Hijab Girl: నిన్న హిజాబ్ కోసం పోరాటం.. నేడు క్లాస్ టాపర్.. సంచలనం సృష్టించిన బాలిక

నాడు హిజాబ్ కోసం ఉద్యమించిన ఒక ముస్లిం బాలిక ఇప్పుడు కర్ణాటకలో ప్లస్ 2 టాపర్‌గా నిలిచింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 600 మార్కులకుగాను, 593 మార్కులు సాధించింది. నాడు హిజాబ్ కోసం పోరాటం చేస్తూ వైరల‌్ అయిన ఆ అమ్మాయి ఇప్పుడు టాపర్‌గా నిలిచి మరోసారి వార్తల్లోకెక్కింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2023 | 08:15 PMLast Updated on: Apr 25, 2023 | 8:15 PM

Hijab Girl Tops Class 12th Exams In Karnataka

Hijab Girl: కర్ణాటకలో గత ఏడాది హిజాబ్ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. హిజాబ్ ధరించి కాలేజీకి రావడానికి యాజమాన్యం అంగీకరించకపోవడంతో కొందరు ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హిజాబ్ ధరించి కాలేజీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరికి మరో వర్గం వాళ్లు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ నేపథ్యంలో కాలేజీకి యూనిఫాం ధరించి రావాలని వారికి యాజమాన్యం సూచించింది. ఇంతకీ ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే నాడు హిజాబ్ కోసం ఉద్యమించిన ఒక ముస్లిం బాలిక ఇప్పుడు కర్ణాటకలో ప్లస్ 2 టాపర్‌గా నిలిచింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 600 మార్కులకుగాను, 593 మార్కులు సాధించింది. నాడు హిజాబ్ కోసం పోరాటం చేస్తూ వైరల‌్ అయిన ఆ అమ్మాయి ఇప్పుడు టాపర్‌గా నిలిచి మరోసారి వార్తల్లోకెక్కింది.
హిజాబ్ వివాదానికి చాలా మంది ముస్లిం విద్యార్థినులు మద్దతు పలికారు. హిజాబ్ ధరించడం తమ సంప్రదాయమని, హిజాబ్ ధరించిన తమను విద్యా సంస్థల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. దీనికి విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం అంగీకరించలేదు. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కానీ, ఈ కేసులో తుది తీర్పు వెలువడలేదు. అయితే, అప్పట్లో హిజాబ్ కోసం ఉద్యమించిన అమ్మాయిలు కొంతకాలం కాలేజీకి కూడా రాలేదు. తర్వాత కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గారు. వారిలో హిజాబ్ కోసం ఉద్యమించిన తబస్సుమ్ అనే బాలిక కూడా ఉంది. తబస్సుమ్ ఇప్పుడు పరీక్షల్లో టాపర్‌గా నిలవడం సంచలనం సృష్టిస్తోంది. ప్లస్ టూ పూర్తి చేసుకున్న తబస్సుమ్ ఇటీవలి ఫలితాల్లో సత్తా చాటింది. 600 మార్కులకుగాను, 593 మార్కులు సాధించింది.
విద్యకే ప్రాధాన్యం
హిజాబ్ విషయంలో అంతగా పోరాటం చేసినప్పటికీ ఇప్పుడు హిజాబ్ కంటే విద్యకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తబస్సుమ్ తెలిపింది. హిజాబ్ అంశంపై కోర్టు నిర్ణయం వచ్చినప్పుడు ఆ ఆదేశాలను పాటించాలి అని తన తల్లిదండ్రులు చెప్పారని బాలిక చెప్పింది. మొదట్లో రెండు వారాలపాటు కాలేజీకి వెళ్లలేదని, దీంతో ఏం చేయాలో తెలియక కంగారు పడ్డానని ఆమె చెప్పింది. చివరకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కాలేజీకి వెళ్లినట్లు వెల్లడించింది. తాను చదువుకుంటేనే అన్యాయాలపై పోరాడగలనని, అందుకే చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తబస్సుమ్‌కు అన్నివైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.