Relation: రష్యాతో చైనా స్నేహం వెనుక..

ఊరకరారు మహానుభావులు అని పెద్దలు ఊరకే అనలేదు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ క్రెమ్లిన్ పర్యటన కూడా అలాంటిదే.. ఉక్రెయిన్ విషయంలో మధ్యవర్తిత్వంపై చర్చిస్తామని చెప్పినా దాని వెనక వ్యూహం వేరు.. పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరి లక్ష్యాలూ వేరు.. అవసరాలు కూడా వేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2023 | 03:30 PMLast Updated on: Mar 22, 2023 | 3:30 PM

Friendly Relation Stratagy Of China And Russia

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు రష్యాలో గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. పుతిన్‌ ఆత్మీయంగా కౌగిలించుకుని మరీ మైడియర్ ఫ్రెండ్ అంటూ పలకరించారు. ఈ పలకరింపు వెనక పెద్దకథే ఉంది. ఒకప్పుడు శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెతను పాటిస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం వేళ రష్యాకు చైనా సహకారం అవసరం.. తైవాన్‌ విషయంలో డ్రాగన్‌కు క్రెమ్లిన్ సపోర్ట్‌ కావాలి.. అన్నింటికీ మించి అమెరికాను దెబ్బకొట్టాలన్న లక్ష్యం ఈ ఇద్దరినీ కలిపింది.

రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించిన తర్వాత చైనా అధ్యక్షుడి తొలి పర్యటన ఇది. అంతర్జాతీయ న్యాయస్థానం యుద్ధనేరాలకు బాధ్యుడ్ని చేస్తూ పుతిన్‌పై అరెస్ట్‌ వారెంట్ జారీ చేసిన తర్వాత రష్యాలో పర్యటిస్తున్న తొలి దేశాధ్యక్షుడు జిన్‌పింగే. చెప్పినట్లుగానే ఉక్రెయిన్‌పై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. చైనా సూచనలను పరిగణలోకి తీసుకుంటామని పుతిన్ ప్రకటించారు కూడా. అయితే చైనా ఏం మధ్యేమార్గం సూచించిందన్నది మాత్రం మిస్టరీనే. అసలు యుద్ధానికి ముగింపు పలకాలన్న సదుద్దేశంలోనే చైనా ఉందా అన్నది అనుమానమే.

రష్యా యుద్ధనేరాలను కప్పిపుచ్చడానికి, దౌత్యపరమైన సహకారం అందించడానికే చైనా అధ్యక్షుడు అక్కడ పర్యటిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. యుద్ధం ఆపడానికి చైనా చేసే ప్రతిపాదనలేమైనా సరే అవి రష్యాకు ప్రయోజనం కలిగించేలానే ఉంటాయని అనుమానిస్తోంది. చైనా చాలాకాలంగా సీజ్‌ఫైర్‌ ప్రతిపాదన చేస్తోంది. కాల్పులు విరమించి యథాతథస్థితిని కొనసాగించాలంటోంది. అంటే ఉక్రెయిన్‌లో ఇంతవరకు ఆక్రమించిన ప్రాంతం మొత్తం రష్యాతోనే ఉండిపోతుందన్నమాట. ఉక్రెయిన్ యుద్ధం, దురాక్రమణ గురించి పుతిన్ ముందే చైనాకు చెప్పినట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరూ సమావేశమయ్యారు. ఆ వెంటనే ఆక్రమణ మొదలైంది. అప్పట్నుంచి చైనా మధ్యేమార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నట్లు నటిస్తోంది. కానీ కీలక అంశాల్లో మాత్రం ప్రత్యక్షంగానే రష్యాకు మద్దతుగా నిలుస్తోంది. ఆయుధ సాయం కూడా చేస్తోందన్నది మరో పెద్ద అనుమానం.

స్నేహం వెనక వ్యూహమేంటి..?
చైనా, రష్యా మొదట్నుంచి మిత్రదేశాలేమీ కాదు. 1969లో సరిహద్దు సమస్యపై ఇద్దరి మధ్య వివాదం నడిచింది. ఆ సమయంలో ఇరుదేశాలు అణ్వాయుధ బలాన్ని ప్రదర్శించి ఉద్రిక్తతలను మరింత పెంచాయి. మధ్య ఆసియాపై పట్టుకోసం ఇరుదేశాలు పోటీపడ్డాయి. రష్యాకు మధ్య ఆసియా పట్టున్న ప్రాంతం.. ఇక ప్రపంచశక్తిగా ఎదగాలన్న చైనాకు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం అవసరం. దీంతో ఈ రెండు దేశాల మధ్య వైరం నడిచింది. అటు సోవియట్ విచ్ఛిన్నం తర్వాత చైనా పట్టు పెంచుకుంది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనలేదు. అదే సమయంలో వ్యాపార, వ్యూహాత్మక భాగస్వామ్యం పెరిగింది.

2014లో తొలిసారి ఉక్రెయిన్ ఆక్రమణకు దిగింది రష్యా.. ఆ సమయంలో ఒబామా సర్కార్ విధించిన ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి చైనా సాయం చేసింది. అప్పట్నుంచి పుతిన్, జిన్‌పింగ్ మధ్య స్నేహం పెరిగింది. తన బెస్ట్‌ఫ్రెండ్‌గా పుతిన్‌ను చెప్పేవారు జిన్‌పింగ్. 2018లో ఇద్దరూ కలిసి పాన్‌కేక్‌లు తయారుచేశారు. వోడ్కా తీసుకున్నారు. ఇక 2019లో జిన్‌పింగ్‌ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పుతిన్‌… ఓ కేక్‌తో పాటు భారీ ఐస్‌క్రీమ్‌ను కూడా ప్రజంట్ చేశారు. ఇటీవలి కాలంలో ఇద్దరు నేతలు దాదాపు 40సార్లు కలుసుకున్నారంటే బంధం ఏ స్థాయిలో బలపడిందో చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యాపై ప్రపంచదేశాలు కఠిన ఆంక్షలు విధిస్తే చైనా మాత్రం ఆదుకునే ప్రయత్నం చేసింది. పశ్చిమ దేశాల నుంచి కొనుగోలు చేసే కంప్యూటర్‌ చిప్స్‌, స్మార్ట్‌ఫోన్స్‌, సైనిక సామగ్రి వంటి పలు వస్తువులు రష్యాకు ఎగుమతి చేసింది.

రెండు దేశాలకు ఏం కావాలి..?
పుతిన్‌కు తన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండటం కావాలి. చైనాతో స్నేహంతోనే అది సాధ్యం. రష్యా నుంచి భారీగా ముడిచమురును కూడా ఆదేశం కొనుగోలు చేస్తోంది. ఇక ఇటీవల ఆయుధాలను కూడా అందిస్తోందన్న అనుమానాలూ ఉన్నాయి. ఒంటరి పోరాటం కంటే బలమైన మిత్రుడు పక్కనుంటే ఆ ధైర్యమే వేరు. ఇక చైనాకు కావాల్సింది అమెరికాపై ఆధిపత్యం.. రష్యా సాయంతోనే అది సాధ్యమని డ్రాగన్ నమ్మకం. చైనా దూకుడు పెరగకుండా ఎప్పటికప్పుడు అమెరికా అడ్డుపుల్లలు వేస్తూ వస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే రష్యా మద్దతు తప్పనిసరని డ్రాగన్ భావిస్తోంది.
ఇరుదేశాలకు ఎవరి అవసరాలు వారికున్నాయి. ఎవరి లెక్కలు వారికున్నాయి. అన్నింటికీ మించి అమెరికాపై ఆధిపత్యానికి గండికొట్టే వ్యూహాలు ఉన్నాయి. అందుకే ఆ ఇద్దరు స్నేహం పాటిస్తున్నారు.. లేదా కనీసం నటిస్తున్నారు.