India Population: ఆ విధంగా ముందుకు..! జనాభాలో చైనాను దాటేశాం..!
కొట్టేశాం.. చైనాను వెనక్కు నెట్టేశాం..! భారతీయులంతా కాలరెగరేసుకు తిరగండి.. గర్వంగా చెప్పుకోండి.. ఇంతకీ మనం ఎందులో చైనాను కొట్టేశాం అంటారా.? జనాభాలో..అవును తాజా లెక్కల ప్రకారం చైనా జనాభాను మనం దాటిపోయాం. ప్రపంచ జనాభాలో ఇప్పుడు మనమే నెంబర్ వన్. ఇప్పట్లో మనల్ని కొట్టేవారు లేరు. రారు. ప్రస్తుతం భారత జనాభా 142.86కోట్లు... చైనాకంటే మన జనాభా 29లక్షలు అధికం..ప్రపంచ జనాభాలో ఐదోవంతు భారత్‌లోనే ఉంది.
ప్రపంచ జనాభాలో చైనాను మనం అధిగమించేశామన్న వార్త హోరెత్తిపోతోంది. నిజానికి దీనిపై ఐక్యరాజ్యసమితి నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. ఈనెలలోనే చైనాను భారత్ అధిగమించొచ్చని ఇటీవలే ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అయితే తేదీని మాత్రం కచ్చితంగా చెప్పలేమంది. కానీ నిపుణులు మాత్రం మనం ఇప్పటికే చైనాను దాటేశామంటున్నారు. మరో అంచనా ప్రకారం ఏప్రిల్14నాటికే మనం ఈ ఫీట్‌ను అందేసుకున్నామట. ప్రస్తుతం మన జనాభా సుమారు 143కోట్లనుకుందాం… కానీ మన జనభా ఏ రీతిన పెరిగిందో ఓసారి చూద్దాం.
సంవత్సరం జనాభా
1921 31.89కోట్లు
1941 38.89కోట్లు
1961 45.63కోట్లు
1981 71.28కోట్లు
2001 107.89కోట్లు
2011 125.76కోట్లు
2021 14.075కోట్లు
జనాభా పెరుగుదలకు కారణాలేంటి.?
దేశంలో కొన్ని దశాబ్దాలుగా జనాభా గణనీయంగా పెరుగుతోంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ఆధునిక ప్రపంచంలో రోజురోజుకు జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. ఫలితంగా ఆయుఃప్రమాణాలు పెరుగుతున్నాయి. దీంతో జననాల కంటే మరణాల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇక మన దేశంలో చైనాలో లాగా సంతానంపై నిషేధం లేదు. ఎవరు ఎంతమందినైనా కనొచ్చు.. అయితే జనంలో అవగాహన రావడం వల్ల ఇద్దరు, ముగ్గురికే పరిమితం అవుతున్నారు. లేకపోతే ఎప్పుడో చైనాను దాటేసేవాళ్లం. ఆరోగ్యరంగంలో పురోగతి కూడా జనాభా వృద్ధికి కారణమవుతోంది.
చైనాను ఎలా అధిగమించాం.?
చైనాలో కొంతకాలం వరకు ఒక్క సంతానానికే అవకాశం ఉండేది. దీంతో చైనా జనాభా క్రమంగా తగ్గింది. గతేడాది తొలిసారిగా చైనాలో జననాల కంటే మరణాలే ఎక్కువ రికార్డయ్యాయి. ఇటీవల చైనా సంతానంపై పరిమితి ఎత్తివేసినా చైనీయులు మాత్రం పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించడం లేదు. మన దగ్గర కూడా జనాభా వృద్ధి కాస్త తగ్గినా చైనాతో పోల్చితే అది చాలా తక్కువ. 2011వరకు మనకు సగటున జనాభాలో 1.7శాతం వృద్ధి కనిపించేది. కానీ గత దశాబ్దంలో మాత్రం అది సగటున 1.1శాతానికి పడిపోయింది.
మన జనాభాలో ఏ వయసు వారెందరు.?
యూఎన్‌ఎఫ్‌పీఎ నివేదిక ప్రకారం భారత జనాభాలో 25శాతం 0-14ఏళ్ల మధ్య వయసువారే. ఇక 10నుంచి 19 ఏళ్ల వయసున్నవారు 18శాతం. అదే 10నుంచి 24 ఏళ్లను తీసుకుంటే 26శాతం జనాభా వారే.. ఇంకా చెప్పాలంటే సగం జనాభా 30ఏళ్లలోపు వారే.. కొన్ని లెక్కల ప్రకారం కేరళ, పంజాబ్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్, బీహార్‌లో యువజనాభా కనిపిస్తోంది. మరో మూడు దశాబ్దాల పాటు జనాభాలో మనల్ని కొట్టేవారుండరు..ఇదే ఊపులో పెరుగుతూ పోతుంది. 165కోట్లను టచ్ చేస్తాం. ఆ తర్వాత నుంచి తగ్గుదల మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. 2050నాటికి మన జనాభా 165కోట్లకు చేరితే చైనా జనాభా 131కోట్లకు పడిపోతుందని చెబుతున్నారు.
మనకేంటి ఎడ్వాంటేజ్..?
ప్రపంచజనాభా వయసు పెరుగుతోంది. కానీ మన దగ్గర మాత్రం యువజనాభా పెరుగుతోంది. అంటే వర్క్‌ఫోర్స్ అంతా మన దగ్గరే ఉండబోతోంది. చైనాలో కఠినమైన ఆంక్షల కారణంగా గత కొన్ని దశాబ్దాల్లో జనాభా తగ్గిపోయింది. వయసుపైబడిన వారి సంఖ్య పెరిగింది. యువజనాభా తగ్గింది. అదే ఇప్పుడు ఆ దేశం కొంపముంచింది. అందుకే ఒక్కసారిగా జనాభాను పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. యంగ్ ఇండియాకు వయసే ఇప్పుడు అడ్వాంటేజ్. మన జనాభాలో పావుశాతం 14ఏళ్లలోపు వారే. అంటే మరో రెండు దశాబ్దాలు వారివే. మిగిలిన దేశాల్లో జనాభా తగ్గుదల కారణంగా మన యంగ్ ఇండియానే గ్లోబల్ వర్క్ ఫోర్స్‌గా మారుతుంది.
ఒకప్పుడు దేశాలు జనాభా పెరుగుదలతో భయపడేవి. ఆంక్షలు విధించేవి. కానీ మనం మాత్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు మిగిలిన దేశాలన్నీ జనాభాను పెంచుకోవడంపై దృష్టిపెడుతున్నాయి. మనం మాత్రం తగ్గించుకోవడంపై ఫోకస్ చేయాల్సిన టైమ్ వచ్చింది.!