LGBTQIA: మైనార్టీ ప్రజల హక్కులను మెజార్టీ ప్రజలు నిర్ణయిస్తారా ? ఇదెక్కడి ప్రజాస్వామ్యం ?

మేమూ మనుషులమే, మాకూ హక్కులుంటాయి అంటూ LGBTQ+ కమ్యూనిటీ న్యాయపోరాటం చేస్తోంది. స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలని, కేవలం తమకున్న సెక్సువల్ ఓరియంటేషన్ కారణంగా తమ హక్కులను హరించడం, నిరాకరించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని LGBTQ+ కమ్యూనిటీ సుప్రీంకోర్టులో వాదిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2023 | 12:43 PMLast Updated on: Apr 24, 2023 | 12:43 PM

Lgbtqia Community Members See Hope In Scs Marriage Hearing

LGBTQIA: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇలాంటి పదాలు భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. చట్టం ముందు అందరూ సమానమే అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. రాజ్యాంగానికి కులం, మతం, లింగ, ప్రాంతం, పేద, ధనిక వంటి తేడాలు ఉండవు. ఈ దేశ పౌరులందరూ సమానులని, ప్రాథమిక హక్కులు దేశ ప్రజలందరికీ సమానంగా వర్తిస్తాయని రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఒక వ్యక్తి కావొచ్చు, ఒక సమూహం కావొచ్చు, లేదా ఒక సమాజం కావొచ్చు.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఈ దేశం వారిపై వివక్ష చూపుతుందనే అర్థం చేసుకోవాలి.
దేశ వ్యాప్తంగా కొంతకాలంగా మ్యారేజ్ ఈక్వాలిటీపై చర్చ జరుగుతోంది. మేమూ మనుషులమే, మాకూ హక్కులుంటాయి అంటూ LGBTQ+ కమ్యూనిటీ న్యాయపోరాటం చేస్తోంది. స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలని, కేవలం తమకున్న సెక్సువల్ ఓరియంటేషన్ కారణంగా తమ హక్కులను హరించడం, నిరాకరించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని LGBTQ+ కమ్యూనిటీ సుప్రీంకోర్టులో వాదిస్తోంది. అధికారిక లెక్కలు లేకపోయినా దేశవ్యాప్తంగా దాదాపు 20 నుంచి 50 లక్షల వరకు LGBTQ+కు చెందిన వ్యక్తులు ఉంటారని అంచనా. వీళ్లందరి మనోభావాలు, అభిప్రాయాలు, డిమాండ్లు అన్నీ 20 పిటిషన్ల రూపంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం వారం రోజులుగా పిటిషన్ల అభిప్రాయాలను ఓపిగ్గా వింటోంది. ఇవాళ్టితో పిటిషనర్ల తరపు వాదనలు పూర్తి చేసి రేపటి నుంచి మ్యారేజ్ ఈక్వాలిటీని వ్యతిరేకిస్తున్న వారి వాదనలను వినబోతోంది.
అనుకూల-వ్యతిరేక వాదనలు
సేమ్ సెక్స్ మ్యారేజెస్ అన్న ప్రతిపాదన న్యాయస్థానం ముందుకు రాగానే భారతీయ సంప్రదాయ సమాజం మొత్తం దీన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టింది. కుటుంబ వ్యవస్థ అంటే స్త్రీ పురుషులు మాత్రమేనని, దానిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలని, అదే సహజమైందని దానికి భిన్నంగా వెళ్తే సమాజం దారితప్పుతుందంటూ కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొంతమంది రిటైర్డ్ న్యాయమూర్తులు సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆలోచనను వ్యతిరేకిస్తూ బహిరంగ లేఖను విడుదల చేయడం, జమాతే ముస్లింతో పాటు వివిధ మతాలకు చెందిన సంస్థలు ముక్తకంఠంతో వ్యతిరేకించడం వేగంగా జరిగిపోయాయి. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్‌ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి వివాహం స్త్రీ పురుషుల వ్యవహారంగానే ఉందని… దానిని అలాగే కొనసాగించకపోతే భవిష్యత్తు సమాజం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని తెలిపింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాలని సూచించింది.

lgbtqia
సమాజం మొత్తం వ్యతిరేకిస్తుందా ?
మ్యారేజ్ ఈక్వాలిటీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చింది. 99.9శాతం సమాజం మ్యారేజ్ ఈక్వాలిటీకి వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చింది. అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఈ దేశం మొత్తం మ్యారేజ్ ఈక్వాలిటీని వ్యతిరేకిస్తుందనే అర్థం. పోనీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభిప్రాయం సరైనదే అనుకున్నా… మిగతా 0.1 శాతం అభిప్రాయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదని LGBTQ+ కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు.
ఏది సహజం? ఏది అసహజం ?
LGBTQ+ కమ్యూనిటీ హక్కుల గురించి, వారి జీవన విధానం గురించి మాట్లాడటం మొదలు పెట్టగానే మెజార్టీ సమాజం ఒకేరకమైన అభిప్రాయంతో స్పందిస్తుంది. అది అసహజం.. ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధమని. వాస్తవానికి హోమోసెక్సువాలిటీ అన్నది నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదు. మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి హోమోసెక్సువాలిటీ ఉంది. భారతీయ సమాజం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కాకపోతే బయాలాజికల్ మెన్, బయాలాజికల్ ఉమెన్ మధ్య సంబంధాలు మాత్రమే మెజార్టీ సమాజపు సంబంధాలుగా కొనసాగుతున్న సందర్భంలో హోమోసెక్సువల్ రిలేషన్స్ మెజార్టీ సమాజానికి అసంబద్ధంగా కనిపించాయి. హోమోసెక్సువాలిటీ అన్నది లోపం కాదని.. అది కూడా ప్రకృతిధర్మమేనని.. అలాంటి ప్రవృత్తి అసహజం కాదని అంగీకరించడానికి ఇప్పటికీ మెజార్టీ సమాజం సిద్ధంగా లేదు.
మైనార్టీ హక్కులను రక్షించాల్సింది ఎవరు ?
ఇక్కడ మైనార్టీలు అంటే మతపరమైన మైనార్టీల గురించి కాదు మనం మాట్లాడుకుంటోంది. కేవలం తమకున్న సెక్సువల్ ఓరియంటేషన్ కారణంగా మెజార్టీ సమాజం నుంచి వివక్ష ఎదుర్కొంటున్న LGBTQ+ కమ్యూనిటీ గురించి. చైనాను మించిన జనాభా ఉన్న మనదేశంలో LGBTQ+ కమ్యూనిటీ శాతం చాలా తక్కువ కావొచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్లున్నది నామమాత్రమే అనుకోవచ్చు. కానీ మెజార్టీ సమాజం తనకున్న అభిప్రాయంతో వాళ్ల అస్థిత్వానికి భంగం కలిగేలా వ్యవహరించవచ్చా అన్నదే అసలు ప్రశ్న. ఐదేళ్ల క్రితం ఇండియన్ క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రద్దు చేసే వరకూ మన దేశం స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించింది. అంటే ఒక వ్యక్తి తనకున్న సెక్సువల్ ఓరియంటేషన్ కారణంగా ఈ సమాజం ముందు క్రిమినల్‌గా మారిపోయాడు. ఇక్కడే ప్రాథమికంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక వ్యక్తి సెక్సువల్ ఓరియంటేషన్‌ను ఎవరు నిర్ణయిస్తారు? తన పుట్టుకే అలా ఉన్నప్పుడు, వాళ్లను అలానే ఉండమని ప్రకృతి ఆదేశించినప్పుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు? మెజార్టీ సమాజం హెట్రోసెక్సువల్స్ అయినంత మాత్రాన అదే సమాజంలో.. అదే రాజ్యాంగ పరిధిలో బతుకుతున్న హోమోసెక్సువల్ కమ్యూనిటీకి హక్కులు లేకుండా పోతాయా?
మ్యారేజ్ ఈక్వాలిటీ ఎందుకు ?
సేమ్ సెక్స్ మ్యారేజెస్ అన్న పదాన్ని ఉపయోగించడానికి కూడా LGBTQ+ కమ్యూనిటీ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చను మ్యారేజ్ ఈక్వాలిటీగా చూడాలని వాళ్లు కోరుకుంటున్నారు. దాని కోసమే పోరాటం చేస్తున్నారు. LGBTQ+ కమ్యూనిటీ మ్యారేజ్ ఈక్వాలిటీ కోసం పోరాడటం వెనుక చాలా కారణాలున్నాయి. పెళ్లి ద్వారా చట్టబద్దంగా సంక్రమించే రాజ్యాంగపరమైన హక్కుల కోసమే ఇదంతా. మెడికల్ టీట్ర్‌మెంట్, ఇన్సూరెన్స్, పిల్లల పెంపకం( పెంచుకుంటే) ఇలా అనేక సమస్యలకు పరిష్కారం మ్యారేజ్ ఈక్వాలిటీ ద్వారా సాధించవచ్చు. అందుకే పార్టనర్‌ను సెలక్ట్ చేసుకోవడం నుంచి వాళ్లతో కలిసి జీవించడం వరకు హెట్రోసెక్సువల్ కపుల్స్ తరహాలోనే తమని కూడా ట్రీట్ చేయాలని LGBTQ+ కమ్యూనిటీ కోరుకుంటోంది. దాని కోసమే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది.

lgbtqia
పార్లమెంట్ ఉండగా సుప్రీంకోర్టు ఎందుకు ?
అసలు ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని.. నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్లమెంట్‌కు వదిలేయాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. కేవలం ఐదుగురు న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయం కాదని.. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని, పార్లమెంట్‌లో చర్చించి, మెజార్టీ అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతుందని చెబుతోంది. అయితే ఇక్కడే రాజ్యాంగపరమైన ప్రశ్న తలెత్తుతోంది. అదే మెజార్టీ అభిప్రాయం. సెక్షన్ 377ను రద్దు చేసే విషయంలో పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మ్యారేజ్ ఈక్వాలిటీ విషయంలో మాత్రం గట్టిగానే వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్‌లో చర్చించాల్సిందే అంటోంది. కానీ పార్లమెంట్ ఏం చేయగలదు? మెజార్టీ సమాజం అభిప్రాయమే పార్లమెంట్‌లోనూ వ్యక్తమవుతుంది. అందుకే LGBTQ+ కమ్యూనిటీ పార్లమెంట్‌పై విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. కోర్టులో మాత్రమే తమకు న్యాయం జరుగుతుందని వాదిస్తోంది.
సుప్రీంకోర్టు ఏం చేయబోతోంది ?
సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్దత కల్పించకపోతే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లా కాదా అన్న ప్రశ్నకు సుప్రీంకోర్టు సమాధానం చెబితే.. LGBTQ+ కమ్యూనిటీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. మెజార్టీ సమాజం అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? లేక హక్కులన్ని ఎవరికైనా హక్కులే అన్న విశాల హృదయంతో తీర్పు ఇస్తుందా అన్నది వేచిచూడాలి. అంతిమంగా LGBTQ+ కమ్యూనిటీకి ఒక భరోసా కావాలి. తమకున్న సెక్సువల్ ఓరియంటేషన్ కారణంగా ఈ దేశం తమను సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూస్తుందన్న భావన నుంచి వాళ్లను బయటపడేయాలి. హక్కులన్ని కులం, మతం, ప్రాంతం, లింగం అలాగే సెక్సువల్ ఓరియంటేషన్‌తో సంబంధం లేకుండా ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలి. అది తీర్పు ద్వారా జరుగుతుందా లేక పార్లమెంట్ చర్చిస్తుందా అన్నది మరికొన్ని రోజుల్లోనే తేలుతుంది.