Insurance On Railway Ticket: 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రైలు ప్రయాణికులూ.. తెలుసుకోండి!
కేవలం 45 పైసలకే రూ.10 లక్షలు వచ్చే ఈ ప్రమాద భీమా గురించి చాలా మంది పట్టించుకోవడంలేదు. ఏం జరుగుతుందిలే అనే అతి నమ్మకం కొందరిదైతే.. అసలు ఇలాంటి ఓ ఇన్సూరెన్స్ స్కీం ఉందని కూడా తెలియనివాళ్లు ఇంకొందరు.

Insurance On Railway Ticket: ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 300 మంది చనిపోయారు. దీంతో చాలా మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కానీ వీళ్లందరికీ ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా అసరా కానుంది. కేవలం 45 పైసలకే రూ.10 లక్షలు వచ్చే ఈ ప్రమాద భీమా గురించి చాలా మంది పట్టించుకోవడంలేదు. ఏం జరుగుతుందిలే అనే అతి నమ్మకం కొందరిదైతే.. అసలు ఇలాంటి ఓ ఇన్సూరెన్స్ స్కీం ఉందని కూడా తెలియనివాళ్లు ఇంకొందరు.
మీరు రెగ్యులర్‌గా ట్రైన్ ట్రావెల్ చేసే వ్యక్తులైతే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్‌ను బీమా సంస్థ పంపుతుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటేనే బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది. ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రయాణికుడికి ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే జరిగిన నష్టాన్ని బట్టి బీమా అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు చనిపోతే అతని కుటుంబానికి రూ.10 లక్షలు అందుతుంది.
పూర్తిస్థాయి అంగవైకల్యం చెందినా.. బీమా కంపెనీ అతనికి రూ.10 లక్షలు పరిహారంగా ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి రూ.7 లక్షల 5 వేలు, గాయాలైతే రూ.2 లక్షలు ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల్లోపు బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ ఆఫీస్‌కు వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, డాక్యుమెంట్స్ ఇస్తే ఇన్సూరెన్స్ డబ్బు పొందవచ్చు. భారతీయ రైల్వే అందిస్తున్న ఈ ఫెసిలిటీని ఎవరు పెద్దగా పట్టించుకోవడంలేదు. కానీ ఒడిశా లాంటి ఘటనలు జరిగితే ఈ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మృతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది.