Chandrayaan 3: చంద్రయాన్-3.. పాక్ సహా ప్రపంచ దేశాల మద్దతు.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్!
పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ఈ సందర్భంగా మానవ చరిత్రలో, అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించబోతున్న ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 వంటి ప్రయోగాల్ని పోటీగా భావించే అమెరికా, రష్యా కూడా మన ప్రయోగం విజయవంతం కావాలని ఆశిస్తున్నాయి.
Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. శతృదేశంగా భావించే పాకిస్తాన్ కూడా చంద్రయాన్-3పై ఆసక్తిగా ఉంది. పాకిస్తాన్‌లో చంద్రయాన్-3ని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ అక్కడి రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ఈ సందర్భంగా మానవ చరిత్రలో, అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించబోతున్న ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 వంటి ప్రయోగాల్ని పోటీగా భావించే అమెరికా, రష్యా కూడా మన ప్రయోగం విజయవంతం కావాలని ఆశిస్తున్నాయి.
ఎందుకంటే ఈ ప్రయోగం విజయవంతమైతే.. భవిష్యత్ ప్రయోగాలు మరింత ముందుకెళ్లడానికి మరింత ఆస్కారం ఉంటుంది. చంద్రయాన్-3.. బుధవారం సాయంత్రం 06:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానున్న సంగతి తెలిసిందే. దక్షిణ ధృవంపై దిగేందుకు ఇతర దేశాలు చేసిన ప్రయోగాలు ఫలించలేదు. తాజాగా రష్యా ప్రయోగించిన లూనా 25 కూడా చివరి దశలో విఫలమైంది. అందుకే ఇండియా అయినా.. దీనిలో విజయవంతం అవ్వాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇండియాతోపాటు అనేక దేశాలు చంద్రయాన్-3పై అత్యంత ఆసక్తిగా ఉన్నాయి. విదేశీ మీడియా కూడా దీనికి ప్రాధాన్యమిస్తోంది. వివిధ దేశాల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. నేషనల్ జియోగ్రఫిక్ చానెల్‌తోపాటు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది.
లూనా 25 ప్రయోగం విఫలమైనప్పటికీ ఇండియాకు రష్యా శుభాకాంక్షలు తెలిపింది. చంద్రయాన్-3 విజయం సాధిస్తుందని రష్యా జనరల్ కౌన్సిల్ ఒలెగ్ అన్నారు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా అవసరమైతే ఈ విషయంలో సాయం అందించేందుకు ముందుకొచ్చింది. దేశ విదేశాల్లో భారతీయులు ఈ ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ 05:47కు ప్రారంభమవుతుంది.