Heat Waves: రెండు రోజులు వడగాలుల ముప్పు.. ఆరెంజ్ అలర్ట్ జారీ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

తెలంగాణలోనూ వడగాల్పుల ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2023 | 11:04 AMLast Updated on: Jun 19, 2023 | 11:04 AM

Heat Waves In Telangana Orange Alert Issued By Imd

Heat Waves: ఎండాకాలం ఇంకా ముగియలేదు. ఈ పాటికే చిరుజల్లులు పలకరించాల్సి ఉండగా.. కనీసం రుతుపవనాల జాడ కూడా లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిన అయితే పరిస్థితి భయానకంగా ఉంది. వడగాల్పుల కారణంగా గత మూడు రోజుల్లోనే వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోనూ వడగాల్పుల ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సగటున 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సోమ, మంగళవారాలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వడగాలులు కూడా వీస్తాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వడగాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల చల్లటి, నీడ ఉన్న ప్రదేశాల్లోనే ఉండాలి. వీలైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే తలకు క్యాప్ పెట్టుకోవడం లేదా వస్త్రం చుట్టుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తగినన్ని నీళ్లు తాగుతుండాలి. దాహం వేసినా.. వేయకపోయినా వీలైనన్ని నీళ్లు తాగితే చాలా మంచిది. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఎండ ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. పండ్ల రసాలు, మజ్జి, నిమ్మరసం, ఓఆర్ఎస్, లస్సీ వంటివి తాగాలి. వీలైనంత వరకు ఎండ ప్రభావానికి గురి కాకుండా చూసుకోవాలి.
ఈ జిల్లాలకు అధిక ముప్పు
తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో ఎండలు, వడగాలులు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు బయటకు రావొద్దని సూచించింది. హైదరాబాద్‌లోనూ ఎండ, వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుంది.
ఏపీలో ఒంటిపూట బడులు
ఈసారి రుతు పవనాలు ఏపీలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. అయినప్పటికీ, ఎండల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఎండలు, వడగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఇంతకుముందు 17వ తేదీ వరకే ఒంటిపూట బడులకు అనుమతించగా.. ఇప్పుడు దీన్ని 24వ తేదీ వరకు పొడిగించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులకు అందించే ఆహారం విషయంలోనూ మార్పులు ఉండవని సూచించింది. దీని ప్రకారం.. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావ అందిస్తారు. తర్వాత ఉదయం 11.30 గంటల నుంచి 12.00 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుంది.
వర్షాలకు ఛాన్స్
ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నందున ఈ వారంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. రుతు పవనాలు ఏపీలోకి వచ్చినప్పటికీ అవి ఇంకా రాష‌్ట్రమంతా విస్తరించలేదు. దక్షిణ కోస్తా, రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు సోమవారం రుతుపవనాలు విస్తరిస్తాయని ఏపీ వాతావరణ శాఖ మొదట ప్రకటించింది. కానీ, ప్రస్తుతం వాతావరణంలో అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని భావిస్తోంది. తాజా అంచనా ప్రకారం.. జూలై 5 నాటికి దేశమంతా రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.