Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.. మూగబోయిన ప్రజా గొంతుక..
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన 1949లో తూప్రాన్‌లో జన్మించారు.
నిజామాబాద్, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం సాగింది. 1975లో కెనరా బ్యాంకులో పని చేశారు. కళాకారుడిగా, ఉద్యమకారుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో గద్దర్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ కీలకంగా వ్యవహరించారు. 1987లో కారంచేడులో జరిగిన దళితుల హత్యాకాండ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ తర్వాత నక్సల్స్ నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా తప్పుబట్టారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అయితే, ప్రాణాలతో బయటపడ్డారు. సినిమాల్లోనూ ఆయన రాసిన పాటలు ప్రజాదరణ దక్కించుకున్నాయి.
దాసరి దర్శకత్వంలో వచ్చిన ఒరేయ్ రిక్షా మూవీలో ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా పాటకు ఆదరణతోపాటు, నంది అవార్డు కూడా దక్కింది. అయితే, ఆయన నంది అవార్డును తిరస్కరించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన రాసిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న అనే పాటలు ఉద్యమానికి ఊపునిచ్చాయి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కళాకారుల్లో గద్దర్ ప్రముఖుడు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. మా భూమి సినిమఆలో వెండితెరపై కనిపించారు.
1969 తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. జన నాట్యమండలి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్య పరిచారు. దళితులపై జరుగుతున్న ఆకృత్యాల్ని ఎదిరించడంలో ముందున్నారు. అనేక ఉద్యమాల్లో గద్దర్ కీలకపాత్ర పోషించారు.