Supreme Court: కోరుకున్న వెంటనే విడాకులు.. సుప్రీంకోర్టు తీర్పును ఎలా అర్థం చేసుకోవాలి ?
వివాహ బంధం ద్వారా ఏకమవడం సులభమే.. కానీ అదే వివాహాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం అనుకున్న వెంటనే జరిగిపోదు. ఏ బంధమైనా విచ్ఛిన్నం కావాలని న్యాయస్థానాలు కూడా కోరుకోవు. అందుకే ఆలోచించుకోవడానికి భార్యాభర్తలు కొంత సమయం ఇస్తాయి. ఆ తర్వాతే అన్ని ఆంశాలను పరిశీలించి విడాకులు మంజూరు చేస్తాయి.
అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి. సదరు భార్యా భర్తల మధ్య బంధం ఇక ఎంతమాత్రం ఆశాజనకంగా ఉండే పరిస్థితులు కనిపించవు. వాళ్లిద్దరూ విడిపోవడం మినహా మరో మార్గం ఉండదు. పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకున్నా చట్టాలు అంగీకరించవు. మరి ఇలాంటి సందర్భాల్లో విడిపోవాలనకున్న భార్యాభర్తలు నెలలు సంవత్సరాలపాటు ఎదురుచూడాల్సిందేనా ? ఇక ఈ పెళ్లి వద్దు అని ఇద్దరూ అనుకున్న తర్వాత కూడా విడాకులు మంజూరు కాక మానసిక క్షోభ అనుభవించాల్సిందేనా.? ఇలాంటి ప్రశ్నలకే సమాధానం చెబుతూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది ?
Irretrievable Breakdown of Marriage- అంటే విడాకులు కోరుకుంటున్న జంట ఇకపై తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలగా కొనసాగే అవకాశమే లేదని నిర్ణయానికి రావడం. ఇద్దరూ కలిసి ఉండే అవకాశాలు ఏమాత్రం లేవని భార్యాభర్తలు ఇద్దరూ లేదా…ఒక్కరైనా న్యాయస్థానం ముందు నిరూపించాలి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఫ్యామిలీ కోర్టు చుట్టూ తిరగకుండా… నేరుగా ఇకపై సుప్రీంకోర్టు ఆ వివాహాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చు. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 ప్రకారం సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అలాంటి వివాహాలను సుప్రీంకోర్టు రద్దు చేయవచ్చని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసం తీర్పు వెల్లడించింది. Irretrievable Breakdown of Marriage ప్రాతిపదికన సుప్రీం కోర్టు ముందుకు పిటిషన్లు వస్తే… వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని ధర్మాసనం భావిస్తే… ఇక ఎలాంటి వెయిటింగ్ పిరియడ్ అవసరం లేకుండానే తక్షణం సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.
ఇప్పటి వరకు చట్టంలో ఎలా ఉంది ?
విడాకులు తీసుకోవాలనుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం దానికి చాలా నిబంధనలు ఫాలో కావాలి. విడాకులు తీసుకోవాలనుకున్న జంటకు కనీసం పెళ్లై సంవత్సరమైనా అయి ఉండాలి. విడాకులు ఎందుకు కోరుకుంటున్నారో తెలుపుతూ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అయితే వెంటనే కోర్టు విడాకులు ఇవ్వదు. సెక్షన్ 13బి(2) ప్రకారం విడాకులు పొందాలంటే కనీసం 6 నెలల నుంచి 18 నెలల పాటు ఎదురుచూడాలి. దంపతులు మనసు మార్చుకుంటారేమోనన్న ఉద్దేశంతో ఈ నిబంధనను పెట్టారు.
తాజాగా సుప్రీం ఏం చెప్పింది ?
ఇక వివాహ బంధాన్ని కొనసాగించలేమనుకునే సీరియస్ కేసుల్లో హిందూ వివాహ చట్టంలోని 6-18 నెలల వెయింట్ పిరియడ్ నిబంధనను విశేష అధికారాల ద్వారా సుప్రీంకోర్టు పక్కన పెట్టొచ్చని స్పష్టం చేసింది. అయితే అన్ని కోర్టులకు ఇది వర్తించదు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే తనకున్న విశేష అధికారాల ద్వారా ఇలాంటి తీర్పులు ఇవ్వగలదు.
విడాకులు పొందాలంటే ఇప్పుడున్న ఇబ్బందులేంటి ?
దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో విడాకుల కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉంటాయి. విడాకులు పొందాలనుకున్న జంట విడిపోయి మళ్లీ కొత్త జీవీతాలను ప్రారంభించాలనుకున్న విడాకులు రాని కారణంగా కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది. ఫ్యామిలీ కోర్టులను ఆశ్రయించినా వాయిదాలపై వాయిదాలు పడుతూనే ఉంటాయి. విడాకులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడటంలోనే చాలా సమయం ఖర్చైపోతుంది. విసిగి వేసారిపోయిన జంట… తక్షణం వివాహాన్ని రద్దు చేయించుకోవాలనుకుంటే ఆర్టికల్ 142 ప్రకారం మంజూరు చేయమని సుప్రీంకోర్టును ఆశ్రయించాలి.
విడాకులు కోరిన జంట ఎవరు ?
2014లో శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము కలిసి ఉండే అవకాశం ఎంతమాత్రం లేదని తక్షణం విడాకులు మంజూరు చేయాలని కోరారు. ఆర్టికల్ 142ను ప్రయోగించి తమ వివాహ బంధాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయాలని విన్నవించుకున్నారు. దీనిపై సుధీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు అప్పటి ద్విసభ్య ధర్మాసనం ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. వాదనలను పూర్తి చేసిన రాజ్యాంగ ధర్మాసనం 2022 సెప్టెంబర్ 29న తీర్పును రిజర్వ్ చేసింది. అయితే అసలు ఆర్టికల్ 142ను ఉపయోగించి ప్రయోగించి సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేయవచ్చా.. లేదా అన్న దానిపై సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. చివరకు రాజ్యాంగ ధర్మాసనం దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. వెయిటింగ్ పిరియడ్ లేకుండా ప్రత్యేక పరిస్థితుల్లో విడాకులు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని స్పష్టం చేసింది.
ఇంతకీ ఏంటి ఆర్టికల్ 142 ?
ఆర్టికల్ 142 అన్నది రాజ్యాంగం సుప్రీంకోర్టు చేతికిచ్చిన బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవచ్చు. తమ ముందు పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో అసాధారణ నిర్ణయాలు తీసుకోవడానికి, చట్టాల్లో ప్రస్తావించకపోయినా… విశేష అధికారాలను ఉపయోగించి తీర్పులివ్వడానికి ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు అధికారం కట్టపెట్టింది. ప్రత్యేక పరిస్థితులు, సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్‌ను ప్రయోగించి తీర్పులు ఇస్తూ ఉంటుంది. విడాకులపై ఇచ్చిన తీర్పు కూడా ఇలాంటిదే.