Kedarnath Temple: అది బంగారు తొడుగు కాదు.. ఇత్తడి.. కేదార్‌నాథ్ ఆలయంపై గోల్డ్ స్కాం ఆరోపణలు
ఉత్తరాఖండ్, కేదార్‌నాథ్ ధామ్‌లోని గర్భాలయంలో బంగారు తొడుగును ఏర్పాటు చేశారు. అయితే, ఆ తొడుగును కొందరు భక్తులు పరీక్షించి చూడగా.. దానిపై బంగారు పూత రాలిపోతోంది. దీంతో ఈ విషయంలో రూ.125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది ఆరోపించారు.
Kedarnath Temple: పవిత్ర కేదార్‌నాథ్ దేవాలయానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై దేవస్థాన నిర్వహణా కమిటీ స్పందించింది. ఈ ప్రచారం వెనుక కుట్ర దాగి ఉందని, కొందరి రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆలయ కమిటీ ఆరోపించింది. ఉత్తరాఖండ్, కేదార్‌నాథ్ ధామ్‌లోని గర్భాలయంలో బంగారు తొడుగును ఏర్పాటు చేశారు.
అయితే, ఆ తొడుగును కొందరు భక్తులు పరీక్షించి చూడగా.. దానిపై బంగారు పూత రాలిపోతోంది. దీంతో ఈ విషయంలో రూ.125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది ఆరోపించారు. కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. గోడలపై ఉన్న బంగారు పూతను కొందరు పరీక్షించి చూడగా, ఆ పూత రాలిపోతోంది. లోపల అంతా ఇత్తడే ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బంగారం పూత పేరుతో ఇత్తడి పూత ఏర్పాటు చేసి, రూ.125 కోట్ల స్కాంకు పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ అంశంపై శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) స్పందించింది.
ఈ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ మాట్లాడుతూ ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. మోదీ నాయకత్వంలో కేదార్‌నాథ్ అభివృద్ధి పనులు నిరాటంకంగా సాగుతున్నాయన్నారు. కొన్నేళ్లుగా వసతుల కల్పనతో భక్తుల రాక పెరిగిందని, దీంతో కొందరు దేవాలయం విషయంలో కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఈ పనిచేస్తున్నారని ఆరోపించారు. అజేంద్రతోపాటు ఆలయ కమిటీ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యాపారవేత్త కేదార్‌నాథ్ ఆలయానికి 230 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. దీంతో ఆలయం లోపల బంగారు తొడుగు ఏర్పాటు చేశారు. ఆయన గుప్తదానానికి ముందుకు రావడం వల్ల పేరు వెల్లడించలేమన్నారు.
దాత తనకు తెలిసిన స్వర్ణకారుడి సమక్షంలో ఈ పని చేయించినట్లు చెప్పారు. బంగారు తాపడం పనులను దాతతోపాటు భారత పురాతత్వశాఖ పర్యవేక్షించిందని, ఈ విషయంలో ఆలయ కమిటీ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. పనులు పూర్తి చేసిన తర్వాత దీనికి సంబంధించిన బిల్లులు, వోచర్లను ఆలయానికి అందజేసినట్లు, వాటిని రికార్డుల్లో నమోదు చేసినట్లు కమిటీ తెలిపింది. ఈ ఆలయానికి బంగారం దానం చేసిన దాతే.. 2005లో శ్రీ బద్రీనాథ్ ఆలయానికి కూడా బంగారు తాపడం చేయించినట్లు తెలుస్తోంది.