Kaleshwaram Project: ప్రమాదపు అంచున కాళేశ్వరం..? డ్యాం సేఫ్టీ కమిటీ నివేదికలో సంచలన నిజాలు..

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ బ్రిడ్జ్‌ కుంగడంతో.. నేషనల్‌ డ్యాం సేఫ్టి అధికారులు లోపాలను పరిశీలించేందుకు తెలంగాణకు వచ్చారు. పిల్లర్స్‌ కుంగడానికి అసలు కారణం చెప్తూనే తమ రిపోర్ట్‌లో మరిన్ని షాకింగ్‌ విషయాలు చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2023 | 02:40 PMLast Updated on: Nov 04, 2023 | 2:47 PM

Kaleshwaram Project Is In Denger What Is In Ndsa Report

Kaleshwaram Project: కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ (Kaleshwaram Project) ప్రమాదపు అంచున ఉందా..? రీడిజైన్‌ వల్ల భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చిందా..? ప్రతిపక్షాలు వారిస్తున్నట్టు రూ.80 వేల కోట్లు గోదారిలో పోసినట్టేనా..? నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్‌ చూస్తుంటే ఇవన్నీ నిజాలే అనిపిస్తున్నాయి. సింపుల్‌గా తీసుకునేందుకు ఇదేం చిన్న విషయం కాదు. ప్రత్యేక తెలంగాణ (telangana) సాకారమైందే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనే నినాదంపై. అలాంటి తెలంగాణలో రూ.80 వేల కోట్లకు పైగా ప్రజాధనంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మించి.. నీళ్లను బీళ్లకు మల్లించి.. ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఈ భారీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో వరుసగా లోపాలు బయటపడుతూ ఉండటం.. ఇప్పుడు తెలంగాణ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది.

REVANTH REDDY: కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది.. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లు దోపిడీ: రేవంత్ రెడ్డి

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ (MEDIGADDA BARRAGE) బ్రిడ్జ్‌ కుంగడంతో.. నేషనల్‌ డ్యాం సేఫ్టి అధికారులు లోపాలను పరిశీలించేందుకు తెలంగాణకు వచ్చారు. పిల్లర్స్‌ కుంగడానికి అసలు కారణం చెప్తూనే తమ రిపోర్ట్‌లో మరిన్ని షాకింగ్‌ విషయాలు చెప్పారు. కేవలం మేడిగడ్డకే కాదు.. ఇదే ప్రాజెక్ట్‌లో ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లకు కూడా ఇదే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. మేడిగడ్డలో పిల్లర్స్‌ కుంగిపోడానికి ఇసుక కొట్టుకుపోవడం మాత్రమే కారణం కాదు. ప్రాజెక్ట్‌ డిజైన్‌ ఒకలా ఉంటే నిర్మాణం మరోలా జరిగింది. బేస్‌మెంట్‌ నిర్మాణంలో వాడిన మెటీరియల్‌ కూడా లో క్వాలిటీగా ఉంది. నిర్వహణ కూడా సరిగ్గా లేదు. మేడిగడ్డ విషయంలో అధికారులు చెప్పింది ఇదే. మేడిగడ్డను ఎలా నిర్మించాలో అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లను కూడా అలాగే నిర్మించారు. ఇప్పటికే అన్నారం బ్యారేజ్‌లో రెండు ప్రాంతాల్లో వాటర్‌ లీక్‌ అవుతోంది.

సుందిళ్ల నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి కంప్లైట్‌ లేదు. కానీ వీటి విషయంలో ముందు జాగ్రత్త తీసుకోకపోతే.. ఈ రెండు ప్రాజెక్ట్‌లు కూడా ప్రమాదానికి గురయ్యే ఛాన్స్‌ ఉంది అంటున్నారు అధికారులు. మేడిగడ్డకు ఇప్పటికే చాలా డ్యామేజ్‌ జరిగింది. ఇప్పుడు ఆ పిల్లర్స్‌ను మళ్లీ సెట్‌ చేయాలి అంటే.. ప్రాజెక్ట్‌లో నీటి ప్రవాహాన్ని ఆపాలి. నిజానికి ఇది చాలా పెద్ద టాస్క్‌. ఇదే సమస్య ముందు ఉన్న రెండు బ్యారేజిల్లో కూడా జరిగితే.. ఆ సీన్‌ ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది. తెలంగాణ మరో 5 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఈ ప్రమాదం జరగకముందే.. ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. మరి తెలంగాణ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుందా.. లేక ఇది కూడా ప్రతిపక్షాల కుట్రే అంటూ కొట్టిపారేస్తుందా చూడాలి.