Vande Sadharan: త్వరలో వందే సాధారణ్ రైళ్లు.. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు లబ్ధి..!
భారతీయ రైల్వే శాఖ త్వరలోనే వీటిని అందుబాటులోకి తేనుంది. ఈ వారమే వీటి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముంబైలోని వాడి బండర్ యార్డుకు వందే సాధారణ్ రైలు చేరుకుంది.
Vande Sadharan: వందే భారత్ రైళ్ల గురించి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటేనే ప్రయాణించే వీలుంటుంది. అయితే, ఇలా రిజర్వేషన్ చేయించుకోలేని పేద, మధ్య తరగతికి చెందిన సాధారణ ప్రయాణికుల కోసం వందే సాధారణ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ రైల్వే శాఖ త్వరలోనే వీటిని అందుబాటులోకి తేనుంది.
ఈ వారమే వీటి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముంబైలోని వాడి బండర్ యార్డుకు వందే సాధారణ్ రైలు చేరుకుంది. ఈ రైళ్లను తమిళనాడులోని పెరంబూరులో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందించారు. ఈ రైళ్లు అన్నీ ఒకే రకంగా ఉండవు. మూడు రకాలుగా వీటిని తయారు చేయబోతున్నారు. మొత్తంగా 400 వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రైలు ముంబై-ఢిల్లీ మధ్య, రెండో రైలు ఎర్నాకుళం-గౌహతి మధ్య నడుపుతారు. మొదట ఐదు రూట్లలో ఈ రైళ్లను ప్రవేశపెడతారు. ఆ తర్వాత 30 రూట్లలో ఈ రైళ్లను తిప్పుతారు. ప్రస్తుతం ఉన్న రైళ్లకు భిన్నంగా, కొన్ని హంగులతో వందే సాధారణ్ రైళ్లను తయారు చేస్తున్నారు. అలాగని వందే భారత్ రైళ్లలో ఉన్నన్ని అత్యాధునిక సౌకర్యాలుండవు. ఇవి ఎక్స్‌ప్రెస్ రైళ్లు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తాయి. ఒక్కో రైలులో 22 బోగీలు ఉంటాయి.
ఇందులో 8 అన్ రిజర్వుడ్ బోగీలు కాగా.. 12 స్లీపర్ బోగీలు. మిగిలిన రెండూ.. లోకోమోటివ్‌లు. పుష్-పుల్ విధానంలో ఈ రైళ్లు పని చేస్తాయి. ఈ రైళ్లన్నీ నాన్ ఏసీ 3 టైర్ స్లీపర్ రైళ్లు. ముందు భాగం ఏరో డైనమిక్ షేప్‌తో ఉంటుంది. వీటిలో ఆటోమేటిక్ డోర్లు ఉండవు. ఒకేసారి 1,800 మంది వరకు ప్రయాణించే వీలుంటుంది. ఇవి అందుబాటులోకి వస్తే సాధారణ, మధ్య తరగతి ప్రయాణికులకు, నాన్ రిజర్వుడ్ ప్రయాణికులకు మేలు జరుగుతుంది. వందే సాధారణ్ రైళ్లతోపాటు వందే స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ తీసుకురానుంది.