Heavy Rains: మరో నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వానలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో మంగళ, బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో కూడా వర్షాలు కురుస్తాయి.

Heavy Rains: వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు నుంచి నాలుగు రోజులపాటు ఈ వర్షాలు పడతాయి. తెలంగాణకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో మంగళ, బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో బుధవారం వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. దీంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం తెలంగాణలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా మెండోరరాలో 1.9, నిర్మల్ జిల్లా భైంసాలో 1.2, జగిత్యాల జిల్లా గోధూరులో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే జగిత్యాల జిల్లా, ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, కొత్తగూడెం, జనగాం, వరంగల్, వికారాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్లా, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది.
ఏపీలో భారీ వానలు
ఏపీకి సంబంధించి రాబోయే 48 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి బలహీనపడింది. దీని వల్ల ఏపీవ్యాప్తంగా మూడురోజులు వర్షాలు కురవనున్నాయి. మంగళ, బుధ వారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చు. ఉత్తర కోస్తా జిల్లాలు, యానాంలలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతాచోట్ల భారీ వర్షాలు పడతాయి. బుధవారం తేలికపాటి జల్లులు కురుస్తాయి. వరద ముప్పు పొంచి ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రెండు రోజులు భారీ వానలు కురిసే అవకాశం ఉన్నదృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు.