India E20 plan: మూడేళ్లలో ఈ20 లక్ష్యం నెరవేరేనా..? ఈ20తో కలిగే మేలేంటి..?
పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి వినియోగించవచ్చు. దీనివల్ల వాహనాలకు ఎలాంటి నష్టం జరగదు. కొన్ని దేశాలు ఇలానే వినియోగిస్తున్నాయి. మన దేశంలో కూడా పెట్రోల్‌లో ఇథనాల్ వాడుతున్నారు. కానీ, అది 11.75 శాతంగా మాత్రమే ఉంది.
India E20 plan: భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఈ20 ఒకటి. పెట్రోల్‌లో ఇరవై శాతం ఇథనాల్ కలిపేందుకు అనుగుణంగా తగినంత ఉత్పత్తి సాధించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. మన దేశం చమురు అవసరాల కోసం విదేశాలపైనే ఆధారపడుతోంది. గత ఏడాదినాటికి 86 శాతం ఇంధనాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ఇండియాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. పైగా వివిధ దేశాల మధ్య సంఘర్షణ మొదలైనప్పుడు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపిస్తోంది. అవసరం ఎక్కువున్నప్పటికీ మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తి పెంచడం సాధ్యమయ్యే పనికాదు.
కానీ, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి వాడితే ప్రయోజనం ఉంటుంది. దీనికున్న మరో మంచి మార్గం ఇథనాల్. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి వినియోగించవచ్చు. దీనివల్ల వాహనాలకు ఎలాంటి నష్టం జరగదు. కొన్ని దేశాలు ఇలానే వినియోగిస్తున్నాయి. మన దేశంలో కూడా పెట్రోల్‌లో ఇథనాల్ వాడుతున్నారు. కానీ, అది 11.75 శాతంగా మాత్రమే ఉంది. దీన్ని ఇరవై శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించుకుంది. 2025-26కల్లా ఇథనాల్-పెట్రోల్ కలిపే నిష్పత్తిని పెంచే ప్రక్రియే ఈ20. అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపి వినియోగించాలి. దీనివల్ల పెట్రోల్ వినియోగం తగ్గుతుంది. వాహనాలకు కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దేశానికి విదేశీ నిధులు మిగులుతాయి. ఇతర దేశాల నుంచి పెట్రోల దిగుమతి తగ్గుతుంది.
ఇథనాల్ ఉత్పత్తి
20 శాతం ఇథనాల్ వాడాలని నిర్ణయించుకున్నప్పటికీ మన దేశంలో ఆ స్థాయిలో ఇథనాల్ ఉత్పత్తి జరగడం లేదు. అందుకే ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇథనాల్‌ను వరి, మొక్కజొన్న, చెరుకు వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేయొచ్చు. ఈ వ్యర్థాలు కావాలంటే రైతులు ఈ పంటల్ని అధికంగా పండించాలి. అప్పుడు రైతుల నుంచి ఈ వ్యర్థాలు సేకరించాలి. దీనికి అనుగుణంగా ఈ పంటల్ని, వీటిని పండించే రైతుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్రం నిర్దేశించుకున్న టార్గెట్ ప్రకారం.. మరో రెండు, మూడేళ్లలోనే ఈ20 లక్ష్యాన్ని సాధించాలి. ప్రస్తుత అంచనా ప్రకారం.. 10.16 బిలియన్ లీటర్ల ఇథనాల్ కావాలి.
ఈ ఇథనాల్ ఉత్పత్తి కావాలంటే 275 మిలియన్ మెట్రిక్ టన్నుల చెరకు, 6.1 మిలియన్ మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 5.5 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి పండించాలి. ఈ పంటలకు 7.1 మిలియన్ హెక్టార్ల భూమి కావాలి. పంటల ఉత్పత్తితోపాటు కాస్మెటిక్, ఫార్మా రంగ పరిశ్రమలు కూడా తోడైతేనే ఇథనాల్ ఉత్పత్తి లక్ష‌్యాన్ని సాధించవచ్చు. 2025-26 కల్లా ఇథనాల్ అవసరం మరింత పెరుగుతుంది. దీని ప్రకారం.. మరో 3.35 బిలియన్ లీటర్లు.. అంటే మొత్తం 13.5 బిలియన్ లీటర్ల ఇథనాల్ అవసరం. చెరకు నుంచి దాదాపు 55 శాతం, వరి, మొక్కజొన్న వ్యర్థాల నుంచి మరో 45 శాతం ఇథనాల్ ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కేంద్ర దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లాలి.