Gold Demand: బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. ధరలకు మళ్లీ రెక్కలు
సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో.. ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో రానున్న రోజుల్లో పసిడి విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. ఈ మధ్య తగ్గినట్లే తగ్గిన పసిడి ధర… మళ్లీ పైకెగసింది. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో.. సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ధరలు పెరిగాయి. దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఒక్కరోజే ఏకంగా 970 రూపాయలు పెరిగి.. 56వేల 550కి చేరింది. వెండి కిలో సైతం 16వందలు పెరిగి.. 63వేల 820కి పెరిగింది.
అంతర్జాతీయంగా ధరలు పెరగడమే బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అమెరికా డాలర్ విలువ పతనం అవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి ఓ వైపు ఫెడ్ రేట్ల పెంపు చేపడుతున్నా యూఎస్ ఎకమిక్ డేటా పాజిటివ్‌గా రావడం, అమెరికాలో రెండు బ్యాంకులు దివాలా తీయడం వంటి పరిణామాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయ్. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో.. ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో రానున్న రోజుల్లో పసిడి విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.