Land Auction: భూముల అమ్మకం వెనుక కుట్ర..? రియల్ కంపెనీలకే లాభమా..?
హైదరాబాద్‌లోని కోకాపేట, బుద్వేల్‌లో ప్రభుత్వం భూముల్ని అమ్మేసిన సంగతి తెలిసిందే. త్వరలో మరిన్ని భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ భూముల ద్వారా ఇప్పటికే వందల కోట్లు సంపాదించిన ప్రభుత్వం మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Land Auction: తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న భూముల అమ్మకం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఆదాయం కోసం భూములు అమ్ముతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. దీని వెనుక రియల్ మాఫియా హస్తం కూడా ఉందనే ఆరోపణలున్నాయి.
హైదరాబాద్‌లోని కోకాపేట, బుద్వేల్‌లో ప్రభుత్వం భూముల్ని అమ్మేసిన సంగతి తెలిసిందే. త్వరలో మరిన్ని భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ భూముల ద్వారా ఇప్పటికే వందల కోట్లు సంపాదించిన ప్రభుత్వం మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా రూ.4,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని అమలు చేయాలనుకోవడంతో, నిధుల అవసరం ఉంది. దీనికోసం ప్రభుత్వ భూముల్ని అమ్మేస్తోంది. వేలంలో భూములకు ఎకరాకు రూ.100 కోట్ల వరకు ధర పలుకుతూ, ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. భూముల వేలం వెనుక రియల్ మాఫియా, ప్రభుత్వ కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరల్ని విపరీతంగా పెంచేసి విక్రయిస్తోంది. ఈ వేలంలో పాల్గొనేందుకు డిపాజిట్‌దారులు లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. దీంతో చాలా మంది లక్ష రూపాయల డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొంటున్నారు. చివరకు ధరలు ఎక్కువగా ఉండటంతో కొనకుండా వదిలేస్తున్నారు. దీనివల్ల డిపాజిటర్లు రూ.లక్ష నష్టపోవాల్సి వస్తోంది. డిపాజిట్ సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వరు. ఈ వేలంలో పాల్గొంటున్నది రియల్ వ్యాపారులే. పైగా వేలం జరుగుతున్న ప్రాంతాలకు చుట్టుపక్కల భూములు కొనుక్కున్నదివాళ్లే. వేలంలో పాల్గొనడం వల్ల వీలైతే వారికి భూములు దక్కే ఛాన్స్ ఉంది. ఒకవేళ భూములు దక్కకపోయినప్పటికీ.. ఈ వేలం ద్వారా భూములు అధిక ధరలకు అమ్ముడుపోతాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న తమ భూముల ధరలు పెరుగుతాయి. ఎలాగైనా రియల్ వ్యాపారులకు లాభమే. లక్ష రూపాయల డిపాజిట్ మాత్రం పోతుంది అంతే.
ప్రభుత్వం నిర్వహిస్తున్న హెచ్‌ఎండీఏ భూముల వేలంలో కూడా ఇదే జరుగుతోంది. ఇక్కడ కూడా రియల్ వ్యాపారులు వేలంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచుతోంది. ఈ వేలంలో మధ్యతరగతి వారితోపాటు రియల్ వ్యాపారులు పాల్గొంటున్నారు. కానీ, ఎక్కువగా భూములు కొంటోంది మాత్రం మధ్య తరగతి ప్రజలే. వీళ్లు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. రియల్ వ్యాపారులు మాత్రం వేలంలో పాల్గొని భూములు కొనకుండా వదిలేస్తున్నారు. ఇదంతా అటు సర్కార్.. ఇటు రియల్ మాఫియా కలిసి ఆడుతున్న నాటకంగా చెబుతున్నారు విశ్లేషకులు. రియల్ మాఫియా ఉద్దేశం వేలంలో పాల్గొనడం ద్వార లక్ష రూపాయలు పోయినా.. భూములు విలువ మాత్రం ఎన్నో రెట్లు పెరుగుతోంది. ఇటీవల హెచ్ఎండిఏ మోకిలా ఫ్లాట్ల వేలం విషయంలోనూ ఇదే జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
రియల్ బూమ్ కోసం
గత ఏప్రిల్‌లో 111 జీవోను ఎత్తివేయడంతో దాదాపు లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. ఈ 111 జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా హెచ్ఎండిఏ అనుమతితో 400 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇలా అధికస్థాయిలో భూమి అందుబాటులోకి రావడంతో పోటీ తగ్గి, రియల్ రంగం నెమ్మదించింది. ఈ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంతమాత్రంగానే సాగుతోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. భూముల క్రయవిక్రయాలు జరిగి, రిజిస్ట్రేషన్లు జరిగితేనే ఆదాయం. అందుకే రియల్ ఎస్టేట్ రంగానికి బూమ్ తెచ్చే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం భూముల వేలం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్థికమాంద్యం వల్ల కుప్పకూలుతున్నరియల్ ఎస్టేట్ రంగానికి భూముల విక్రయం ద్వారా ఎంతోకొంత ఊపు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తాజాగా ప్రభుత్వం రియల్ వ్యాపారం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.