ICMR: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులు.. ఆ మరణాలపై అధ్యయనం చేస్తున్న ఐసీఎంఆర్
2020, 2021లో కోవిడ్ ప్రపంచాన్ని వణికించింది. కోట్లాది మంది కోవిడ్ బారిన పడ్డారు. చాలా మంది కోలుకున్నారు. కోవిడ్ నివారణగా ప్రభుత్వం వ్యాక్సిన్లను ఉచితంగా అందించింది. దీంతో చాలా మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. అయితే, కొంతకాలం తర్వాత నుంచి చాలా మంది గుండెపోటుతో మరణించారు
ICMR: కొంతకాలంగా దేశంలో గుండెపోటు మరణాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. యుక్త వయసు వాళ్లు, పిల్లలు సహా చాలా మంది గుండెపోటుతో మరణించారు. గతంలోకంటే ఎక్కువ మంది హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి కోవిడ్ వైరస్, వ్యాక్సినే కారణమని ప్రచారం జరిగింది. దీనిపై ఐసీఎంఆర్ (ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదికలో ఏం తేలింది..?
2020, 2021లో కోవిడ్ ప్రపంచాన్ని వణికించింది. కోట్లాది మంది కోవిడ్ బారిన పడ్డారు. చాలా మంది కోలుకున్నారు. కోవిడ్ నివారణగా ప్రభుత్వం వ్యాక్సిన్లను ఉచితంగా అందించింది. దీంతో చాలా మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. అయితే, కొంతకాలం తర్వాత నుంచి చాలా మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో ఎక్కువ మంది గతంలో కోవిడ్ బారిన పడటంతోపాటు, వ్యాక్సిన్లు తీసుకున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే, కోవిడ్, వ్యాక్సిన్ల కారణంగానే ఎక్కువ మంది మరణిస్తున్నారనే ప్రచారం మొదలైంది. గుండెపోటుతో మరణించిన వారిలో యుక్త వయసు వాళ్లు, టీనేజ్ పిల్లలు కూడా ఉన్నారు. వరుసగా గుండెపోటు మరణాలు నమోదు అవుతుండటంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఇంత తక్కువ వయసు వారికి హార్ట్ ఎటాక్ రావడానికి కారణం వ్యాక్సిన్ల దుష్ప్రభావమే అనే ప్రచారం ఊపందుకుంది. ఈ కారణంగా చాలా మందిలో ఎక్కడలేని ఆందోళన పెరిగింది. దీనిపై కేంద్రం స్పందించింది. ఐసీఎంఆర్‌ను రంగంలోకి దింపింది. దీనిపైనే కొంతకాలంగా ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది.
కొనసాగుతున్న అధ్యయనం
కోవిడ్.. వ్యాక్సిన్లు.. గుండెపోటు.. వీటికిగల సంబంధాలపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నాలుగు వేర్వేరు అధ్యయనాలు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బల్ తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు. గుండెపోటు మరణాలకుగల అసలైన కారణాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు, అనేక కోణాల్లో విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. బల్ చెప్పిన వివరాల ప్రకారం.. మరణించిన వారి వయసు, కారణాలు, వారి అలవాట్లు, కోవిడ్ తీవ్రత వంటి కారణాలతోపాటు వైద్య రిపోర్టుల్ని పరిశీలిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా.. లేదా.. తీసుకుంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు.. దేశంలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.. వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
వారి బంధువులు, సన్నిహితుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అలాగే కోవిడ్, గుండెపోటుకు గురై కోలుకున్న వారి నుంచి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. ఇవే కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కూడా కొందరు మరణించారు. వారి అటాప్సీ రిపోర్టులను కూడా అధ్యయనం చేస్తున్నారు. అన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత దీనిపై తుది నివేదిక రూపొందిస్తారు. అనంతరం ఈ మరణాలపై ఒక అంచనాకు రావొచ్చని బల్ అన్నారు. త్వరలోనే నివేదిక అందుబాటులోకి వస్తుందని తెలిపారు.