దాడులు ఎదుర్కొన్నారు. 17 ఏళ్ల అల్జీరియా కుర్రాడు నహేల్ కూడా ఇలాంటి వివక్షకే బలైపోయాడు. ప్రపంచీకరణ కారణంగా విద్యా, ఉపాధి అవకాశాల కోసం దేశాల సరిహద్దులు దాటడం సహజంగా మారిపోయింది. ఇప్పటికే అనేక వలస జాతులతో నిండిపోయిన తమ దేశంలోకి కొత్తగా వచ్చే వారికి స్వాగతం పలికేందుకు ఫ్రెంచ్ సమాజం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వలసదారుల విషయంలో ఇది తమకు మాత్రమే చెందిన దేశం అని భావించే వాళ్లు దాడులకు పాల్పడుతూ ఉంటారు. జాతి వివక్షను ఫ్రాన్స్ ప్రభుత్వం సమస్యగా చూడనంత కాలం వలసవాదుల ప్రాణాలు గాలిలో దీపంలానే ఉంటాయి.