Chandrayaan 3: కోట్ల గుండెలు ఉప్పొంగిన వేళ.. చంద్రయాన్‌ 3 సూపర్ సక్సెస్‌..

అఖండ భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. చందమామ గుట్టు తెలుసుకునేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ 3.. అద్భుత విజయం సాధించింది. 140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిల్లిపై అడుగు పెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2023 | 06:53 PMLast Updated on: Aug 23, 2023 | 6:53 PM

India Writes History As First Country Near Moon South Pole

Chandrayaan 3: చందమామ రావే అని పాడుకున్నాం.. చందమామ కథలు విన్నాం.. మనసు మిగిల్చిన ప్రతీ ఫీలింగ్‌కు చందమామ సాక్ష్యంగా ఉండేవాడు ఇన్నాళ్లు. అదే చంద్రుడు ఇప్పుడు భారత మేధస్సుకు, భారత్ గొప్పదనానికి సాక్ష్యంగా నిలిచాడు. చందమామా రావా కాదు.. చందమామా జీ వస్తున్నాం అని ఇస్రో పంపించిన చంద్రయాన్‌ 3 సూపర్ సక్సెస్ అయింది. చంద్రుడి ఉపరితలంపై సేఫ్‌గా ల్యాండ్ అయింది. కోట్ల మంది ఆశలు నేరవేరాయి. కోట్ల కళ్లు ఉద్వేగంతో తడిసిపోయాయి.

అఖండ భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. చందమామ గుట్టు తెలుసుకునేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ 3.. అద్భుత విజయం సాధించింది. 140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిల్లిపై అడుగు పెట్టింది. పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి, ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో కొత్త ఉత్సాహం నింపిన భారత్‌.. ఇప్పుడు చంద్రయాన్‌-3తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ఎవరూ చూడని దక్షిణ జాడల్ని ప్రపంచానికి చూపించనుంది. ఆగస్ట్ 23.. 2003.. చంద్రుడు, భూమి ఉన్నన్నాళ్లు మాట్లాడుకుంటారు. ఇదే రోజు సాయంత్రం ఆరు గంటల 3 నిమిషాలకు చంద్రయాన్‌ ల్యాండర్‌ జాబిల్లిపై దిగ్విజయంగా కాలు మోపింది. భారత సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. 4 సంవత్సరాల క్రితం చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో.. జూలై 14న చంద్రయాన్‌3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో.

ఏపీలోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్‌ MLV3 M4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. 18 రోజుల గ్యాప్‌లో దశలవారీగా 2సార్లు కక్ష్య పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన తర్వాత.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు. ఆ తర్వాత ఆగస్టు 17న వ్యోమనౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ అర్బిట్‌ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు. 23న సాయంత్రం ఆరు గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌.. ల్యాండింగ్‌ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో.. ల్యాండింగ్‌ మాడ్యూల్‌కు ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ కమాండ్‌ పంపించింది. ఈ కమాండ్‌ను అందుకున్న ల్యాండర్‌ మాడ్యూల్‌.. తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ మొదలుపెట్టింది.

చంద్రయాన్-3కి అమర్చిన సాధనాలు, సాంకేతికతతో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపింది. అంతరిక్ష రంగంలో అగ్ర దేశాలుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు కూడా సాధ్యం కాని ప్రక్రియ ఇది. అది. అలాంటి కఠినమైన చోట వ్యోమనౌకను సురక్షితంగా దించి భారత్‌ సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియా నిలిచింది.