Chandrayaan-3: 140 కోట్ల మంది ఆశలను మోసుకెళ్తోన్న రాకెట్.. చంద్రయాన్ 3 ఎందుకు అంత ప్రత్యేకం..?
దేశ అంతరిక్ష చరిత్రలో అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన ప్రయోగం ఇది. జాబిల్లికి చేరువ కావాలన్న లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల ఆశలు నెరవేర్చేందుకు ఇస్రో చేపటిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ప్రయోగం.. మరికొన్ని గంటల్లో జరగబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదిక అవుతోంది.
Chandrayaan-3: దేశమంతా బిగపట్టి చూస్తున్న క్షణం.. విజయవంతం కావాలని కోరుకుంటున్న సందర్భం. ఇస్రో ఆశయం.. ఇది దేశ ప్రతిష్ట మాత్రమే కాదు.. 140 కోట్ల మంది ఆశ. వైఫల్యం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నామో చెప్పే పరీక్ష. సక్సెస్ అయితే దేశం మీసం తిప్పే సందర్భం. అందుకే చంద్రయాన్-3 చాలా ప్రత్యేకం. ఇంకొన్ని గంటట్లో చంద్రయాన్ 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్.. చంద్రయాన్ 3.
దేశ అంతరిక్ష చరిత్రలో అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన ప్రయోగం ఇది. జాబిల్లికి చేరువ కావాలన్న లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల ఆశలు నెరవేర్చేందుకు ఇస్రో చేపటిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ప్రయోగం.. మరికొన్ని గంటల్లో జరగబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదిక అవుతోంది. 2019లో విఫలమైన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో ఇస్రో శాస్త్రవేత్తలు చాలా కష్టపడి ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు కొనసాగింపుగా చేపడుతున్న ఈ మిషన్ ఎలాంటి దశల్లోనూ టార్గెట్ మిస్ కావొద్దన్న పట్టుదలతో సైంటిస్టులు చేస్తున్న కృషిని ప్రపంచమంతా భారత్ వైపు తిప్పుకునేలా చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేస్తుంది. గతంలో అమెరికా, రష్యా, చైనా ఈ ఘనత సాధించగా ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్ కూడా చేరబోతుంది.
అమెరికా, రష్యా, చైనా దేశాలు మూన్ మిషన్ కోసం వేలకోట్లు ఖర్చు చేశాయి. ఇస్రో మాత్రం దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తోనే ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రయాన్ 3కి రూ.650 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. చందమామపైకి ల్యాండర్‌ను జారవిడిచే చంద్రయాన్ 1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో.. చంద్రుడిపై రోవర్‌ను దింపే లక్ష్యంతో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని పడిలేచిన కెరటంలా ఇస్రో.. లోపాలను సవరించుకొని చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధమైంది. ఆగస్టు 23, 24 తేదీల్లో చంద్రుడి చెంతకు లాండర్ చేరుతుంది. 40 రోజుల తర్వాత చంద్రయాన్ 3.. చంద్రుడిని చేరుకుంటుంది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్ భూమి చూట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. అత్యంత సమీపంగా 170 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 36 వేల 500 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అప్పుడు భూ కక్ష్యను వదిలి చంద్రుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. చంద్రుడిని చేరుకొనేందుకు 40 రోజులు పడుతుంది.
దీనికి అతి తక్కువ ఇంధనమే అవసరం పడుతుంది. దీంతో ప్రయోగం ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. చంద్రయాన్ ప్రయోగంలో మూడు మాడ్యూల్స్ ప్రధానంగా పనిచేస్తాయ్. మొదటిది ప్రొపల్షన్ మాడ్యూల్. ఇది రాకెట్‌ను నింగిలోకి తీసుకెళ్తుంది. రెండోది లాండర్ మాడ్యూల్. చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించేది ఇదే. ఇక మూడవది రోవర్. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరం ఇది. అక్కడ ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై అధ్యయనం చేయడమే కాదు.. ఇతర గ్రహాలపై జీవాన్ని కనుగొనడంలోనూ ఉపయోగపడుతుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ఏర్పాట్లు చేసింది. దీన్నే ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్లు అంచనా వేయడమే. ఆ ప్రాంతంలో మంచు స్ఫటికాల రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని నాసా కూడా గుర్తించింది. నీరు ఉన్న చోట మనిషి నివసించగలడు. భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అన్నీ సవ్యంగా జరిగితే ఆగస్టు 23 లేదా 24న ల్యాండర్, రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగుతుంది. ఈ నేపథ్యంలో యావద్భారతం.. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తోంది.