Indo-Pak Love Story: ఈ ప్రేమకథకు ముగింపేది..? పబ్‌జి ప్రియుడి కోసం పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చిన పాక్ మహిళ!

2019లో ఇండియాలోని యూపీకి చెందిన సచిన్ మీనా అనే వ్యక్తికి, పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన సీమా గులామ్‌కు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే, అప్పటికే సీమాకు పెళ్లైంది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 9, 2023 | 01:49 PMLast Updated on: Jul 09, 2023 | 1:49 PM

Indo Pak Love Story Pak Woman Who Fell In Love With Up Man On Pubg

Indo-Pak Love Story: ప్రేమించిన వారి కోసం యువతీయువకులు సరిహద్దులు దాటిరావడం మామూలే. అయితే, పెళ్లై, పిల్లలు కూడా ఉన్న ఒక మహిళ.. తన ప్రేమకోసం దేశం దాటడమే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అదీ.. పాక్ మహిళ.. తన ప్రియడి కోసం ఇండియాకు వచ్చింది. పాక్ నుంచి వచ్చిన మహిళతోపాటు, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన భారతీయ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ మహిళ ఇండియాకు రావడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి?
ఆన్‌లైన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితోనైనా కనెక్ట్ కావొచ్చు. పబ్‌జి గేమ్ ద్వారా కూడా ఎవరితోనైనా పరిచయం పెరగొచ్చు. అలా 2019లో ఇండియాలోని యూపీకి చెందిన సచిన్ మీనా అనే వ్యక్తికి, పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన సీమా గులామ్‌కు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే, అప్పటికే సీమాకు పెళ్లైంది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. సీమా వయసు 30 ఏళ్లకుపైగా ఉండగా, సచిన్ వయసు 25 ఏళ్లే. ఇద్దరి దేశాలు వేరు.. వయసులోనూ చాలా తేడా.. ఆమెకు పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. అయినా.. ఇవేవీ వారి ప్రేమకు అడ్డుకాలేవు. కొంతకాలం ఆన్‌లైన్ ద్వారా ప్రేమించుకున్న ఇద్దరూ మూడేళ్ల తర్వాత కలుసుకోవాలనుకున్నారు. అలా ఇద్దరూ ఈ ఏడాది మార్చిలో తొలిసారి నేపాల్‌లో కలుసుకున్నారు. మొదట సీమా కరాచీ నుంచి దుబాయ్ చేరుకుంది. అక్కడి నుంచి నేపాల్ వచ్చింది. అక్కడే ఇద్దరూ కలుసుకుని, పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత సీమా పాక్‌కు, సచిన్ ఇండియాకు చేరుకున్నారు. పాక్‌కు వెళ్లిన సీమా శాశ్వతంగా ఇండియా వచ్చి, సచిన్‌తోనే ఉండాలని నిర్ణయించుకుంది.
ఇల్లు అమ్మేసి మరీ..
పిల్లలతో కలిసి ఇండియా రావాలని నిర్ణయించుకున్న సీమా.. ఇందుకోసం పాక్‌కు వెళ్లిన తర్వాత తనకున్న ఇంటిని అమ్మేసింది. ఆ డబ్బుతో ఇండియా వచ్చేందుకు ప్లాన్ చేసింది. తనతోపాటు పిల్లలకు నేపాల్ వీసా, టిక్కెట్లు తీసుకుంది. పాక్ నుంచి దుబాయ్ చేరుకుని, అక్కడి నుంచి నేపాల్ వచ్చింది. నేపాల్‌లో కొద్ది రోజులు ఉన్న తర్వాత అక్కడి నుంచి బస్సులో గత మే 13న ఇండియా వచ్చింది. ఇండియా వచ్చిన తర్వాత గ్రేటర్ నోయిడాలో సచిన్ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడే ఉంచారు. ఈ విషయంలో ఇంటి ఓనర్‌కు అనుమానం రావడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. అనుమతి లేకుండా దేశంలో అక్రమంగా ఉంటున్నందుకు సీమాపై, ఆమెకు ఆశ్రయం ఇచ్చి సహకరించినందుకు సచిన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇండియాలోనే ఉంటానంటున్న సీమా
సీమా అరెస్టైన విషయం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఆమె భర్తకు కూడా ఈ విషయం చేరింది. దీంతో తన భార్యను పాకిస్తాన్‌ పంపాల్సిందిగా ఆమె భర్త గులామ్ హైదర్ ఏకంగా ప్రధాని మోదీని కోరారు. అయితే, సీమ మాత్రం పాక్ వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ వెళ్లబోనని చెబుతోంది. తన భర్త నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నాడని, తనను హింసించే వాడని, అతడికి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నానని సీమా చెప్పింది. తాను ఇప్పుడు భారతీయురాలిగా మారిపోయానని, సచిన్ తన పిల్లలను దత్తత తీసుకుంటాడని ఆమె చెప్పారు. పాక్ వెళ్తే తనను చంపేస్తారని, ఇండియాలోనే ఉంటానన్నారు. అందుకు కావాల్సిన చట్టపరమైన ప్రక్రియల కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు సీమను కలుసుకునేందుకు అనుమతివ్వాలని పాక్ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. పాక్ అధికారులు ఆమెను కలిసిన తర్వాత ఈ విషయంలో ఒక స్పష్టత రావొచ్చు. సచిన్‌ను ఆమె పెళ్లి చేసుకున్న నేపథ్యంలో సీమాను అక్కడికి పంపాలా.. ఇక్కడే ఉంచాలా అనే విషయంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణ‍యం తీసుకునే అవకాశం ఉంది. న్యాయప్రక్రియను అనుసరించి సీమా-సచిన్ విషయంలో తదుపరి నిర్ణయం ఉంటుంది. సచిన్-సీమా ప్రేమకథ ఇక్కడే కొనసాగుతుందా..? తిరిగి పాక్‌కు చేరుతుందా అనేది కొద్దిరోజుల్లో తేలుతుంది.