Same Sex Marriages: పెళ్లి చేసుకోవాలంటే సమాజానికి టముకు వేసి చెప్పాలా ? సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వాదనలు.. ఇంతకీ ఏంటీ కేసు ?
దేశ వ్యాప్తంగా ఉన్న LGBTQ కమ్యూనిటీ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. స్వలింగ వివాహాలకు న్యాయస్థానం ఆమోదిస్తే.. తైవాన్ తర్వాత ఆసియాలో ఈ తరహా వివాహాలను ఆమోదించిన రెండో దేశంగా భారత్ నిలుస్తుంది.
పలానా అబ్బాయి… పలానా అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో మాకు చెప్పండి.. ఇలా పబ్లిక్ ఆఫీసు నోటీసు బోర్డులో అబ్బాయి… అమ్మాయి వివరాలు పెళ్లి వాళ్ల పెళ్లి విషయాన్ని మిగతా సమాజానికి చెప్పడం అవసరమా. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారం అయినప్పుడు.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులకు పూర్తిగా సమ్మతమైనప్పుడు… ఇక సమాజం అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుంది ? ఈ ప్రశ్నలనే సూటిగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు వినిపించారు కొంతమంది పిటిషనర్లు. same sex marriagesకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ LGBTQ+ కమ్యూనిటీ దాఖలు చేసిన పిటిషన్లపై మూడు రోజులుగా సుధీర్ఘంగా వాదనలు వింటున్న సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం ముందు ఈ ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్లు ఆసక్తికర వాదనలు వినిపించారు.
పిటిషనర్ల వాదనేంటి ?
వివాహాలు, విడాకులకు సంబంధించి మనదేశంలో అమలులో ఉన్న చట్టాల్లో Special marriage act 1954 ఒకటి. ఎలాంటి మతపరమైన క్రతువులు పాటించని వ్యక్తులు, కులాలు, మతాలు ప్రాంతాలకు భిన్నంగా వివాహం చేసుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పించింది. హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్టులకు భిన్నంగా….దేశంలోని ఎవరైనా…పెళ్లి చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అయితే ఈ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలపై LGBTQ+ కమ్యూనిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులు 30 రోజుల ముందుగా రిజిస్ట్రార్ ఆఫీసుకు సమాచారం అందించాలి. సదరు వ్యక్తుల పెళ్లిపై రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్… 30 రోజుల లోపు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆయా వ్యక్తుల పెళ్లి పై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఆ పెళ్లిని నమోదు చేయరు. అంటే ఆ పెళ్లి చట్టం ముందు నిలబడదు. ఆ జంటకు చట్ట పరంగా ఎలాంటి హక్కులు లభించవు.
న్యాయమూర్తులేమన్నారు ?
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కొటియా దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఆయన వాదనలు వినిపించారు. హిందూ వివాహ చట్టంతో పాటు ఇతర వివాహ చట్టాల ఆధారంగా పెళ్లి చేసుకునే వారికి నిబంధన.. సెక్యులర్ చట్టంగా చెప్పుకునే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కు ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తుల అభిప్రాయానికి విలువివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను సేకరించడం… వాళ్ల అభిప్రాయలకు అనుగుణంగా పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అని నిర్ణయించడం వ్యక్తుల ప్రాధమిక హక్కులను హరించడమేనని సింఘ్వీ గట్టిగా వాదించారు. ఇద్దరి వ్యక్తుల మధ్య బంధంపై దాడి చేయడమేనన్నారు.
పితృస్వామ్యానికి నిదర్శనం
పిటిషనర్ల అభిప్రాయాలతో ఏకీభవించిన జస్టిస్ రవీంద్ర భట్…ఇలాంటి నిబంధనలు పితృస్వామ్యాన్ని సూచిస్తాయంటూ చట్టంలో ఉన్న లొసుగులను ఎత్తి చూపారు. రక్షించాల్సిన చట్టమే వారిపై దండయాత్ర చేసేలా ఉసిగొల్పుతుందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కామెంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి కాజల్ భావన అనే లెస్బియన్ జంట తరపున సీనియర్ అడ్వకేట్ రాజు రామచంద్రన్ వాదించారు. 30 రోజుల నోటీసు కోరడం వ్యక్తులకు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులకు భంగం కల్పించడమే కాకుండా ఆ పెళ్లిని అడ్డుకోవాలని చూసేవారికి అవకాశం కల్పించడమేనన్నారు. ఇలాంటి నిబంధనలు ఏ చట్టంలో ఉన్నా వాటిని రద్దు చేయాలని పిటిషనర్లు వాదించారు. దీనికి రాజ్యాంగ ధర్మాసనం కూడా సానుకూలంగానే స్పందించింది.
Special marriage actలో మార్పులు జరగబోతున్నాయా ?
స్వలింగ వివాహాలపై మూడు రోజుల నుంచి సుదీర్ఘంగా జరగుతున్న వాదనలను గమనిస్తే Special marriage actలో సమూల మార్పులు చేసే దిశగా సుప్రీంకోర్టు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇతర వివాహ చట్టాల జోలికి వెళ్లకుండా కేవలం Special marriage act పరిధిలోనే LGBTQ స్వలింగ వివాహాల అంశాన్ని సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది. ఇందులో స్త్రీ పురుషుడు మధ్య జరిగే వివాహం అన్న నిబంధనను మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వచ్చే వారం కూడా వాదనలు కొనసాగించనున్న సుప్రీంకోర్టు… తీర్పు వెల్లడించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న LGBTQ కమ్యూనిటీ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. స్వలింగ వివాహాలకు న్యాయస్థానం ఆమోదిస్తే.. తైవాన్ తర్వాత ఆసియాలో ఈ తరహా వివాహాలను ఆమోదించిన రెండో దేశంగా భారత్ నిలుస్తుంది.