Israel-Palestine Crisis: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ల దాడి.. యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్..
పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్ కూడా ధీటుగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది.
Israel-Palestine Crisis: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్ కూడా ధీటుగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. ఇజ్రాయెల్ యుద్ధం (స్టేట్ ఆఫ్ వార్) ప్రకటించింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా ఉన్న శతృత్వం గురించి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఎప్పుడూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే ఉంటాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై పాలస్తీనా దాడికి పాల్పడింది. గాజా నుంచి ఇరవై నిమిషాల వ్యవధిలో ఐదు వేల రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌లో పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు హమాస్ మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడ్డారు. గాజా స్ట్రిప్ లో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు సరిహద్దుగుండా ఇజ్రాయెల్‌లోకి చొరబడి, అక్కడి పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. పలువురు మహిళలు, పిల్లల్ని తమ అధీనంలోకి తీసుకుని లాక్కుంటూ వెళ్తున్న దృశ్యాలకు చెందిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇజ్రాయెల్ మహిళా సైనికురాలిని నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో కూడా సంచలనంగా మారింది. ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డ తీవ్రవాదులు.. అక్కడి పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రాంతంలో మహిళా సైనికుల్ని, పిల్లల్ని హమాస్ తీవ్రవాదులు అధీనంలోకి తీసుకున్నారు. ఇజ్రాయిల్ పై మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ ప్రకటించారు. ఈ దాడులతో వెంటనే ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దులతోపాటు, దేశమంతా హై అలర్ట్ ప్రకటించింది. గాజాపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకి రావొద్దని సైన్యం హెచ్చరించింది.
ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ ప్రారంభించిన ఇజ్రాయెల్
గాజా దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. హమాస్ తీవ్రవాద స్థావరాలపై దాడులకు దిగుతోంది. రాకెట్ లాంచర్లను అడ్డుకునే.. యాంటీ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసింది. ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అనే మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇది మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ అని ప్రకటించింది. అయితే, సరిహద్దులోని చాలా ప్రాంతం హమాస్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లింది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్ పౌరుల్లో ఆందోళన నెలకొంది. గాజా వైపు నుంచి ఎలాంటి హెచ్చరికా లేకుండానే దాడులు జరగడంతోనే ఇజ్రాయెల్ ఈ స్థాయిలో నష్టపోయింది. అయినా, పాలస్తీనాను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 22 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయంలో అనేక దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి.