పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం ఔట్ కొత్త రూల్ పెట్టిన కంపెనీ
ఉద్యోగాలు ఇవ్వడానికి ముందే చేసే ఇంటర్వ్యూల్లో ఓ వ్యక్తికి పెళ్లి అయిందా లేదా అని సంస్థలు తెలుసుకుంటాయి. వివాహమైన వారికంటే కూడా కాని వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి కూడా.

ఉద్యోగాలు ఇవ్వడానికి ముందే చేసే ఇంటర్వ్యూల్లో ఓ వ్యక్తికి పెళ్లి అయిందా లేదా అని సంస్థలు తెలుసుకుంటాయి. వివాహమైన వారికంటే కూడా కాని వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి కూడా. ఎందుకంటే వారు ఏ సమయంలో ఆఫీసుకు రమ్మన్నా వస్తారని, ఇంటి గురించి పట్టించుకుంటూ ఆందోళన చెందరని భావిస్తుంటాయి. కానీ తాజాగా ఓ కంపెనీ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. తమ కంపెనీలో పని చేసే వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకోవాలని.. లేని పక్షంలో వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని ప్రకటించింది. చైనాలోని టాప్ 50 కంపెనీళ్లో ఒకటి అయిన షన్‌టైన్ కెమికల్ గ్రూప్ తాజాగా ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
ముఖ్యంగా తమ వద్ద పని చేస్తున్న పెళ్లిళ్లు కాని యువతీ యువకులు, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని వారిని పెళ్లిళ్లు చేసుకోమని చెప్పింది. లేదంటే ఉద్యోగంలోంచి తొలగిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు పెళ్లి చేసుకునేందుకు సెప్టెంబర్ వరకు గడువు కూడా విధించింది. కంపెనీలో మొత్తం 1200 మంది పెళ్లి కాని, విడాకులు తీసుకున్న వారు ఉండగా.. 28-58 ఏళ్ల వయసున్న వారంతా మరో ఏడు నెలల్లో పెళ్లిళ్లు చేసుకోవాని లేకపోతే ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నట్టు లెటర్ ఇచ్చి వెళ్లిపోవాలని సూచించింది. అలాగే జూన్‌లో ఉద్యోగుల వైవాహిక స్థితిని పరిశీలిస్తామని.. సెప్టెంబర్ వరకు కూడా పెళ్లిళ్లు చేసుకోకపోతే చర్యలు తీసుకోక తప్పదని వెల్లడించింది.
దీంతో ఉద్యోగులతో పాటు స్థానిక ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.. బలవంతంగా ఎవరినీ ఇలా పళ్లిళ్లు చేసుకోవాలని చెప్పకూడదని చెబుతున్నారు. అసలు కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలు, విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోవద్దని చెప్తున్నారు. ఇలా చేయడం స్వాతంత్రాన్ని హరించడంతో పాటు రాజ్యాంగ విరుద్ధం కిందకు వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఫిబ్రవరి 14వ తేదీనే సదరు సంస్థ కూడా ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉపసంహరణ ప్రస్తుతానికి మాత్రమేనా.. లేక కొన్ని రోజుల తరువాత మళ్లీ ఇదే రూల్స్ పెడతారా చూడాలి.