Rains In Telangana: రేపటి నుంచి జోరు వానలు.. తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక..

రైతులకు ఆగస్టు నెల చాలా ముఖ్యం. మెుక్కలు ఎదిగే దశ కాబట్టి వర్షం అవసరం. అయితే చాలా రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంది. హైదరాబాద్‌లో అడపాదడపా వర్షాలు మినహా.. మిగతా జిల్లాల్లో మాత్రం వరుణుడు పలకరించడంలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 17, 2023 | 02:31 PMLast Updated on: Aug 17, 2023 | 2:31 PM

Imd Predicts Moderate To Heavy Rainfall In Next 3 4 Days In These Districts

Rains In Telangana: 20 రోజుల కింద వణుకు పుట్టించిన వానలు.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాయి. వర్షం కాదు కదా.. ఎండలు దంచికొడుతున్నాయ్. ఉక్కపోత పెడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇది ఎండా కాలమా.. వానకాలమా అనే అనుమానం వచ్చేంతలా ఎండలు కొడుతున్నాయి. జులై చివరి వారంలో వర్షాలు దంచికొట్టగా.. ఆగస్టు ప్రారంభం నుంచి వరుణుడి అడ్రస్ గల్లంతయింది. రైతులకు ఆగస్టు నెల చాలా ముఖ్యం. మెుక్కలు ఎదిగే దశ కాబట్టి వర్షం అవసరం.

అయితే చాలా రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంది. హైదరాబాద్‌లో అడపాదడపా వర్షాలు మినహా.. మిగతా జిల్లాల్లో మాత్రం వరుణుడు పలకరించడంలేదు. దానికి తోడు ఎండ తీవ్రత కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య తెలంగాణలోని రైతులకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే కాకుండా మయన్మార్ నుంచి మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయి. ఈశాన్యాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద, సముద్ర మట్టం నుంచి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఉంది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు.