Over Weight: ప్రపంచం బరువెక్కిపోతోంది.
మారుతున్న ఆహారపుటలవాట్లు మనల్ని దానికి బానిసగా చేసుకుంటున్నాయి. ఇంటి తిండి మానేసి బయట తిండి మొదలుపెడితే అదే అలవాటైపోతోంది. మనల్ని లావెక్కిస్తోంది. తగ్గాలంటే మనం కంట్రోల్ లో ఉండాల్సిందే.
ప్రపంచం బరువెక్కిపోతోంది. అంటే భూమి కాదు.. మనమే బరువై పోతున్నాం… రానున్న పుష్కరకాలంలో ప్రపంచంలో సగంమంది ఒబెసిటితో బాధపడతారన్నది డేంజర్ న్యూసే… అందులో మీరు కూడా ఉన్నారా…?
వరల్డ్ ఒబెసిటి ఫెడరేషన్ ఓ డేంజర్ న్యూస్ ను సైలెంట్ గా ప్రచురించింది. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగంమంది ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడతారని తేల్చింది. ముఖ్యంగా పిల్లల్లో ఇది మరింత ప్రమాదకరస్థాయిలో పెరుగుతుందని అంచనా వేసింది. ఒబెసిటీ ఫెడరేషన్ అంచనాలు నిజమైతే రానున్న 12 ఏళ్లలో దాదాపు 4వందల మందికి బరువు భారంగా మారనుంది. అంతేకాదు ఊబకాయం వల్ల ప్రపంచంపై ఏటా పడే భారం సుమారు 82లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటి నుంచి చర్యలు తీసుకోకపోతే అది ప్రమాదకర పరిస్థితికి తీస్తుందని ప్రపంచదేశాలను హెచ్చరిస్తోంది వరల్డ్ ఒబెసిటి ఫెడరేషన్. ఆసియా, ఆఫ్రికాలో దిగువ, మధ్య శ్రేణి దేశాలకు ఇది పెను భారంగా మారనుంది.
అన్నింటికంటే ప్రమాదకర అంశం చిన్నపిల్లల్లో ఈ సమస్య అత్యంత వేగంగా పెరగడం. 2020నాటి లెక్కలతో పోల్చితే ఈ సమస్య రెట్టింపు స్థాయిలో పెరుగుతోందన్న అంచనా ఉంది. వరల్డ్ ఒబెసిటీ అట్లాస్-2023 ప్రకారం 2020లో భారతదేశంలో అబ్బాయిల్లో ఒబెసిటి రిస్క్ 3శాతంగా ఉండగా అది 2035నాటికి 12శాతానికి చేరుతుంది. అలాగే అమ్మాయిల్లో 2శాతంగా ఉన్న రిస్క్ 7శాతానికి పెరగనుంది. పుష్కర కాలం తర్వాత ఏటా దేశంలో పిల్లల్లో ఊబకాయం ఏటా 9.1శాతం పెరుగుతుందన్నది అంచనా. అంటే ఆడుతూ పాడుతూ చెంగున గెంతాల్సిన బాల్యం కూడా బరువెక్కువై బద్ధకంగా కదులుతుందన్నది హెచ్చరిక. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. కానీ అలాగే గుండ్రంగా పెరిగితే మాత్రం తట్టుకోలేం.
2035 నాటికి మన దేశ జనాభాలో 11శాతం మంది బరువుతో బాధపడేవారే ఉంటారు. 2020 నుంచి 2035 నాటికి ఏటా దాదాపు 5.2శాతం మంది అధికంగా ఊబకాయం బారిన పడతారన్నమాట. అయితే పురుషుల కంటే మహిళలకే ఈ ముప్పు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పురుషుల్లో 4శాతంగా ఉన్న రిస్క్ పుష్కరకాలం తర్వాత 8శాతానికి చేరుతుంది. కానీ మహిళల్లో మాత్రం ప్రస్తుతం ఇది 7శాతంగా ఉంటే 2035నాటికి 13శాతానికి చేరుతుందన్నమాట. మొత్తంగా ఊబకాయం ఎఫెక్ట్ దేశ జీడీపీని 1.8శాతం తగ్గిస్తుందని అంచనా.
ఇంతకీ ఎందుకీ ఊబకాయం వస్తుందంటే ముందుగా వినిపిస్తున్న పేరు జంక్ ఫుడ్. అలాగే అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్ వాడటం, ఆహార పదార్ధాల నాణ్యతపై సరైన నియంత్రణ లేకపోవడం వంటి కారణాలు ప్రజలను ఊబకాయులుగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు తిండిపై నియంత్రణ ఉండేది. ప్రతి ఒక్కరు పనిచేసేవారు కాబట్టి ఎంత తిన్నా, ఏం తిన్నా అరిగిపోయేది. పిల్లలు ఆటపాటల్లో మునిగితేలేవారు. కానీ ఇప్పుడలా కాదు తినేదంతా రసాయనాలతో పండించిన పంటలే. దానికి తోడు పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ పెరిగిపోయాయి. జిహ్వచాపల్యాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం నేటి తరం లక్షణం. దీంతో తెగ తినేస్తున్నారు. ఫలితంగా ఒళ్లు పెరిగిపోతోంది. ఒకప్పుడు రాత్రి 7 తర్వాత ఏం తినేవారు కాదు. రాత్రి 8కల్లా పడుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రపంచమంతా రాత్రి 8తర్వాతే మొదలవుతోంది. అర్థరాత్రి బిర్యానీలు, పార్టీలు అలవాటైపోయాయి. తిని పడుకుంటే పొట్టకు కాకుండా ఒంటికి పడుతుందా… ఇవన్నీ ఊబకాయానికి దారి తీసేవే. ఒకప్పుడు మాంసాహారం మితంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ఇష్టంగా మారిపోయింది.
మారుతున్న ఆహారపుటలవాట్లు మనల్ని దానికి బానిసగా చేసుకుంటున్నాయి. ఇంటి తిండి మానేసి బయట తిండి మొదలుపెడితే అదే అలవాటైపోతోంది. మనల్ని లావెక్కిస్తోంది. తగ్గాలంటే మనం కంట్రోల్ లో ఉండాల్సిందే. ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని విద్యలో భాగం చేయాలి. ఆటలను ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు మేలుకోకపోతే ఊబకాయం జాతీయ సమస్యగా మారిపోవడం ఖాయం… ఇది దేశ ప్రగతికి నష్టం చేసేదే… సో బీకేర్ ఫుల్… సరైన ఆహారపుటలవాట్లు చేసుకోండి. లేకపోతే బరువుతో భారంగా రోజులు గడపక తప్పదు.