Shakti Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. బెంగళూరులో ఆటోవాలాల కన్నీళ్లు..

శక్తి స్కీం వల్ల అత్యధికంగా నష్టపోతోంది ఆటోవాలాలే. ప్రస్తుతం బెంగళూరులో చాలా మంది ఆటో డ్రైవర్లకు ఆదాయం తగ్గిపోయింది. కొంతమంది కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడా డబ్బులు కూడా సంపాదించుకోవడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 28, 2023 | 03:46 PMLast Updated on: Jun 28, 2023 | 3:46 PM

Karnatakas Free Bus Travel Scheme For Women Makes Autowalas Job Less

Shakti Scheme: ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాల వల్ల మంచి జరుగుతుంది అనే మాట వాస్తవమే అయినప్పటికీ.. కొన్నిసార్లు చెడు ప్రభావం కూడా ఉంటుంది. ఈ పథకాల వల్ల కొందరు బాగుపడితే.. ఇంకొందరు నష్టపోతారు. ఒక వర్గానికి మంచి జరిగితే.. ఇంకో వర్గానికి హాని జరుగుతుంది. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పథకం అలాంటి భిన్న ఫలితాల్ని అందిస్తోంది.
మహిళల హర్షం
కర్ణాటకలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం శక్తి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ ఉచిత ప్రయాణం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే కల్పించారు. లగ్జరీ, ప్రీమియమ్ సర్వీసుల్లో ఎప్పటిలాగే ఛార్జీలు చెల్లించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం శక్తి పథకాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోంది. దీంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధ మహిళలు, కూలీలు, పేద మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రయాణం చేయాలంటే డబ్బులకు ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు డబ్బులు లేకుండానే ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణించగలుగుతున్నామని మహిళలు అంటున్నారు. గతంలో టిక్కెట్ డబ్బుల కోసం తమ పిల్లల దగ్గర చేయి చాచాల్సి వచ్చేదని, ఇప్పుడా అవసరం లేదని వృద్ధ మహిళలు ఆనందపడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
వివాదాలు
ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో గతంలోకంటే ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సు టిక్కెట్ల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది. బస్సుల్లో మహిళల రద్దీ పెరిగింది. గతంలో అవసరమైనప్పుడు మాత్రమే బస్సులో ప్రయాణించే వాళ్లు ఇప్పుడు ప్రతి చిన్న అవసరానికి బస్సులో ప్రయాణిస్తున్నారు. మరోవైపు ఇంతకుముందు షేర్ ఆటోలు, హైర్ ఆటోలు, టూ వీలర్ ట్యాక్స్ ఉపయోగించుకునే వాళ్లు ఇప్పుడు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ కారణంగా బస్సుల్లో మహిళలు నిత్యం గొడవలు పడుతున్నారు. సీట్ల కోసం కొట్టుకుంటున్నారు.
ఆటోలకు గిరాకీ నిల్
శక్తి స్కీం వల్ల అత్యధికంగా నష్టపోతోంది ఆటోవాలాలే. బెంగళూరు నగరంలో గతంలో ఆటోవాలాలకు మంచి డిమాండ్ ఉండేది. ఆఫీసులు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లే మహిళలు బస్సులు రావడం ఆలస్యమైనా, తొందరగా వెళ్లాల్సొచ్చినా ఆటోలను ఆశ్రయించేవాళ్లు. దీంతో ఆటోవాలాలకు మంచి గిరాకీ ఉండేది. ఉపాధి దొరికేది. ఇప్పుడు బస్సుల్లోనే ఉచితంగా ప్రయాణించే వీలుండటంతో మహిళలు ఆటోల్లో ఎక్కడం లేదు. తప్పనిసరైతేనే ఆటోలు ఎక్కుతున్నారు. ఫలితంగా ప్యాసింజర్లు లేక ఆటోవాలాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి ఆటోలు అక్కడే ఖాళీగా ఉండిపోవాల్సిన పరిస్థితి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కనబడినా రూ.40 కూడా రావడం లేదని ఒక డ్రైవర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోవాలాలు, బైక్ ట్యాక్సీ నడిపే వాళ్లకు చాలా వరకు గిరాకీ తగ్గింది. శక్తి పథకం వల్ల మహిళలకు లబ్ధి కలిగితే, ఆటోల్నే నమ్ముకున్న వాళ్ల ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
ఆటోవాలాలపై భిన్న స్పందన
ప్రస్తుతం బెంగళూరులో చాలా మంది ఆటో డ్రైవర్లకు ఆదాయం తగ్గిపోయింది. కొంతమంది కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడా డబ్బులు కూడా సంపాదించుకోవడం లేదు. దీంతో ఆటోల్నే నమ్ముకుని మనుగడ సాగిస్తున్న ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు. ఆటోవాలాలు ఎదుర్కొంటున్న పరిస్థితిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు వీరిపై జాలి చూపిస్తుంటే.. ఇంకొందరు అస్సలు సానుభూతి చూపడం లేదు. కారణం.. ఆటోవాలాలు గతంలో ప్రయాణికుల నుంచి అడ్డదిడ్డంగా డబ్బులు వసూలు చేయడమే. నిబంధనల ప్రకారం వాడాల్సిన మీటర్లను చాలా మంది ఆటోడ్రైవర్లు వాడరు. ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. అందులోనూ పీక్స్ టైమ్‌లో, రాత్రిపూట అయితే ఈ చార్జీలు మరింత ఎక్కువగా ఉంటాయి. తక్కువ దూరానికైనా సరే.. అధికంగా చార్జీలు వసూలు చేస్తారు. సరిగ్గా చెప్పాలంటే ప్రయాణికుల నుంచి దోపిడీ చేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు అడిగినంత ఇచ్చి గమ్యస్థానానికి చేరుకుంటారు. అలా ఆటోవాలాల మోసానికి గురైన ప్రయాణికులు ఎందరో. అలాంటివాళ్లంతా ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి తగిన శాస్తి జరిగిందంటున్నారు. ఆటోవాలాల దోపిడీకి ఇకనైనా తెరపడుతుందని ఆశిస్తున్నారు. ఆటోడ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నా చాలా మంది కనీసం సానుభూతి చూపడం లేదు. కొందరు మాత్రం వారి పరిస్థితికి బాధపడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సూచిస్తున్నారు.