Blind Belief: కన్నబిడ్డల కడుపుల్ని ఆకలితో మాడ్చిమాడ్చి చంపారు! ఇదేం పిచ్చి?
గుడ్డి నమ్మకాలు ఎంతటి విషాదాలను నింపుతాయో కెన్యా ఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆకలితో చస్తే దేవుడి దగ్గరికి వెళ్లొచ్చన్న ఆ పాస్టర్ మాటలు విని 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం! ఈ ఘటనపై రోజులు గడిచేకొద్దీ విస్తూపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
పిల్లలు ఒక్కపూట తినకపోతేనే అల్లాడిపోతారు. ‘అమ్మా అమ్మా’ ఏమైనా పెట్టు అంటూ ఏడుస్తారు. ఆకలి బాధలను వయసులో ఉన్నవాళ్లే తట్టుకోలేరు..ఇంకా చిన్నారుల బాధను వర్ణించడానికి మాటలు కూడా ఉండవు. అందుకే ఆకలికి కులం,మతం, ఉన్నోడు, లేనోడు అన్న బేధాలు ఉండవంటారు. మరి అదే ఆకలికి మతం రంగు పూస్తే..? ఆకలితో చనిపోతే దేవుడు కనిపిస్తాడని చెబితే..? ప్రజలు గుడ్డిగా అదే నమ్మితే ఏమవుతుంది..? కెన్యా కన్నీటీ గాథ అవుతుంది! చరిత్రలో మరిచిపోలేని.. గుండెల్ని పిండేసే పెను విషాదమవుతుంది. కెన్యా పాస్టర్ పైశాచికానికి అక్కడి ప్రజల గుడ్డి నమ్మకం తోడై 201మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అందులో చిన్నారులు కూడా ఉండడం తీవ్రంగా కలిచివేస్తోంది.
ఆకలితో చచ్చిపోమన్నాడు.. వాళ్లూ అదే చేశారు:
ఆకలి బాధను తీర్చుకునేందుకై సాక్ష్యత్తు పరమశివుడే కపాల భిక్షాపాత్రను పట్టుకుని యాచించాడు కదా.. మరి మనుషులు ఎలా ఆకలి బాధను ఎలా తట్టుకోగలరు? చిన్నారులు ఎలా భరించగలరు..? పుట్టిన క్షణం నుంచే ఆకలికి ఆగలేని మనిషులు దేవుడు కోసం తిండీ తిప్పా మానేసి చచ్చిపోయారంటే నమ్మగలరా? దేవుడుపై భక్తి ఉండొచ్చు.. ప్రేమ కూడా ఉండొచ్చు కానీ.. పిచ్చి ఉంటే.. ఆ పిచ్చి మనతో పాటు మనం కని పెంచిన చిన్నపిల్లల ప్రాణాలను కూడా బలిగొంటే..? ఆకలితో మరణిస్తే జీసెస్ కరుణిస్తాడా..? చెప్పిన పాస్టర్‌కి బుద్ధి లేదు సరే.. మరి నమ్మిన అనుచరుల మాటేంటి?
ఆకలితో చస్తే దేవుడి దగ్గరికి వెళ్లొచ్చు:
చచ్చేంత వరకు ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నారు.. తమతో పాటు తమ పిల్లలను కూడా ఆకలితో అలమటించేలా చేశారు. రోజులు గడుస్తున్న కొద్ది ఆహారం తినకపోవడంతో వారిలో 201 ప్రాణాలు కోల్పోయారు. వీళ్లందరిని ఆ ప్రాంతంలోనే సామూహిక ఖననాలు చేశారు. ఆ ప్రాంతం నుంచి దాదాపుగా 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు చేయగా విస్తూపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. చాలా మంది ఆహారం తినక, గొంతు పిసికినట్లు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా కనపించకపోవడం అధికారులకు అనేక అనుమానాలకు తావిస్తోంది.
డేంజర్‌లో మరో 600మంది:
దక్షిణ కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతమైన కిలిఫీలో 800 ఎకరాల్లో ఉన్న ప్రాపర్టీలో పాల్ మెకంజీ అనే పాస్టర్ 2019 నుంచి నివాసముంటున్నాడు. అక్కడే ఇంటర్నేషనల్ చర్చి ఆప్ ది గుడ్ న్యూస్ అనే చర్చిని నడుపుతున్నాడు. తన చర్చికి వచ్చేవారికి మూఢభక్తిని నూరి పోశాడు. ఇలా దేవుడిపై పిచ్చి పెంచడం… దేవుడు కోసమే ప్రజలు బతకాలని నూరిపోయడం మనదేశంలోని చర్చిల్లోనూ చాలా మంది పాస్టర్లు చేసేదే.! అయితే మూఢాచారాలను ఎక్కువగా పాటించే కెన్యా ప్రజలకు ఆ పాస్టర్ చెప్పింది నిజంలా అనిపించింది. పూర్తిగా ఆ పాస్టర్ మాయలో పడిపోయిన ప్రజలు అతను చెప్పింది చెప్పినట్లే చేశారు. చచ్చిపోయేవరకు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. రోజులు గడుస్తున్నా.. నోరు ఎండిపోతున్నా..చుక్క మంచినీరైనా గొంతులోకి వెళ్లకపోవడంతో201మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది కనీసం నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. పాస్టర్ మెకంజీ భార్యతో పాటు 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతను చెప్పే సమాధానాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ముందు చిన్నారులు ఆకలితో చనిపోవాలని.. తర్వాత మహిళలు ఉపవాసంతో మరణించాలని పాస్టర్ అక్కడి ప్రజలకు చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. భక్తి మూఢభక్తిగా మారితే ఏం అవుతుందో కెన్యా ఘటన క్లియర్‌కట్‌గా చూపిస్తోంది.