Antibiotics: ఇక యాంటీబయాటిక్స్ పనిచేయవ్..! ప్రపంచానికి పొంచి ఉన్న అతి పెద్ద ఆరోగ్య సమస్య..

సమీప భవిష్యత్తులో యాంటీ బయాటిక్స్ పనిచేయడం మానేయబోతున్నాయి. యాంటీబయాటిక్స్ తీసుకున్నా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. త్వరలో ప్రపంచం ఎదుర్కోబోతున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఇదే కాబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 9, 2023 | 07:07 PMLast Updated on: Aug 09, 2023 | 7:07 PM

Increase In Air Pollution Could Be Behind Rising Antibiotic Resistance

Antibiotics: జలుబు, దగ్గు, జ్వరం.. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. వైద్యులు ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ ఇస్తారు. రెండు మూడు రోజులు యాంటీబయాటిక్స్ వాడితే ఉపశమనం వస్తుంది. కొన్ని కొన్ని మొండి వ్యాధులు యాంటీబయాటిక్స్‌కు లొంగకపోయినా ఓవరాల్‌గా చూసుకుంటే యాంటీబయాటిక్స్‌ను లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌గా వైద్యశాస్త్రం చెబుతుంది. అయితే సమీప భవిష్యత్తులో యాంటీ బయాటిక్స్ పనిచేయడం మానేయబోతున్నాయి. యాంటీబయాటిక్స్ తీసుకున్నా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. త్వరలో ప్రపంచం ఎదుర్కోబోతున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఇదే కాబోతోంది. దీనికి కారణం ఏంటో తెలుసా.. ఎయిర్ పొల్యూషన్. అవును.. వాయు కాలుష్యం కారణంగా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. దీంతో ఇప్పటి వరకు యాంటీబయాటిక్స్ కారణంగా తగ్గిన రోగాలు.. ఇకపై విజృంభిస్తాయి. ఇది దేశవ్యాప్తంగా లక్షల్లో మరణాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.
యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే ఏమవుతుంది..?
అనారోగ్య సమస్యలపై పోరాడేందుకు మనుషులకు వైద్య శాస్త్రం అందించిన అతిగొప్ప ఆయుధం యాంటీబయాటిక్స్. మనశరీరంలో వ్యాధులు, రోగాలకు కారణమైన బ్యాక్టీరియాలను, వైరస్‌లను ఇవి అంతమొందిస్తాయి. ఒకరకంగా యాంటీబయాటిక్స్ మన శరీరంలో ఉన్న శత్రువులతో పోరాటం చేసి మనిషికి ప్రాణహాని లేకుండా చేస్తాయి. జబ్బులను తరిమికొడతాయి. కానీ యాంటీబయాటిక్స్ పనిచేయని రోజు ఒకటి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, రోగాలు కూడా యాంటీబయాటిక్స్ పనిచేయని కారణంగా ప్రాణాంతకంగా మారతాయి. కొన్ని రకాల సర్జరీలను కూడా వైద్యులు చేయలేకపోతారు. సర్జరీల తర్వాత వచ్చే ఇన్‌ఫెక్షన్లను యాంటీబయాటిక్స్ అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ మానవాళిని పూర్తిగా కమ్మేసి జీవచ్ఛవంలా మార్చేస్తుంది.
మరణాలను నియంత్రించలేమా..?
వాయుకాలుష్యం కారణంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగి ఒక్క 2018వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల 80 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అంతర్జాతీయ వైద్య గణాంకాలు చెబుతున్నాయి. 2050 వచ్చే నాటికి ప్రతియేటా 8 లక్షల 40 వేలమంది యాంటీబయాటిక్ రెసిస్టన్స్ కారణంగా చనిపోతారని శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో యాంటీబయాటిక్స్ క్రమంగా పనిచేయడం మానేస్తున్నాయి.
వాయుకాలుష్యమే అన్నింటికీ మూలం
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వాయుకాలుష్యం పర్యావరణానికే కాకుండా మానవాళి మనుగడకు కూడా చాలా ముప్పుగా మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలుష్యం పెరుగుతున్న కొద్దీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ వస్తోందని లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. గాలి, నీరు, భూమి, ఆహారం ఇలా పర్యావరణంలోని అనేక అంశాల ద్వారా మనిషి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బాక్టీరియాతోపాటు యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ బారిన పడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. వాయుకాలుష్యం 10 శాతం పెరిగితే.. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒక్క శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది. రెండింటి మధ్య వ్యత్సాసం ఎక్కువగా ఉన్నట్టు కనిపించినా.. దీని ప్రభావం మాత్రం మనిషి ఊహించని స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ప్రజలు దీని ప్రభావానికి లోనయ్యారు. యాంటీబయాటిక్స్ పనిచేయని కారణంగా ప్రతియేటా పది లక్షల మంది చనిపోతున్నారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ప్రమాదం నుంచి బయటపడలేమా..?
పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని ప్రపంచదేశాలు సీరియస్‌గా తీసుకోకపోతే.. మానవాళి చరిత్రలో ఊహించని ముప్పును ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. కర్బన ఉద్గారాలను నియంత్రిస్తూ వాయుకాలుష్యానికి కారణమవుతున్న పర్యావరణ అంశాలపై అన్ని దేశాలు తక్షణం దృష్టి సారించాలి. 2050 నాటికి ఎయిర్ క్వాలిటీని మెరుగుపరచుకోకపోతే ప్రతియేటా లక్షలాది మంది ప్రజలు ఈ భూతానికి బలైపోతారు. ఇది అక్కడితో ఆగదు. ప్రజల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ క్రమంగా పెరిగిపోతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ప్రాణాంతకంగా మారిపోతాయి. ఈ ప్రభావం పేద దేశాలపై ఎక్కువగా ఉంటుంది. నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా దేశాలపై ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందా..?
భారత్‌తో పాటు చైనా కూడా ఈ వినాశనం వల్ల నష్టపోయే దేశాల జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే వాతావరణంలో పేరుకుపోయిన ప్రమాదకర పదార్ధాల వల్ల కంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కారణంగా జరిగే నష్టమే ఎక్కువ ఉండబోతోంది. World Air Quality Report ప్రకారం ఎయిర్ క్వాలిటీ అత్యంత దారుణంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉంది. అంటే మనదేశంలో గాలి పూర్తిగా కలుషితమైపోయింది. స్వచ్ఛమైన గాలి అన్నది భారత్‌లో అరుదైన విషయమనే చెప్పాలి. దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ ఉన్న నగరాల జాబితాను పరిశీలిస్తే.. మొత్తం 15 సిటీల్లో 12 భారత్‌లోనే ఉన్నాయి. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ భారత్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద అనారోగ్య సమస్య.