Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్.. జ్ఞాపకాలను ప్రపంచానికి చూపించే ప్రయత్నం..!
నేటి తరంలో ఎటు చూసినా క్యూ ఆర్ కోడ్ శకమే నడుస్తుంది. నగదు బదిలీల నుంచి వస్తువు కొనుగోలు వరకూ అన్నింటా ఈ గజిబిజి గడుల లోగో కనిపిస్తుంది. దీనిని స్కాన్ చేస్తే చాలు సమస్తం మన చేతిలోకి వచ్చేస్తుంది. అలాంటి సాంకేతికతను ఒకరు సమాధిపై కూడా ప్రయోగించారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఎవరు ఇతను, ఎందుకు ఇలా చేశాడు అనే అనుమానంతో పాటూ ఇలా కూడా చేయవచ్చా అనే సందేహం మీ అందరిలో కలుగవచ్చు. అంతేకాకుండా ఇలా చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి.. అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
కేరళ రాష్ట్రంలోని తిర్సూర్ జిల్లాలో ఉండే కురియాచిరా ప్రాంతంలో ఈ వింత చోటు చేసుకుంది. చర్చి దగ్గరలో ఉండే స్మశానంలో క్యూ ఆర్ కోడ్ తో ఒక సమాధి దర్శనం ఇస్తుంది. ప్రతి వారానికో, నెలకో ఈ సమాధుల వద్దకు వచ్చి చనిపోయిన కుటుంబీకుల సమాధిని చూసి స్మరించుకొని వెళ్లిపోతారు వారి వారి బంధువులు. అలా వెళ్లే క్రమంలో క్యూ ఆర్ కోడ్ ను మలచబడి ఉన్న ఒక సమాధి మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే ఇక్కడి ప్రత్యేకత. అసలు ఈ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏమౌతుంది. డబ్బులు వస్తాయా.. లేక మనం ఏదైనా సంస్థకు విరాళంగా చెల్లించాలా అనే వింత అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసి నివ్వెరపోయేలా చేస్తుంది ఆ స్కానర్.
ఈ క్యూఆర్ కోడ్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఐవిన్ ఫ్రాన్సిస్ గురించి తెలుసుకోవాలి. ఇతను పేరొందిన డాక్టర్ ఫ్రాన్సిస్ కుమారుడు. తండ్రి ప్రేరణతో ఐవిన్ కూడా ఎంబీబీఎస్ చేశాడు. టాప్ క్లాస్ లో వైద్య పట్టాను పొందాడు. పైగా ఆటలు అంటే ఇష్టం. రోజులో ఏదో ఒక ఆట ఆడుతూ ఉండేవాడు. పైగా బ్యాట్మింటన్ క్రీడాకారుడు కూడా. ఎన్ని అవాంతరాలు వచ్చినా బ్యాట్మింటన్ ఆడటం మాత్రం వదిలేవాడు కాదు ఐవిన్. అదే ఇతని క్రీడా ఆసక్తికి నిదర్శనం. అలా ఒకరోజు ఈ ఆట ఆడుతూ షెటిల్ కోర్టులోనే ఉన్నపళంగా క్రింద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పుటికీ స్పృహలోకి రాలేదు. చివరకు డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. దీంతో అతని తల్లిదండ్రులకు తీవ్ర విషాద ఛాయలు అల్లుకున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు తండ్రి ఫ్రాన్సిస్.
అలా కొంత కాలం సాగిన తరువాత ఐవిన్ ఫ్రాన్సిస్ తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. భౌతికంగా తన కుమారుడు ఇక్కడ లేడు. కానీ అందరికీ నా కొడుకు గురించి తెలియజేయాలని దృఢంగా సంకల్పించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలోకి పెట్టాడు. అదే ఈ క్యూ ఆర్ కోడ్ సృజనాత్మక ఆలోచన. తన కొడుకు ఐవిన్ ఫ్రాన్సిస్ ఎంత గొప్ప క్రీడాకారుడో, ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించాడో.. అతని ప్రతిభా పాఠవాలను అందరికీ కనిపించేలా చేయాలనుకున్నాడు. అందుకే తనయునికి సంబంధించిన డిగ్రీలు, ప్రశంసాపత్రాలు, సాధించిన విజయాలు, గెలుచుకున్న పథకాలు, అతని ఫోటోలు, కుమారుని ప్రెండ్స్ వివరాలు అన్నింటినీ ఒక వెబ్ సైట్లో భద్రపరిచి ఆసైట్ లింకును క్యూఆర్ కోడ్ కు అనుసంధానం చేశాడు. ఈ క్యూఆర్ కోడ్ ను ఐవిన్ ఫ్రాన్సిస్ ను పూడ్చిపెట్టిన సమాధి శిలపై కనిపించేలా చెక్కించాడు. ఇక చెప్పేదేముంది. వాటిని గూగుల్ ఇంజన్ కెమెరా లెన్స్ సహాయంతో స్కాన్ చేస్తే ఈ వివరాలు అన్ని కనిపిస్తాయి.
చిన్న వయసులో చేతికి అందివచ్చిన కుమారుడు కుప్పకూలిపోతే ఎలా ఉంటుందో ఆ కుటుంబంలోని వారికే తెలుస్తుంది. పైగా ప్రతిభ కలిగిన పిల్లవాడు చేజారిపోతే ఆ శోకం వర్ణణాతీతం. అందుకే అతని జ్ఞాపకంగా ఈ అధునాతన సాంకేతికతను ఉపయోగించి సరికొత్త ప్రయోగానికి తెర తీశారు.
T.V.SRIKAR