Agent: ఏజెంట్లను నమ్మితే బతుకులు రోడ్డుపాలే..! కెనడాలో భారతీయ విద్యార్థుల దుస్థితి

విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ జీవితం.. బతుకుపై కొత్త ఆశలను కల్పిస్తాయి.. జీవితానికి స్వదేశంలో లభించని భరోసాను ఇస్తాయి. ఖండాంతరాలు దాటి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి.. అక్కడే ఉద్యోగం సంపాందించే ఆ దేశాన్నే తమ నివాసంగా చేసుకునే వాళ్లు కొందరైతే.. విదేశాల్లో కొంతకాలం చదువు, ఉద్యోగం తర్వాత సొంత దేశానికి తిరిగి వచ్చి సేవలు అందించే వాళ్లు ఇంకొందరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2023 | 03:56 PMLast Updated on: Jun 08, 2023 | 3:56 PM

If You Trust The Agents You Will Be Saved Plight Of Indian Students In Canada

అయితే డాలర్ డ్రీమ్స్ తో విదేశాల్లో అడుగుపెట్టేవాళ్ల అందరి జీవితాలు ఒకేరకంగా ఉండవు. ఏజెంట్ల చేతిలో మోసపోయి రోడ్డున పడేవాళ్లు ఎందరో. ప్రస్తుతం కెనడాలోనూ భారతీయ విద్యార్థులు ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు. దాదాపు 700 మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

దేశం వదిలివెళ్లాలంటూ కెనడా ఆ దేశం
2018లో వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందారు. వాళ్లల్లో చాలా మంది ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో కూడా చేశారు. అయితే పంజాబ్‌కు చెందిన దాదాపు 700 మంది విద్యార్థులకు మాత్రం ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. నకిలీ డాక్యుమెంట్లతో వీరంతా కెనడా యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందినట్టు ఆ దేశ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఫేక్ డాక్యుమెంట్స్ తో దేశంలోకి అడుగుపెట్టారని భావిస్తున్న వాళ్ల వివరాలు సేకరించిన అధికారులు వాళ్లపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇలాంటి వ్యవహారాలను పర్యవేక్షింజే కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ… 700 మంది భారతీయ విద్యార్థులకు తాఖీదులు పంపింది. తక్షణం దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించింది.

నిజంగానే మనవాళ్లు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారా ?
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కొలువులకు డిమాండ్ పెరిగిన తర్వాత తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. ఎక్కడా చనిపోకపోయినా.. పనిచేసినట్టు….ఆయారంగంలో అనుభవం లేకపోయినా.. అనుభవం ఉన్నట్టు.. ఇలా అనేక తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి.. కార్పోరేట్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించడం.. ఆ తర్వాత జరిగే థర్డ్ పార్టీ ఎంక్వైరీలో పట్టుబడి ఉద్యోగాలు కోల్పోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే కెనడాలో ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీలో చేరిన భారతీయ విద్యార్థులు కూడా అలా తప్పుడు ధృవపత్రాలు పెట్టారన్నది అక్కడి ప్రభుత్వం మోపిన అభియోగం. కెనడా చట్టాల ప్రకారం ఒకరకంగా ఇది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కిందకే వస్తుంది. అందుకే 700 మంది స్టూడెంట్స్ కు డిపోర్టేషన్ నోటీసులు పంపింది.

అసలు పాపం ఏజెంట్లదేనా ?
కెనడాలో భారతీయ విద్యార్థులు ఇన్ని సమస్యలు ఎదుర్కోవడానికి మూలకారణం ఏజెంట్ల ఆగడాలే. అన్నీ తామే చూసుకుంటామని లక్షల్లో కమిషన్లు వసూలు చేసే ఏజెంట్లు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కెడనా యూనివర్శిటీలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తైనా సరే.. భారతీయ విద్యార్థులకు ఆశచూపి.. తప్పుడు అడ్మిషన్ లెటర్లు సృష్టించిన ఏజెంట్లు వాళ్లను నిలువునా ముంచేశారు. ఈ విషయం కెనడాలో అడుగుపెట్టేవరకు మనవాళ్లకు తెలియదు. కెనడాలో చేరుకోగానే.. మీరు అప్లై చేసుకున్న యూనివర్శిటీలో సీట్లు అయిపోయాయి.. అనేక కారణాల వల్ల.. యూనివర్శిటీ ఎక్కువ మంది స్టూడెంట్స్ కు అడ్మిషన్ లెటర్స్ ఇచ్చింది.. కానీ అక్కడ చదవడం కుదరని ఏజెంట్లు చెప్పుకొచ్చారు. అయితే మరో కాలేజీలో చదివే ఏర్పాటు చేస్తామని చెప్పడంతో.. విద్యాసంవత్సరం లాస్ అవకుండా ఉంటుందన్న కారణంగా స్టుడెంట్స్ ఒప్పుకున్నారు. చివరకు అది వాళ్ల మెడకే చుట్టుకుంది. ఏ యూనివర్శిటీలో చదువుల కోసం కెనడా వచ్చారో ఆ యూనివర్సిటీలో చదవకపోవడం.. ఏజెంట్లు గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. ఉన్న పళంగా దేశ విడిచి వెళ్లిపోమంటే వాళ్లైనా ఏం చేస్తారు.

ఆ 700 మంది భవిష్యత్తు ఏంటి ?
తప్పుడు చేసింది ఏజెంట్లే అయినా..దానికి మూల్యం చెల్లిస్తున్నది మాత్రం భారతీయ విద్యార్థులు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన 700 మందిలో మెజార్టీ విద్యార్థులు పంజాబ్‌కు చెందిన వాళ్లే. వీళ్లలో చాలామంది కెనడాలో స్థిరపడిపోవాలనే ఆలోచనతోనే ఆ దేశంలో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని పంజాబ్ ప్రభుత్వం కోరుతోంది.

రోడ్డెక్కిన విద్యార్థుల గోడు వింటారా ?
కెనడాలో తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం, చదువు పూర్తయిన ఐదేళ్లకు దేశం వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు తలెత్తడంతో 700 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చివరకు దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులు మరొకరి చేతిలో మోస పోవడంతో వాళ్లను బాధితులుగా చూసి… తగిన చర్యలు తీసుకుంటామని చెబుతుంది.

కెనడా నేర్పుతున్న పాఠం ఏంటి?
ఒక్క కెనడా మాత్రమే కాదు.. కెనడా, అమెరికా , ఆస్ట్రేలియా సహా ఏదేశానికి వెళ్లాలనుకున్న అధికారిక మార్గాలను మాత్రమే నమ్ముకోవడం ఉత్తమం. తెలిసీతెలియక ఏజెంట్ల చేతిలో చిక్కితే వాళ్ల డబ్బుల కక్కుర్తికి జీవితాలు నాశనమైపోతాయి. ఆయా దేశాల ఇమిగ్రేషన్ విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటిని అనసరిస్తే.. భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.