Israel-Hamas War: పాలస్తీనాకు సాయం అందించిన భారత్.. ఇజ్రాయెల్ యుద్ధంపై వైఖరి అదేనా..?
కొన్ని దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తే.. ఇంకొన్ని ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ అంశంలో ఇండియా.. తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని తెలిపింది. అయితే, ఈ విషయంలో భారత్ ఎలాంటి ప్రత్యక్ష పాత్ర పోషించడం లేదు.
Israel-Hamas War: అంతర్జాతీయ అంశాల్లో భారత్ ఎప్పుడూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది. తాజాగా అది మరోసారి రుజువైంది. ఇజ్రాయెల్ దాడులతో సతమతమవుతున్న పాలస్తీనాకు భారత్ సాయం అందించింది. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. గాజాలోని హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో కొందరు అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అంశంపై ప్రపంచం భిన్నంగా స్పందిస్తోంది.
కొన్ని దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తే.. ఇంకొన్ని ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ అంశంలో ఇండియా.. తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని తెలిపింది. అయితే, ఈ విషయంలో భారత్ ఎలాంటి ప్రత్యక్ష పాత్ర పోషించడం లేదు. ఇదే సమయంలో యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతున్న పాలస్తీనాకు మానవతా సాయం ప్రకటించింది. పాలస్తీనాలోని యుద్ధ ప్రభావిత ప్రాంతంలో అవసరమైన సామగ్రిని భారత్ పంపించింది. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, సర్జికల్ గూడ్స్, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్స్, టెంట్స్ వంటి అత్యవసర సామగ్రిని పాలస్తీనాకు అందజేసింది. మొత్తం 6.5 టన్నుల సామగ్రిని పంపించింది. యుద్ధం జరుగుతున్నంత కాలం మరింత సాయం అందిస్తామని భారత్ చెప్పింది. నిజానికి అనేక దేశాలు పాలస్తీనాకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. అయితే, అక్కడి రోడ్లన్నీ ధ్వంసం కావడం వల్ల సహాయ సామగ్రి బాధితులకు చేరడం లేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా.. మూడు రోజుల క్రితం ప్రధాని మోదీ, పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనా వాసులకు మోదీ సంతాపం ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో పాలస్తీనాకు సాయం అందిస్తామని మోదీ చెప్పారు. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాదులు దాడులు చేశారు. రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడటమే కాకుండా.. నేరుగా ఇజ్రాయెల్ భూభాగంలోకి వెళ్లి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధం విషయంలో భారత్.. మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతూనే.. పాలస్తీనాకు సాయం అందించి తన వైఖరి తేల్చింది.