Kerala: గాడ్స్ ఓన్ కంట్రీ.. కేరళ కాదు.. కేరళం..!
కేరళను కేరళం మార్చాలని కోరుతూ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి కూడా దీన్ని స్వాగతించింది.
Kerala: ప్రకృతి అందాలకు నెలవైన కేరళ త్వరలో పేరు మార్చుకోబోతోంది. కేరళను కేరళం అని మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేరళ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని బుధవారం ఆమోదించారు. కేరళను కేరళం మార్చాలని కోరుతూ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి కూడా దీన్ని స్వాగతించింది. ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానాన్ని ఆమోదించి, కేంద్రానికి పంపింది. కేరళను కేరళంగా మార్చుతూ, ఎనిమిదో షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ, రాజ్యాంగాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ఇంత సడెన్‌గా పేరు మార్పు ఎందుకు..?
వాస్తవానికి మలయాళంలో కేరళను కేరళం అనే పిలుస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజలు మాట్లాడుతున్న భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. తొలి భాషా ప్రయోక్త రాష్ట్రంగా నాటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న కేరళను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేరళలో ఉన్న అనేక ప్రాంతాలు ఆ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ట్రావెన్‌కోర్-కొచ్చిన్ సంస్థానంలతో పాటు మలబార్ ప్రాంతం పరిధిలో ఉండేవి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దక్షిణాదిన ఉన్న కాసర్‌గోడ్ ప్రాంతాన్ని కూడా కలిపి కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మలయాళం మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్ర పరిధిలో ఉండాలన్న స్వాతంత్రోద్యమ కాలం నాటి డిమాండ్ ఆధారంగా కేరళను ఏర్పాటు చేశారు. అయితే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో ఈ రాష్ట్రం పేరును కేరళగా రాశారు. మలయాళీలు కోరుకున్నది మాత్రం కేరళం అని ఉండాలి. మలయాళీలు కేరళం అని పిలుచుకున్నా.. ఇంగ్లీష్ సహా ఇతర భాషల్లో ఈ రాష్ట్రాన్ని ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు కేరళగానే చెబుతున్నారు. అందుకే దేశ వ్యాప్తంగా అధికారికంగా ఏభాషలో ప్రస్తావించినా కేరళం అనే ఉండాలని ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి.
రాష్ట్రం పేరును ఎలా మార్చుతారు..?
దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా.. రాష్ట్రానికున్న సరిహద్దులు మార్చాలన్నా.. తగ్గించాలన్నా.. పెంచాలన్నా.. చివరకు రాష్ట్రం పేరు మార్చాలన్నా ఆ అధికారాన్ని పార్లమెంట్‌కు కట్టపెట్టింది రాజ్యాంగం. ఆర్టికల్ మూడులో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేరళను కేరళంగా మార్చాలంటే పార్లమెంట్ మాత్రమే ఆ పని చేయగలదు. కేరళ అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని పరిశీలించి.. కేరళం పేరును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. పార్లమెంట్ చట్టం ద్వారా ఆ పని చేయవచ్చు. పార్లమెంట్ ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కేరళ.. కేరళంగా మారిపోతుంది. ఇక దేశంలో అధికారిక భాషల ప్రస్తావన రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉంది. ఇందులో కూడా కేరళ భాషను కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
కేరళ విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తుందా..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికే పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. రాజకీయంగా ఎలాంటి ప్రయోజం లేకపోతే కేంద్రంలోని బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకోదు. కేరళ విషయంలోనూ ఇదే జరగొచ్చు. పార్టీలకతీతంగా కేరళకు చెందిన అన్ని వర్గాలు కేరళంగా మార్చాలని తీర్మానాన్ని ఆమోదించి పంపడంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.