HEALTH ATM: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో హెల్త్ ఏటీఎంలు.. ఏమేం చేస్తాయో తెలుసా ?
హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో ఈ హెల్త్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. ఓ ప్రైవేటు కంపెనీ వీటిని తయారు చేసి.. నగరంలోని ప్రముఖ ఆస్పత్రులకు విక్రయిస్తోంది. ఈ హెల్త్ ఏటీఎంలకు ‘ఎనీ టైం క్లినిక్’ (Any Time Clinic) అని పేరు పెట్టింది.
HEALTH ATM: క్యాష్ కోసం ఏటీఎంలకు వెళ్తుంటాం !! అయితే, ఇకపై ఆరోగ్య పరీక్షల కోసం కూడా ఇక ఏటీఎంలకు వెళ్లొచ్చు! ఔను.. హెల్త్ ఏటీఎంలకు వెళ్లొచ్చు! దేశంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలు మన హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. భాగ్యనగరిలోని పలు ఆసుపత్రుల్లో ఈ హెల్త్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. ఓ ప్రైవేటు కంపెనీ వీటిని తయారు చేసి.. నగరంలోని ప్రముఖ ఆస్పత్రులకు విక్రయిస్తోంది. ఈ హెల్త్ ఏటీఎంలకు ‘ఎనీ టైం క్లినిక్’ (Any Time Clinic) అని పేరు పెట్టింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్, సెన్సర్స్ ద్వారా ఇవి పనిచేస్తాయి. ‘ఎనీ టైం క్లినిక్’లు టచ్‌స్క్రీన్‌తో ఉన్నాయి. వీటి ద్వారా చాలా సులభంగా బీపీ, టెంపరేచర్, ఆక్సిజన్ లెవెల్స్, బీఎంఐ, బీఎంఆర్, ఈసీజీ వంటి 75కుపైగా ఆరోగ్య పరీక్షల వివరాలను కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. ఆ వివరాలతో కూడిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా వెంటనే వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పొందొచ్చు. అవసరమైతే ప్రింటవుట్ తీసుకోవచ్చు. హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో వినియోగిస్తున్న హెల్త్ ఏటీఎంల ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డాక్టర్‌తో టెలీ కన్సల్టింగ్ కూడా..
ప్రస్తుతం మనుషుల జీవనశైలి గాడి తప్పింది. ఈక్రమంలో కనీసం 3 నెలలకు ఒకసారైనా.. హెల్త్ చెకప్స్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో మెడికల్ టెస్టుల కోసం గంటలు, గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. అలా వేచి ఉండి.. శాంపిళ్లు ఇచ్చాక.. రిపోర్టుల కోసం మళ్లీ ఇంకో రోజు వెళ్లాల్సి ఉంటుంది. హెల్త్ ఏటీఎంలతో ఆ ఇక్కట్లు తొలగిపోతాయి. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ హెల్త్ ఏటీఎంలు టెస్టులు చేసి, మెడికల్ రిపోర్టులను ఇచ్చేస్తున్నాయి. ఫలితంగా ప్రజల విలువైన సమయం ఆదా అవుతోంది. హెల్త్ ఏటీఎం ద్వారా డాక్టర్‌తో టెలీకన్సల్టింగ్ సైతం పొందే వెసులుబాటు ఉంది.
రైల్వే స్టేషన్లలో మూడేళ్ల కిందే..
వాస్తవానికి 2019 సంవత్సరం నుంచే దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ‘హెల్త్ ఏటీఎం’లను అందుబాటులోకి తెచ్చారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం వీటిని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎవరైనా ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా 5 నిమిషాల్లోనే హెల్త్ రిపోర్ట్ పొందొచ్చు. పల్స్ రేట్, బ్లడ్ ప్రెజర్, మెటబాలిక్ ఏజ్, బోన్ టెస్ట్ వంటి టెస్టులకు కూడా 10 నుంచి 12 హెల్త్ పారామీటర్స్‌లో రిపోర్ట్ లభిస్తుంది. అయితే ఇందుకోసం రూ.10 నుంచి రూ.50 దాకా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలోని హెల్త్ ఏటీఎం సెంటర్‌లో ఎవరైనా హెల్త్ రిపోర్ట్ పొందాలంటే అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది హెల్ప్ చేస్తారు. పేరు, వయస్సు, మొబైల్ నెంబర్ లాంటి వివరాలను ఎంటర్ చేసి డబ్బులు చెల్లిస్తే చాలు.. 5 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది.