Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన.. ఎల్లో అలర్ట్ జారీ..!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Telangana Rains: తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రానున్న మూడు రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ సూచనలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈశాన్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి.. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో గ్రీన్ అలర్ట్ జారీ చేశారు.
ఇక అటు ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి మొదలైన ముసురు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఒక గేటు వదిలి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. బోథ్ కండ్రే వాగు, నక్కలవాడ, కోట వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది.