Playboy Minister: ప్లేబాయ్ కవర్ పేజీపై మహిళా మినిస్టర్.. ఫ్రాన్స్‌లో ఫైర్
ప్లేబాయ్ పత్రిక అంటేనే ఓ స్పెషల్.. అదరగొట్టే అందాలతో రెచ్చగొట్టే భంగిమలతో మగవారికి మాత్రమే స్పెషల్ ఈ అడల్ట్ మ్యాగజైన్. అలాంటి మ్యాగిజైన్‌పై ఓ ఫ్రెంచ్ మంత్రి ఫోటో రావడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. ఇంతకీ ఎవరా మంత్రి..? అసలా ఫోటో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది..?
ఫ్రాన్స్ (France) మహిళా మంత్రి మార్లినే షియప్పా (Marlene Schiappa) ఇప్పుడు ప్లేబాయ్ (Playboy) వివాదంలో చిక్కుకున్నారు. ఈ అడల్ట్ కంటెంట్ (Adult Content) మ్యాగజైన్ కవర్ పేజీపై మంత్రి ఫోటో రాజకీయ దుమారాన్నే రేపింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఇలాంటి ఫోజులు ఇస్తారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ నేతలే మార్లినే (Marlene) తీరుపై మండిపడుతున్నారు. ప్లేబాయ్‌కు ఫోజులివ్వడం లింగ సమానత్వం కిందకు వస్తుందా అని నిలదీస్తున్నారు. సహచర మహిళా నేతలు కూడా ఆమె తీరును తప్పు పడుతున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ (Immanuel Macron) ప్రభుత్వంలో 40 ఏళ్ల మార్లినే షియప్పా మంత్రిగా ఉన్నారు. సామాజిక, ఆర్థిక సంబంధాల శాఖలు నిర్వహిస్తున్నారు. మార్లినే షియప్పా ఇటీవల ప్లేబాయ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమయంలో ఆమె స్పెషల్‌గా డిజైన్ చేసిన దుస్తులు ధరించి ఫోజులు ఇచ్చారు. హాట్‌హాట్ ఫోజులు కుర్రకారును రెచ్చగొట్టేలా ఉన్నాయి. సాధారణంగా పోర్న్ స్టార్స్ (Porn Star) లేదంటే హీరోయిన్ల హాట్ హాట్ అందాలతో కనిపించే ప్లేబాయ్ కవర్ పేజీపై తమ మంత్రి ఫోటో రావడం అదికూడా రొచ్చగొట్టే విధంగా ఉండటమే ఫ్రాన్స్‌లో కలకలం రేపింది. ఇది తీవ్ర దుమారాన్ని రేపడంతో అధ్యక్షుడు మెక్రాన్, ప్రధాని ఎలిజిబెత్ బోర్న్ (Eligibeth Borne) ఇద్దరూ మార్లినేను పిలిపించి మాట్లాడారు. ఆమె వస్త్రధారణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మంత్రిగా ఉంటూ ఇలాంటి వస్త్రధారణతో ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. అయితే మార్లినే మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. మహిళలకు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలని, వారేం కావాలంటే అది చేసేటట్లు ఉండాలని ఆమె కౌంటర్ ఇచ్చారు. ఫోటో షూట్ సమయంలో తాను దస్తులు ధరించే ఉన్నానని పూర్తిగా వాటిని తీసేయలేదంటూ విమర్శకులపై ఎదురుదాడికి దిగారు. ఇక ప్లేబాయ్ ఫ్రెంచ్ (French) ఎడిషన్ ఎడిటర్ కూడా తమ నిర్ణయాన్ని సమర్దించుకున్నారు. మహిళా హక్కులపై పోరాడుతున్న ఆమె తమ మ్యాగజైన్‌కు సరైన ఎంపిక అని ట్వీట్ చేశారు.
మార్లిన్ షియప్పా తీరుపై వామపక్షవాదులు (Leftists) మొదట్నుంచి గుర్రుగా ఉన్నారు. పైగా ప్లేబాయ్‌కు ఇచ్చిన 12పేజీల ఇంటర్వ్యూలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వారి ఆగ్రహాన్ని మరింత పెంచాయి. మహిళలు, స్వలింగ సంపర్కులు, అబార్షన్ హక్కుల గురించి కాస్త గట్టిగానే మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను అవి తప్పుపట్టేలా ఉన్నాయని వామపక్షవాదులతో పాటు రైట్‌వింగ్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్‌లో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఏదో ఓ వివాదంతో ఆందోళనలతో హోరెత్తిపోతోంది. ప్రస్తుతం పెన్షన్ విధానంలో మార్పులపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కార్మికులు రోడ్డెక్కారు. ఇన్ని తలనొప్పులతో ఉన్న సమయంలో మంత్రి ఇలా చేయడంపై అధ్యక్షుడు మెక్రాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మార్లిన్ షియప్పా గతంలో రచయితగా పనిచేశారు. మహిళా హక్కులపై పోరాడారు. ఉద్యోగాలు చేసే తల్లుల కోసం ప్రత్యేక బ్లాగ్‌ను నడిపారు. ఆ తర్వాత పలు పుస్తకాలు రాశారు. 2014లో లిమాన్స్ నగరానికి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. మహిళలకు సమాన హక్కులు, లింగ వివక్షతపై ఆమె పోరాడారు. 2015లో అప్పుడు మంత్రిగా ఉన్న మేక్రాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2017లో ప్రధాని పరిధిలో ఉండే లింగ సమానత్వ శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత పలు బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే వివాదాలు ఆమెకు కొత్తేం కాదు. 2010లో ఓ పుస్తకంలో అధిక బరువున్న వారికి ఆమె కొన్ని సెక్స్ టిప్స్ చెప్పారు. అది దుమారం రేపింది. 2017లో మహిళలకు అనుమతి లేని ఓ ప్రదేశం ముందు నిరసనకు దిగి వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు ప్లేబాయ్ వివాదం మాత్రం పెద్దదిగా కనిపిస్తోంది. తాను ఎంత సమర్ధించుకున్నా అధ్యక్షుడు, ప్రధానే ఆమె తీరుపై ఆగ్రహంతో ఉండటంతో చిక్కుల్లో పడ్డట్లే కనిపిస్తోంది.