Exams: ఇకపై పోటీపరీక్షా పత్రాల తయారీలో టెక్నాలజీదే కీలకపాత్ర.. ఎందుకో తెలుసా..?
పరీక్షలకే పరీక్షా కాలంగా మారిపోయాయి ప్రస్తుత పరిస్థితులు. దీనికి నిలువెత్తు నిదర్శనంగా టీఎస్పీఎస్సీలో జరిగిన పేపర్ లీకేజీ సంఘటను చెప్పాలి. ఇలా ప్రతిసారీ జరిగితే అత్యంత విలువైన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. అందుకే దీనికోసం ప్రత్యేక అధునాతనమైన బ్లాక్ చైన్ సాంకేతికతను రూపొందిస్తున్నారు.
ఇకపై జరిగే పోటీ పరీక్షలకు పూర్తిస్థాయిలో భద్రతను కల్పిస్తూ.. అత్యంత పటిష్టంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసేందుకు ఉన్నత విద్యామండలి తమ ఆలోచనలను పదునుపెట్టింది. ఈ సరికొత్త సాంకేతిక విధానాన్ని ఈ ఏడాది మే నెలలో జరిగే ఎంసెట్ పరీక్షలకు ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ఇప్పటికే అన్ని అగ్రదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి టెక్నికల్ లోపాలు లేకుండా ఆచరణాత్మకమైన పనితీరును కనబరుస్తున్నాయి. దీనిని ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారో తెలుసుకుందాం.
అభ్యర్థి ఐపీ ఆధారంగా..
పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక అధికారులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. ప్రశ్నాపత్రం తయారు చేసే వారి దగ్గర నుంచి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తుల వరకూ అందరి వ్యక్తిగత వివరాలను తీసుకుంటారు. ఈవివరాల్లో ఆధార్ కార్డు మొదలు వారి అరచేతి ఫింగర్ ప్రింట్స్ వరకూ అన్నీ ఒక ప్రోగ్రామింగ్ చేయబడతాయి. ఇలా చేసిన తరువాత వాటిని ఎవరెవరు లాగిన్ అయ్యారు.? ఎన్ని సార్లు లాగిన్ అయ్యారు.? లాగిన్ అయిన వ్యక్తులు ఏఏ సమాచారాన్ని చూశారు..? అనే రకరకాల వివరాలను సభ్యులందరికీ తెలియజేస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రతిఒక్కరి ఐపీ అడ్రస్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే వారికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు విజువల్ అయ్యే విధంగా రూపకల్పన చేయనున్నారు.
ఎంసెట్ నుంచే అమలయ్యేలా చర్యలు..
ఇక ఎంసెట్ పరీక్షలకు కేవలం నెలన్నర సమయం మాత్రమే ఉండటంతో దీని పనులు యుద్ద ప్రాతిపదికన చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఆదేశించారు. అలాగే తొందర పడి ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ రకమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. భవిష్యత్తులో నిర్వహించే పోటీపరీక్షలకు ఉపయోగించే ఈ సాంకేతికత చాల శక్తివంతమైనదిగా కొందరు టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పుకున్న వివరాల ప్రకారం దీనికి సంబంధించిన బృందం కాకుండా వేరొకరు దీనిని ముట్టుకున్న వెంటనే టీం సభ్యులందరికీ అలారం రూపంలో మెసేస్ నోటిఫికేషన్ వస్తుంది. దీనికికారణం వేలిముద్రల సెన్సార్ పనిచేయడమే అని చెప్పాలి. పరీక్షల బృందంలోని సభ్యులు ఓపెన్ చేస్తే ఏమి ఏమి చూశారో తెలిసిపోతుంది. అదే ఇతర వ్యక్తులు చూస్తే టీం మొత్తానికి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఇలా ప్రశ్నాపత్రాలను భద్రంగా ఉంచవచ్చు. ఈవిధానాన్ని కంపూటర్ పరిభాషలో బ్లాక్ చైన్ సాంకేతికత అంటారు.
హ్యాకర్లకి సైతం హడలెత్తేలా ప్రయోగం..
ఇలాంటి వాటిని కూడా ఏదైనా హ్యాకింగ్ సంబంధిత సైట్లద్వారా తస్కరించే ప్రయత్నాలు చేసేవారు ఉంటారు. అందుకే ముందస్తుగా ఆలోచించి అలాంటి వాటిని అరికట్టేందుకు మరో కీలకమైన విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీనినే ఎన్ క్రిప్షన్ పద్దతి అంటారు. దీనివల్ల మరింత భద్రత చేకూరుతుంది. ఎందుకంటే తయారు చేసిన ప్రశ్నాపత్రాలను కంపూటరైస్డ్ కోడింగ్ భాషలో కనిపించేలా ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కోడ్ ని డీకోడ్ చేస్తే ప్రశ్నాపత్రం ఎర్రర్ గా మారిపోతుందే తప్ప లీక్ అవ్వదు. అలాగే దీనిని డీకోడ్ చేయాలంటే పరీక్ష రాసే సంబంధిత అభ్యర్థి మెయిల్ ఐపీ అడ్రస్ ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేరు. ఇలా ఇచ్చినప్పటికీ దీనిని లాగ్ ఇన్ అవ్వాలంటే చాలా వ్యక్తిగతమైన వివరాలను నమోదు చేయాలి. అలా చేయాలంటే ఆ అభ్యర్థి పరీక్షాకేంద్రంలో ఉండి ఆపరేట్ చేయాలి. అప్పుడే అది ఓపెన్ అవుతుంది. అంతవరకూ ప్రశ్నాపత్రం కనిపించడం అనేది అసంభవం. ఒకవేళ కనిపించినా దానిని డీకోడ్ చేయాలంటే అసాధ్యం.
ఇలాంటి అధునాతనమైన, పటిష్టమైన సాంకేతికతను ఉపయోగించడం వల్ల పరీక్షల్లో పారదర్శకతతో పాటూ వ్యవస్థలపై విశ్వసనీయత పెరుగుతుందని చెప్పాలి. ఇది వినడానికి బాగానే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఆచరణకు ఎంతమాత్రం నోచుకుంటుందో తెలియాలంటే ఎంసెట్ పరీక్షల వరకూ వేచిచూడాల్సిందే. ఇవి విజయవంతంగా నిర్వహిస్తే ఇకపై జరిగే కాంపిటేటివ్ పరీక్షలన్నింటినీ అత్యంత పారదర్శకంగా నిర్వహించవచ్చు.
T.V.SRIKAR