Khalistani Supporters: కెనడాలో ఖలిస్తాన్‌కు అనుకూలంగా నిరసనలు.. భారత రాయబార కార్యాలయాల ఎదుట నిరసనలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్..!
సోమవారం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తాజాగా కెనడాలో భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేయాలని ఖలిస్తాన్ మద్దతుదారులు నిర్ణయించారు. దీనిపై ఇండియా.. కెనడాను ప్రశ్నించింది.
Khalistani Supporters: ఇండియాకు వ్యతిరేకంగా జరిగే కుట్రలకు కొన్ని దేశాలు వేదికగా మారుతున్నాయి. గతంలో బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరగగా.. ఇప్పుడు ఖలిస్తాన్ పేరుతో భారత రాయబార కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటిని అణచివేయడంలో, నియంత్రించడంలో ఆయా దేశాలు తాత్సారం చేస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోమవారం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తాజాగా కెనడాలో భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేయాలని ఖలిస్తాన్ మద్దతుదారులు నిర్ణయించారు. దీనిపై ఇండియా.. కెనడాను ప్రశ్నించింది.
ఇండియాలో సిక్కుల కోసం ఖలిస్తాన్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కొందరు సిక్కులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోకంటే ఇతర దేశాల్లో ఉన్న సిక్కులు దీనికి మద్దతిస్తున్నారు. ఖలిస్తాన్ ఏర్పాటుకు మద్దతుగా కెనడాలో ఈ నెల 8న ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. భారత రాయబార కార్యాలయం ఎదుట, భారత జాతీయ పతాకాన్ని దహనం చేస్తామని కూడా ప్రకటించారు. కెనడాలో భారత రాయబార కార్యాలయాలు ఉన్న ప్రతిచోటా ఈ రకమైన నిరసన, జెండా దహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ నిరసనలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ తరహా కార్యక్రమాల్ని అడ్డుకోవాలని సూచించింది. వీటికి అనుమతులు ఎలా ఇస్తారని జస్టిన్ ట్రూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపు వెనుక అమెరికాకు చెందిన ఎస్ఎఫ్‌జే అనే సంస్థ ఉన్నట్లు భారత్ అనుమానిస్తోంది. ఈ మేరకు ఇండియాలోని కెనడా రాయబారిని ఇండియా ప్రశ్నించింది. గత మార్చి 23న కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేశారు.
కెనడా ఏం చెబుతోంది..?
ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసనలకు పిలుపునివ్వడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ముద్రించిన కరపత్రాల్లో భారతీయ అధికారులైన సంజయ్ కుమార్ వర్మ, మనీష్, అపూర్వ శ్రీవాస్తవ పేర్లు కూడా ఉన్నాయి. దీంతో వాళ్లు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై కెనడా ప్రభుత్వం స్పందించింది. తమ ప్రభుత్వం రాయబార కార్యాలయాలు, రాయబారుల భద్రతకు కట్టుబడి ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, ఇప్పటికే భారతీయ అధికారులను సంప్రదిస్తున్నామని కెనడా విదేశాంగమంత్రి చెప్పారు.
నిరసనలకు కారణమేంటి..?
గత నెల 19న వ్యాంకోవర్‌లో ఖలిస్తాన్ తీవ్రవాద గ్రూప్ అయి ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు. రెండు గ్రూపులకు మధ్య జరిగిన కాల్పుల్లో నిజ్జార్ మరణించాడు. దీంతో ఖలిస్తాన్ మద్దతుదారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. రెండు గ్రూపుల వార్‌లో అతడు మరణించినప్పటికీ, దీనికి కారణం భారత రాయబార కార్యాలయం, భారత సెక్యూరిటీ ఏజెన్సీలో కారణమంటూ అక్కడి వాళ్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఇండియాకు వ్యతిరేకంగా నిరసలకు దిగుతున్నారు. అయితే, భారత వ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా చూడాలని బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాకు భారత్ సూచించింది. ఇలాంటి వాటిని అడ్డుకోవాలని కోరింది.