G20 Summit: తెల్లదొరలు వస్తున్నారు.. పేదవాళ్లు కనిపించొద్దు.. ఫైఓవర్ల కింద బతకొద్దు..!
గతంలో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలోని గుజరాత్ విజిట్ చేసినప్పుడు కూడా ఇలానే చేశారు. అప్పుడు ఏకంగా మురికివాడలు కనపడకుండా పరదా కప్పేశారు. ఆ పరదా చించి చూస్తే అసలు విషయం కనిపిస్తుంది.
G20 Summit: విదేశీయులు ఇండియాకు వస్తున్నారంటే చాలు.. కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తుంటుంది. ఇండియా అంత గొప్ప దేశం ఏదీ లేదని చూపించే ప్రయత్నం చేస్తుంది. గతంలో ట్రంప్ పర్యటన టైమ్‌లోనూ ఇదే జరిగింది.
పేదరికం, దారిద్య్రం నిర్మూలించాలింటే ఆర్థిక విధానాలు మారాలి. ఇదంతా ఒక్క రోజులో జరిగే మార్పు కాదు. ఔనన్నా కాదన్నా ఇండియా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే. కానీ.. అభివృద్ధి చెందిన దేశం కాదు. ఈ విషయం జీ20 సమావేశాలకు ఇండియాకు వస్తున్న విదేశీ నేతలకు తెలియనిది కాదు. కానీ, డబ్బా కొట్టుకోవడంలో ఆరితేరిన కేంద్ర ప్రభుత్వం విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశ స్థితిగతుల గురించి లేనివి ఉన్నట్టుగా చెప్పుకుంటుంది. పెట్టుబడులు రావాలంటే ఆ మాత్రం అబద్ధాలు చెప్పక తప్పని పరిస్థితి. ప్రపంచ దేశాధినేతలకు ఇండియాలోని పేదిరకం గురించి పేపర్లు, వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా అందించే సమాచారమే కానీ ప్రత్యేకించి నేరుగా చూసే సందర్భాలు తక్కువ. వచ్చే నెల 9,10 తేదీల్లో భారత్‌లో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమ్మిట్‌కి తొలిసారి భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఇది చాలా గొప్ప విషయమే. అయితే విదేశీయుల ముందు మన పేదరిక ఆనవాళ్లు కనపడకుండా కేంద్రం జాగ్రత్త పడుతోంది.
ఢిల్లీలోని ఫ్లైఓవర్లను అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తోంది కేంద్రం. మిరుమిట్లు గొలిపే లైట్లతో ఢిల్లీని మరింత అందంగా మారుస్తోంది. ఇదే సమయంలో ఫ్లైఓవర్ల కింద బతుకీడుస్తున్న పేదవారు కనిపించారు. వాళ్లంతా ఇళ్లు లేని వారు. ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నవారు. ఆ ఫుట్‌పాత్‌లు, రోడ్లే వాళ్ల జీవనాధారం. అలాంటివారిని ఒక 20 రోజులు ఎక్కడికైనా వెళ్లిపోమ్మని చెబుతున్నారు అధికారులు. విదేశీయులు వస్తున్నారని.. వాళ్లకి కనిపించవద్దని నేరుగానే చెప్పేస్తున్నారు. ఈ 20 రోజుల తర్వాత కావాలంటే మళ్లీ ఇక్కడికి వచ్చి బతకమని ఉచిత సలహా ఇస్తున్నారు.
గతంలో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలోని గుజరాత్ విజిట్ చేసినప్పుడు కూడా ఇలానే చేశారు. అప్పుడు ఏకంగా మురికివాడలు కనపడకుండా పరదా కప్పేశారు. ఆ పరదా చించి చూస్తే అసలు విషయం కనిపిస్తుంది. గుజరాత్ సీఎంగా ప్రధాని మోదీకి ఇండియా వ్యాప్తంగా మంచి పేరుంది. అందుకే గుజరాత్ మోడల్ అని బిల్డప్‌లు ఇచ్చుకుంటుంది బీజేపీ. అదే గుజరాత్ రాజధానిలో మురికివాడలున్నాయని ప్రపంచానికి తెలియడం ఏ మాత్రం ఇష్టం లేని కేంద్రం అప్పుడు ఆ పని చేసింది. ఇప్పుడు తొలిసారి జీ20 సమావేశాలకు ఇండియా హోస్ట్ చేస్తుండడంతో పేదవారి ఛాయలు కనపడకూడదని కేంద్రం భావిస్తోంది. అందుకే ఫ్లైఓవర్ కింద, ఫుట్‌పాత్‌లపై ఉన్నవాళ్లని ఖాళీ చేయిస్తోంది. అధికారులు చెప్పినవాటిని విని కొంతమంది అర్థం చేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం ఈ 20 రోజులు ఎక్కడ బతకాలో చెప్పండి సార్ అని తల బాదుకుంటున్నారు. అక్కడ నుంచి వెళ్లిపోతే తమ పిల్లలు స్కూల్స్‌కు వెళ్లడం కూడా కుదరదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.