Hyderabad: ‘యూటీగా హైదరాబాద్’.. నిజమెంత ? అబద్ధమెంత..?
‘హైదరాబాద్ యూటీ అంశం’!! భాగ్యనగరిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటూ కొందరు నెటిజన్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వరుస పోస్టులతో కాక పుట్టిస్తున్నారు. తమదైన శైలిలో దానిపై అనాలిసిస్‌లు వండి వారుస్తున్నారు. అవన్నీ వదంతులు అని తెలియక.. కొందరు నెటిజన్స్ వాటిని నిజమేనని నమ్మేస్తున్నారు.
Hyderabad: సోషల్ మీడియా.. ఒక అంతులేని ప్రపంచం. ఇక్కడ ఆలోచనలకు, చర్చలకు అంతు అనేది ఉండదు. తాజాగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక టాపిక్‌పై సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. అదే.. ‘హైదరాబాద్ యూటీ అంశం’!! భాగ్యనగరిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటూ కొందరు నెటిజన్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వరుస పోస్టులతో కాక పుట్టిస్తున్నారు. తమదైన శైలిలో దానిపై అనాలిసిస్‌లు వండి వారుస్తున్నారు. అవన్నీ వదంతులు అని తెలియక.. కొందరు నెటిజన్స్ వాటిని నిజమేనని నమ్మేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ యూటీగా మారుతుందనే ఊహల్లోకి వెళ్లిపోతున్నారు.
ఉమ్మడి రాజధాని గడువు ముగిశాక..
ఏపీ విభజన చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. 2024 జూన్‌లోగా దీనికి సంబంధించిన గడువు ముగియబోతుంది. దీన్ని రాజకీయ అదునుగా భావించి.. ఆ సమయానికి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను యూటీగా ప్రకటించినా ఆశ్చర్యం లేదని కొందరు నెటిజన్స్ వాదిస్తున్నారు. బీజేపీ బలంగా ఉన్న హైదరాబాద్‌ను యూటీగా ప్రకటిస్తే.. పార్టీపరంగా ఎంతో ప్రయోజనం దక్కుతుందనే అభిప్రాయాన్ని ఇంకొందరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి అంశాలపైనే వాడివేడి చర్చ నడుస్తోంది. ఎవరికి నచ్చిన విధంగా వారు భాష్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఢిల్లీకి బదులు.. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసే యోచన కూడా కేంద్ర సర్కారుకు ఉందని ఇంకొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. హైదరాబాద్‌కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవని విశ్లేషణలు చేస్తున్నారు.
నిజాం స్టేట్ విలీన తేదీ రోజే..
‘‘కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయనుంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి రంగంలోకి దిగి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడారు. 2024 జూన్ నుంచి హైదరాబాద్ యూటీగా మారే ఛాన్స్ ఉంది’’ అని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా డిస్కషన్ జరుగుతోంది. నిజాం స్టేట్ 1948 సెప్టెంబర్ 17న దేశంలో విలీనమైంది. ఆ తేదీనే హైదరాబాద్‌ను యూటీగా ప్రకటిస్తారంటూ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. ఈసారి ఆ విధమైన ప్రచారం ఇంకొంచెం జోరుగానే సాగింది. ఇదంతా అబద్ధమే అయినా.. నిజమేనని నమ్మిన నెటిజన్స్ కూడా లేకపోలేదు.
ఆదాయానికి కేరాఫ్ అడ్రస్
తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర హైదరాబాద్‌దే. ఈ మహానగరం నుంచి తెలంగాణకు అపరిమిత ఆదాయం వస్తోంది. అలాంటి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఛాన్స్ ఉందనే గాసిప్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్‌తో పాటు కలకత్తా, బెంగళూరులాంటి మరో రెండు, మూడు మహా నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి ఎంత వరకు నిజమో తెలియదు. అలా చేస్తే మాత్రం ప్రతిపక్షాలు భగ్గుమంటాయి. ఎందుకంటే హైదరాబాద్, కలకత్తా, బెంగళూరుల్లో బీజేపీ అధికారంలో లేదు. అందువల్ల కావాలనే ఇలాంటి పనికి ఒడి గట్టిందని ఆందోళనలు మొదలవుతాయి.