Love Failure Song: అనితా.. ఓ అనితా.. నాగరాజు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..!?

అనితా.. ఓ అనితా అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఈ పాట రాసింది ఎవరో తెలియకున్నా.. ఆ పాట మాత్రం ఇంతింతై వటుడింతై దానిపైనంతై అన్నట్లుగా ఖండాలు, దేశాలు, ఎల్లలు దాటి వెళ్లిపోయింది. బహు ప్రాశస్థ్యం పొందింది. ఆపాట వినేందుకు ఎంత కమ్మగా ఉన్నా.. దాని వెనుక మాత్రం కనిపించనంత శోకం దాగి ఉంది. ఆ శోకపు జ్వాల చల్లారకముందే.. కాలం మరో రూపంలో సుడిగుండాల హోమానికి ఆజ్యం పోసింది. ఇంకేముంది ఈ పాటకు జీవంపోసిన అతని జీవితంలో అనేక ప్రచండ శక్తులు తోడయ్యాయి. దీంతో యుద్దం చేసేందుకు అస్త్రాలు నాగరాజు దగ్గర లేవు. అటు ప్రేమించిన మహిళ.. ఇటు నమ్ముకున్న కళ.. ఇతని జీవితాన్ని కకావికలం చేసింది. ఈ విషాద సాగరం నుంచి కోలుకొని హూస్సేన్ సాగర్ తీరాన ఉన్న హైదరాబాద్ లో తిరిగి నివసిస్తూ మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అనిత ప్రేమాయణం నుంచి సగటు జీవి సాధారణ ప్రయాణం సాగిస్తున్నాడు. అదే క్రమంలో అనిత పార్ట్ 2 అంటూ సరికొత్త లిరిక్స్ తో సంగీత ప్రియులను ఉర్రూతలూగించేందుకు సిద్దం అయ్యారు. ఈ మట్టిలో మాణిక్యం ఇన్నాళ్లు ఏమైపోయారు.. అసలు ఈ లవ్ స్టోరీ ఏంటి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు.. అనే మొత్తం వివరాలు చదివేద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2023 | 03:30 PMLast Updated on: Apr 11, 2023 | 3:32 PM

Love Failure Song Nagaraju Life Story

మన సమాజంలో చాలా మంది కళాకారులు, ప్రతిభావంతులు ఉంటారు. కానీ వారిని మన సమాజం పట్టించుకోదు. ఎవరైనా చేయూత ఇస్తే వినోదం చూస్తుంది. కానీ అక్కడి చోద్యాన్ని గుర్తించదు. అలా గుర్తింపు పొందిన సంగీత, సాహిత్య రూపానికి ప్రాణం పోసి దేహరూపాన్ని అందిస్తే చాలా మంది నాగరాజులు వెలుగులోకి వస్తారు. అలా కాకుండా వారిని అగాధంలోకి నెట్టేస్తే అద్భుతాలను అంధకారంలోకి తోసేసినట్లు అవుతుంది. సరిగ్గా ఇలా జరిగిందే ఈ నాగరాజు జీవితం.

నాగరాజు ప్రేమాయణం:
డిగ్రీ చదువుతున్న రోజుల్లో నాగరాజు.. అనిత అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరికీ ఇష్టంగానే కొన్నాళ్లు టూసైడ్ ప్రేమ ప్రయాణం సాగించారు. పెళ్లి విషయానికొచ్చే సరికి విచిత్రమైన మజిలి ఏర్పడింది. అమ్మాయి ఇంట్లో వాళ్లు ఒప్పుకోని కారణంగా ఆమెకు వేరొకరితో పెళ్లి చేసేశారు అనిత కుటుంబసభ్యులు. ఇక చేసేదేమి లేక తన ప్రేయసి గురించి ఒక పాటను రాసుకున్నాడు నాగరాజు. ఆపాట కేవలం అనిత ఒక్కతి వింటే చాలనుకొని దాని రికార్డింగ్ కు తన సొంత డబ్బలను ఖర్చు చేశాడు. అలా తన స్నేహితులతో కలిసి ఆల్బమ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఆపాటల ప్యాక్ లో ఈ అనితా అనే పాట సెన్సేషన్ అయ్యింది. ఎంతగా అంటే ఒక నేషనల్ మ్యాగజైన్ ఈ పాట గురించి రాసేంతగా హిట్ అయ్యింది. ఇంతకు ఈ మ్యగజైన్ లో వచ్చిన వివరాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. నాగరాజు ఆపాట కోసం ఖర్చు చేసింది మూడు వేలు అయితే.. ఆపాట పై రకరకాల మాధ్యమాలవారు సంపాదించింది మాత్రం కోటి రూపాయలు పైనే అంటూ కథనాన్ని ముద్రించింది. కానీ ఈ పేదవాడు మరింత పేదవాడిగా మారిపోయాడు. ఇక కట్ చేస్తే అనితకు వేరే వారితో పెళ్లి అయిపోయింది. అదే సమయంలో ఇతనికి చాలా సినిమా అవకాశాలు వరించాయి. అదృష్టం ఇతనిని వరించినా దురదృష్టం బలంగా కొడుతూ వచ్చింది. దీంతో వచ్చిన అవకాశాలు అన్నీ వదులుకోవల్సి వచ్చింది. ఆదిత్యా మ్యూజిక్ వాళ్లు సైతం ఇతని గడప తొక్కారు అంటే ఇతని ప్రతిభ ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

జీవితంలోని ఉపద్రవం:
అనితకు మరొకరితో పెళ్లి అయ్యాక కొన్ని రోజులకు నాగరాజుని ప్రేమించే మరో అమ్మాయి ఇతని జీవితంలోకి ప్రవేశించింది. అతని ప్రేమ వైఫల్యాన్ని చూసి అర్థం చేసుకోని అర్థాంగిలా మారి జీవితాన్ని పంచుకుంది. తన బ్రతుకు జీవనం చూసుకునేందుకు చిన్న పాన్ డబ్బా వ్యాపారాన్ని పెట్టుకొన్నాడు. ఇలా డక్కా ముక్కీలు తిని సంసారం సాగిస్తున్న తరుణంలో ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. పెద్దవాళ్లయ్యేకొద్దీ వారిలోని లోపం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లలకు వినిపించదు.. మాట్లాడేందుకు రాదు. తన తండ్రి పాట ప్రపంచం మొత్తం వింటున్నా.. ఆనందిస్తున్నా కన్న కొడుకులు వినలేని.. మాట్లాడలేని పరిస్థితి. ఇంతటి దు:ఖ సాగరపర్యంతంలో తపిస్తూ అలుపెరుగని శ్రామికుడిలా.. కునుకెరుగని స్వాప్నికుడిలా జీవనపోరాటం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఇతని కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. కొందరు ఇతనికి సాహిత్యాన్ని అందించమని.. మరికొందరు స్వరాన్ని ఇవ్వమని అడిగేందుకు ముందుకు వస్తున్నారు. అనిత ఫేం నాగరాజు అనే పేరు యూట్యూబ్ లో కొడితే వందలాది పాటలు ప్రత్యక్షమౌతాయి. కళాకారుడికి కళామతల్లి ఇచ్చిన గౌరవం ఇది. ఇతని విధిరాతను రాసిన బ్రహ్మకు ఈర్శ కలిగిందేమో బహుషా.. ఎందుకంటే అతని భార్య సరస్వతి దేవికి మించిన సాహిత్య, సంగీత జ్ఞానం నాగరాజులో ఉందని. అందుకే ఇలా విచిత్రమైన విధిలీలతో ఆడుకుంటున్నట్లు ఉన్నాడు.

ప్రస్తుత బ్రతుకు బండి:
ఇతనిలోని కళను తోబుట్టువు అయిన అతని తమ్ముడు గుర్తించాడు. అందుకే ఇతనిని కొందరు సామాజిక మాధ్యమాల్లో చంపేసినప్పటికీ.. సమాజంలో తరిగి జన్మించమని ప్రోత్సహిస్తున్నాడు. ప్రస్తుతం తన సోదరుని ఇంట్లో ఉండి.. రికార్డింగ్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. వారానికి ఒకసారి ఊరెళ్లి తన భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుతూ జీవన యాత్ర సాగిస్తున్నాడు. ఇది ఇతనికి వరించిన మరో జన్మగా చెప్పాలి. గత జన్మలో అనిత పాట ద్వారా తిరుగులేని గాయకుడిగా మారితే.. ఇప్పుడు ఎదురులేని సాహిత్య మృత్యుంజయునిగా మారాలని కోరుకుందాం.

 

T.V.SRIKAR